
తొలి టెస్టులో టీమిండియా పట్టు సాధించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 52/1 వద్ద నిలిచిన టీమిండియా, ఆఖరి రోజు మరో 157 పరుగులు సాధిస్తే విజయాన్ని సొంతం చేసుకుంటుంది. చేతిలో ఇంకా 9 వికెట్లు ఉండడంతో భారత జట్టు విజయ సూచనలు కనిపిస్తున్నాయి...
రోహిత్ శర్మతో పాటు ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్... ఇలా బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది... బుమ్రా కూడా తొలి ఇన్నింగ్స్‌లో బౌండరీలు బాదాడు..
ఐదో రోజు భారత బ్యాట్స్‌మెన్ మరీ దారుణమైన పర్ఫామెన్స్ ఇవ్వకపోతే చాలు, గెలవడం అంత కష్టమేమీ కాదు. అయితే భారత జట్టు ఆశలపై వాతావరణం నీళ్లు చల్లేలా కనిపిస్తోంది. రెండు, మూడో రోజు ఆటకు అంతరాయం కలిగించిన వరుణుడు, ఐదో రోజు కూడా పలకరించాడు.
ఉదయం నుంచే వర్షం కురవడంతో ఐదో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభం కానుంది. వాతావరణ శాఖ రిపోర్టును చూస్తే అసలు ఆట సాధ్యమవుతుందా? లేదా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి...
డబ్ల్యూటీసీ ఫైనల్ పరాభవం తర్వాత జరుగుతున్న తొలి టెస్టు కావడంతో ఈ మ్యాచ్‌లో గెలిచి మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది టీమిండియా. అయితే వాతావరణం, అదృష్టం మాత్రం కలిసి వచ్చేలా కనిపించడం లేదు...