
ఆస్ట్రేలియా ఓపెనర్, సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ సారథి డేవిడ్ వార్నర్ ఇప్పట్లో పుష్ప సినిమాను వదిలేలా లేడు. ఈ సినిమా విడుదలయ్యాక.. ఇందుకు సంబంధించి వార్నర్ చేసినన్ని వీడియోలు ఎవరూ చేయలేదంటే అతిశయోక్తి కాదేమో.. ఇప్పటికే ఈ సినిమాలోని పలు డైలాగులు, పాటలు, స్టెప్పులతో అలరించిన ఈ ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు.. తాజాగా మళ్లీ కొత్త వీడియోతో తన అభిమానులను కనువిందు చేశాడు. ఇన్నాళ్లు డైలాగులు చెప్పిన వార్నర్.. ఈసారి పుష్ప సినిమా హీరోయిన్ రష్మిక మందన వెంట పడ్డాడు. రష్మిక ‘సామి సామి..’ అంటున్నా వినకుండా.. ఆమెతో హంగామా చేశాడు.
పుష్పి సినిమాలోని ‘తగ్గేదేలే..’ ‘చూపే బంగారమాయేనే.. శ్రీవల్లి’ ‘యే బిడ్డా ఇది నా అడ్డా’ అంటూ వార్నర్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తాజాగా విడుదల చేసిన వీడియో మాత్రం దానికి మించి ఉంది.
ఈ వీడియోలో రష్మిక ‘సామి సామి’ పాటలో బన్నీతో చేసిన సన్నివేశాలలో.. తన ముఖం కనిపించేలా ఎడిట్ చేశాడు వార్నర్. ఫేస్ యాప్ ద్వారా ఫన్నీ వీడియోలు రూపొందించే వార్నర్.. పుష్ప సినిమాలో బన్ని రష్మిక వెనుకపడటానికి సంబంధించిన సన్నివేశాలను ఇమిటేట్ చేశాడు. బన్నీ మేనరిజమ్స్ ను ఉన్నది ఉన్నట్టుగా దించేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
వార్నర్ ఇదివరకే పుష్ప సినిమాకు సంబంధించిన పలు వీడియోలు రూపొందించిన విషయం తెలిసిందే. అతడే కాదు.. వార్నర్ పిల్లలు కూడా ‘సామి సామి ’ పాటకు స్టెప్పులేశారు. ఇక వార్నర్ ను ఇన్ స్టాలో ఫాలో అయ్యే అల్లు అర్జున్.. అతడి పోస్టులకు లైకులు, కామెంట్లు చేస్తుంటాడు. అల వైకుంఠపురం సినిమాతో ప్రారంభమైన ఈ ఇద్దరి సోషల్ మీడియా జర్నీ.. నిరాటంకంగా కొనసాగుతున్నది.
ఇదిలాఉండగా ప్రస్తుతం పాక్ పర్యటనకు వస్తున్న ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా ఉన్న వార్నర్.. ఈ సిరీస్ లో కూడా రాణించాలని ఆశిస్తున్నాడు. ఇటీవలే ముగిసిన యాషెస్ సిరీస్ లో అతడు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక పాక్ పర్యటన ఏప్రిల్ 5తో ముగిసిన వెంటనే అతడు ఇండియాకు రానున్నాడు. ఇక్కడ.. ఐపీఎల్-15 సీజన్ లో ఢిల్లీ తరఫున ఆడనున్నాడు. ఈ సీజన్ లో ఢిల్లీ జట్టు అతడిని రూ. 6.25 కోట్లకు వేలంలో దక్కించుకున్న విషయం తెలిసిందే.