జీతభత్యాల కోసం యువరాజ్ సేన తిరుగుబాటు...

By Arun Kumar PFirst Published Aug 8, 2019, 4:21 PM IST
Highlights

కెనడా వేదికన జరుగుతున్న గ్లోబల్ టీ20 లీగ్ లో బుధవారం గందరగోళం ఏర్పడింది. యువరాజ్ సింగ్ సారథ్యంలోని టోరంటో జట్టు మ్యాచ్ ఆడకుండా నిరసనకు దిగింది.  

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ నిరసన బాట పట్టాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన అతడు విదేశాల్లో జరిగే లీగుల్లో మాత్రం పాల్గొంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా అతడు రిటైర్మెంట్ తర్వాత కెనడా వేదికన జరుగుతున్న గ్లొబల్ టీ20 లీగ్ లో పాల్గొంటున్నాడు. ఇందుకోసం అతడు చేసుకున్న ఒప్పందం ప్రకారం లీగ్ నిర్వహకులు జీతభత్యాలు చెల్లించడంలేదు. దీంతో యువరాజ్ సింగ్ నిరసనకు దిగాడు.  

యువరాజ్ తో పాటు అతడి సారథ్యంలోని టోరంటో నేషన్స్ జట్టు సభ్యులందరు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఆస్ట్రేలియా ప్లేయర్ జార్జ్ బెయిలీ కెప్టెన్సీలోని ప్రత్యర్థి జట్టు మాంట్రియల్ టైగర్స్ ఆటగాళ్లు కూడా ఇదే బాటలో నడిచారు. దీంతో బుధవారం షెడ్యూల్ ప్రకారం ప్రారంభంకావాల్సిన మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యింది.

ఆటగాళ్లు హోటల్ నుండి కనీసం మైదానానికి కూడా రావడానికి నిరాకరించారు. దీంతో లీగ్ నిర్వహకులే హుటాహుటిన హోటల్ కు చేరుకుని ఆటగాళ్లతో చర్చలు జరిపారు. వారికి ఇవ్వాల్సిన జీతభత్యాల విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఇరు జట్ల ఆటగాళ్లు శాంతించడంతో నిర్వహకులు ఊపిరిపీల్చుకున్నారు. కాస్త ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమయ్యింది. 

యువరాజ్ సారథిగా వ్యవహరిస్తున్న టోరంటో జట్టులో పొలార్డ్, మెక్లీనగన్, మెక్ కల్లమ్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లున్నారు. అలాగే మాంట్రియల్ టీంలో ఆసిస్ ఆటగాడు జార్జ్ బెయిలీతో పాటు సునీల్ నరైన్,  తిసారా పెరీరాలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరందరితో పాటు స్థానిక ఆటగాళ్లకు కూడా గ్లోబల్ లీగ్ నిర్వహకులు భారీమొత్తంలో బాకీ పడ్డారు.  
 

click me!