హెచ్ సిఏలో ముసలం: ఏకాకిగా అజరుద్దీన్, వేటుకు రంగం సిద్ధం..!

By team teluguFirst Published Sep 8, 2020, 1:21 PM IST
Highlights

అధ్యక్షుడితో కలిపి ఆరుగురు సభ్యులుండే హెచ్ సి ఏ కార్యవర్గంలో అజర్‌ ఒక్కడు ఒకవైపు అయిపోగా మిగిలిన వారంతా అతడికి వ్యతిరేకంగా గ్రూపు కట్టారు. 

దేశానికి ఎందరో గొప్ప క్రికెటర్లను అందించిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రస్తుతం వివాదాల్లో కూరుకుపోయింది. హైదరాబాద్ నుండి జాతీయ జట్టుకు నాయకత్వం వహించి, తదుపరి హెచ్ సి ఏ బాధ్యతలను చేపట్టిన అజారుద్దినే ఈ వివాదాలకు కేంద్ర బిందువు అవడం ప్రస్తుతం చర్చనీయాంశమయింది. 

హెచ్ సిఏ ని సమూలంగా ప్రక్షాళన చేసి మేటి క్రికెటర్లను అందించే బోర్డుగా రూపొందిస్తానని చెప్పిన అజారుద్దీన్ రాక ఏకంగా హెచ్ సి ఏ లో విభేదాలను సృష్టిస్తుంది. ఇది ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్ళింది. 

గత కొంత కాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న వివాదాలు అంబుడ్స్ మ్యాన్ నియామకంతో ఈ వివాదం రచ్చకెక్కింది. ఇప్పటికే హెచ్ సి ఏ లో గ్రూపులున్నాయి.... అజార్ రాకతో అందరిని ఒక్కతాటిపైకి తెస్తాడని అనుకున్నారు. కానీ వైరి వర్గాలను దగ్గరకు చేసుకోవడం పక్కకుంచితే.... ఆయన తన సాన్త్వ వర్గం నుండే ప్రస్తుతం తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు. 

అజారుద్దీన్ తెలంగాణ ప్రభుత్వంతో చాలా సన్నిహితంగా మెలుగుతున్న విషయం తెలిసిందే. ఆయన ఇలా తరచు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ లను కలుస్తున్నప్పటికీ.... కార్యవర్గ సభ్యులకు ఎవరికీ కూడా సమాచారం ఇవ్వకపోవడం, అధికారికంగా హెచ్ సి ఏ అధ్యక్షా హోదాలో వారితో భేటీకి సభ్యులను కాకుండా తనకొడుకును తీసుకెళ్లడం వారి మధ్య అగాధాన్ని పెంచింది. 

తాజాగా హెచ్‌సీఏ కోశాధికారి సురేందర్‌ అగర్వాల్‌, మాజీ ఉపాధ్యక్షుడు మొయినుద్దీన్‌ తనను దూషించారని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అజరుద్దీన్‌ ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. దీనితో వివాదం మరింత రచ్చకెక్కింది. ఈ సంఘటనతో అధ్యక్షుడితో కలిపి ఆరుగురు సభ్యులుండే హెచ్ సి ఏ కార్యవర్గంలో అజర్‌ ఒక్కడు ఒకవైపు అయిపోగా మిగిలిన వారంతా అతడికి వ్యతిరేకంగా గ్రూపు కట్టారు. 

హెచ్‌సీఏ రాజ్యాంగం ప్రకారం అంబుడ్స్‌మన్‌, ఎథిక్స్‌ ఆఫీసర్ ని నియమించాలంటే తొలుత అపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చించి ఆ తర్వాత ఏజీఎంలో ఆ అంశాన్ని ప్రతిపాదించాలి. కరోనా నేపథ్యంలో ఇప్పుడు ఏజీఎంను సమావేశపర్చలేము కాబట్టి ముందు అంబుడ్స్‌మన్‌ను నియమించి అనంతరం వార్షిక సర్వసభ్య సమావేశంలో దానికి సభ్యుల అంగీకారం తీసుకుందామని ప్రతిపాదించాడు. 

కార్యవర్గ సభ్యులు దీన్ని వ్యతిరేకిస్తూ... ఇది నిబంధనలకు విరుద్ధమని, ఏజీఎంలోనే నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. ఈ తతంగం నడుస్తుండగానే....  అజర్‌ అనూహ్యంగా ఈనెల 2న నెలకు 2 లక్షలు వేతనం చెల్లించేలా సుప్రీంకోర్టు మాజీ జస్టిస్‌ దీపక్‌ను అంబుడ్స్‌మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. 

ఇక దీనితో వివాదం ముదిరి పాకాన పడడంతో.... అజర్‌ లేఖను ఖండిస్తూ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌, ఉపాధ్యక్షుడు జాన్‌ మనోజ్‌తో సహా మిగిలిన సభ్యులంతా దీపక్‌ వర్మకు జరిగిన సంఘటనలను వివరిస్తూ లేఖ రాశారు.  

ఈ సంఘటనతో ఆగ్రహంతో ఊగిపోయిన అజర్‌.. వారి లేఖ చెల్లదని అంబుడ్స్‌మన్‌గా బాధ్యతలు తీసుకోవాలని దీపక్‌వర్మకు మరో లేఖ రాసాడు. అంతే కాకుండా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జైషాకు కూడా మరో లేఖ  రాశాడు.

ఇక ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో అజర్ కి చెక్ పెట్టాలని ఇప్పుడు హెచ్ సి ఏ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఈ నెల 15వ తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుండడంతో.... అందరి దృష్టి దీనిపైన్నే ఉంది. మెజారిటీ క్లబ్ లు, కార్యవర్గ సభ్యుల మద్దతును కూడగడుతున్న కార్యదర్శి విజయానంద్.... అపెక్స్ కౌన్సిల్ లో అజర్ పై వేటు వేసేందుకు తీర్మానం ప్రవేశ పెట్టాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. 

click me!