నా బౌలింగ్ పదును వెనక రహస్యమదే: దీపక్ చాహర్

By Arun Kumar PFirst Published Aug 8, 2019, 5:11 PM IST
Highlights

వెస్టిండిస్ తో ముగిసిన టీ20 సీరిస్ లో టీమిండియా యువ బౌలర్ దీపక్ చాహర్ అదరగొట్టాడు. కేవలం చివరి టీ20  మ్యాచ్ లో  మాత్రమే ఆడిన చాహర్ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు.  

దీపక్ చాహర్... ఐపిఎల్ లో ఎక్కువగా వినిపించే ఈ పేరు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ లోనూ వినిపిస్తోంది. వెస్టిండిస్ తో ఇటీవల ముగిసిన టీ20 లీగ్ ద్వారా అందివచ్చిన అవకాశాన్ని సద్వానియోగం చేసుకున్నాడు. ఈ సిరిస్ అతడికి కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. అందులోనే అతడు తన బౌలింగ్ సత్తాను చాటిచచెబుతూనే ఓ రికార్డును కూడా సాధించాడు. 

ప్లోరిడాలో జరిగిన రెండు టీ20ల్లోనూ దీపక్ చాహర్ డ్రెస్సింగ్ రూం కే పరిమితమయ్యాడు. ఈ రెండు మ్యాచుల్లో గెలవడంతోనే  కోహ్లీసేన 3టీ20 మ్యాచుల సీరిస్ ను కైవసం చేసుకుంది. దీంతో  నామమాత్రంగా జరిగిన మూడో మ్యాచ్ టీమిండియా ప్రయోగాలు చేసింది. ఇలా దీపక్ చాహర్ తో పాటు అతడి సోదరుడు రాహుల్ చాహర్ కు కూడా చివరి టీ20లో ఆడే అవకాశం వచ్చింది. 

అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన విండీస్ ను దీపక్ బెంబేలెత్తించాడు. వరుసగా ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ ని వెంటవెంటనే పెవిలియన్ పంపించి టీమిండియాకు శుభారంభం అందించాడు. ఇలా అతడు నిర్ణీత ఓవర్లలో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఇలా విండీస్ పై ఒకే టీ20 మ్యాచ్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన క్రికెటర్ గా చాహర్ అరుదైన రికార్డు సాధించాడు. 

ఈ మ్యాచ్ అనంతరం చాహర్ మాట్లాడుతూ ఈ ప్రదర్శన ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. నెట్స్ లో పాత బంతితో బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం తనకెంతో  ఉపయోగపడుతోందన్నాడు. ఇలా పాత బంతి నుండి స్వింగ్ ను రాబట్టడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టే కొత్తబంతి నుండి ఈజీగా స్వింగ్ రాబట్టగలిగానని అన్నాడు. అందువల్లే బంతి కాస్త మెరుగుపడే లోపే తన పనికానిచ్చేశానని  తెలిపాడు. ఇలా తన బౌలింగ్ రాటుదేలడానికి పాత బంతితో ప్రాక్టీస్ చేయడం ఎంతగానో ఉపయోగపడిందంటూ చాహర్ వెల్లడించాడు.

చివరి టీ20లో విండీస్ టాప్ ఆర్డర్ ను బెంబేలెత్తించిన దీపక్ చాహర్ ను  కోహ్లీ కూడా కొనియాడాడు. ''సీనియర్ పేసర్ భువనేశ్వర్ మాదిరిగానే చాహర్ కూడా కొత్త బంతితో అద్భుతాలు చేయగలడు. ఈ మ్యాచ్ ద్వారా అందరికీ  ఆ విషయం అర్థమైవుంటుంది. కొత్త బంతి నుండి స్వింగ్ ను ఎలా రాబట్టాలో అతడికి బాగా  తెలుసు. అంతర్జాతీయ క్రికెట్ లో మంచి  నైపుణ్యమున్న బౌలర్లలో అతడొకడు.'' అని కోహ్లీ అన్నాడు. 

 గయానా వేదికన జరిగిన చివరి టీ20 మ్యాచులో కూడా టీమిండియా అన్ని విభాగాల్లో ఆదిపత్యం ప్రదర్శించింది. ఈ మ్యాచ్ మొదట బౌలింగ్ లో దీపక్ చాహర్...ఆ తర్వాత లక్ష్యఛేదనలో కెప్టెన్ కోహ్లీ, వికెట్ కీపర్ రిషబ్ పంత్ అదరగొట్టారు. చాహర్ విండీస్ కు చెందిన ముగ్గురు టాప్ ఆర్డర్ వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. లక్ష్యఛేదనలో టీమిండియా కేవలం 27పరుగులకే ఓపెనర్లిద్దరికి కోల్పోయి క్లిష్ట సమయంలో వున్నపుడు కోహ్లీ(59 పరుగులు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి రిషబ్ పంత్(65 పరుగులతో నాటౌట్) తోడవడంతో భారత్ మరో ఐదు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో టీ20  సీరిస్ టీమిండియా వశమయ్యింది. 
 

click me!