
గత రాత్రి చెన్నైతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో చేతులెత్తేయడంతో ఆ జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపుగా మూసుకుపోయాయి.
ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించడంతో 12 పాయింట్లతో ఉంది. ఇక ఈ సీజన్‌లో ఆ జట్టుకు మిగిలింది ఒక్క మ్యాచే. అందులోనూ భారీ తేడాతో గెలుపొంది రన్‌రేట్ మెరుగుపర్చుకోవాలి.
అదొక్కటే కాదు పంజాబ్, హైదరాబాద్ జట్లు తదుపరి మ్యాచ్‌ల్లో ఓటమిపాలవ్వాలి. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతం జరిగితే తప్పించి కోల్‌కతా ప్లే ఆఫ్స్‌కు చేరడం కష్టమే.
అయితే, ఆ జట్టు మెంటార్ డేవిడ్ హస్సీ మాత్రం గెలుపు ధీమాతో ఉన్నాడు. కోల్‌కతా కచ్చితంగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుందని, అక్కడ ఇతర జట్లను ఆశ్చర్యపరిచి విజయం సాధిస్తుందని చెప్పాడు.
మ్యాచ్‌లు ఓడిపోయి మాకు మేమే ఇలాంటి స్థితికి చేరుకున్నామని హస్సి అన్నాడు. అయితే, తామింకా పోటీలోనే ఉన్నామని.. కొద్దిరోజుల్లో మేం మెరుగై అత్యుత్తమ ప్రదర్శన చేస్తామని స్పష్టం చేశాడు.
ఈ పోటీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరని డేవిడ్ హస్పి వ్యాఖ్యానించాడు. చెన్నై గెలుపొందడంపై స్పందించిన అతడు.. ఈ మ్యాచ్‌లో చెన్నై అత్యుత్తమ ప్రదర్శన చేసిందని, విజయానికి అర్హమైన జట్టని కొనియాడాడు.
రాయుడు, రుతురాజ్ అద్బుతంగా ఆడటంతో చెన్నై విజయం సాధించిందని వివరించాడు. అలాగే తమ బ్యాట్స్‌మన్ నితీశ్ రాణా ఈ సీజన్‌లో నిలకడగా రాణిస్తున్నాడని, అతడికి ఇది మంచి సీజన్ అని డేవిడ్ హస్సీ పేర్కొన్నాడు.