
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో భారత జట్టు 154 పరుగుల ఓ మోస్తరు స్కోరు చేయగలిగింది. టాపార్డర్‌లో స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ మెరుపులు మెరిపించినా మిడిల్ ఆర్డర్ వైఫల్యం కారణంగా భారీ స్కోరు చేయలేకపోయింది భారత జట్టు...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళా జట్టుకి శుభారంభం లభించింది. 17 బంతుల్లో 5 ఫోర్లతో 24 పరుగులు చేసిన స్మృతి మంధాన, క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడింది. తొలి వికెట్‌కి 25 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పితే అందులో స్మృతి మంధాన చేసిన పరుగులే 24...
ఆరంభంలో ఎక్కువగా స్ట్రైయికింగ్ రాకపోయినా స్మృతి మంధాన అవుటైన తర్వాత దూకుడు పెంచింది యంగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ. తెహ్లియా మెక్‌గ్రాత్ వేసిన 9వ ఓవర్‌లో వైడ్ బాల్ ఆడేందుకు ముందుకు వచ్చిన షెఫాలీ వర్మ, వికెట్ కీపర్ హేలీ చేసిన పొరపాటు కారణంగా అవుట్ అవ్వకుండా తప్పించుకుంది...
షెఫాలీ వర్మ క్రీజు దాటి చాలా బయటికి వచ్చేసినా బాల్ ఉన్న కుడి చేతితో కాకుండా ఎడమ చేతితో స్టంపింగ్ చేసిన ఆలీసా హేలీ... భారత ఓపెనర్‌కి లైఫ్ ఇచ్చింది. ఆ ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు బాది 17 పరుగులు రాబట్టింది షెఫాలీ వర్మ. ఆ తర్వాతి ఓవర్‌లో మొదటి బంతికి సింగిల్ తీసేందుకు ప్రయత్నించిన యషికా భాటికా, స్లిప్ కావడంతో రనౌట్ రూపంలో వెనుదిరిగింది..
12 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన యాషికా భాటియా, షెఫాలీ వర్మతో కలిసి రెండో వికెట్‌కి 43 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పింది. హర్మన్‌ప్రీత్ క్రీజులోకి వస్తూనే ఫోర్ బాదడం, డార్సీ బ్రౌన్ ఓవర్‌లోనూ షెఫాలీ వర్మ వరుసగా హ్యాట్రిక్ ఫోర్లు బాదడంతో 11 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 92 పరుగుల భారీ స్కోరు చేసింది టీమిండియా...
జానసెన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన షెఫాలీ వర్మ, వికెట్ కీపర్ హేలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యింది. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా, రివ్యూకి వెళ్లిన ఆసీస్‌కి అనుకూలంగా ఫలితం దక్కింది. ఈ వికెట్‌తో టీ20 క్రికెట్‌లో 100 వికెట్లు పూర్తి చేసుకున్న హేలీ, పొట్టి ఫార్మాట్‌లో ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచింది. పురుషుల క్రికెట్‌లో 91 వికెట్లు తీసిన భారత మాజీ వికెట్ కీపర్ ఎమ్మెస్ ధోనీ రెండో స్థానంలో ఉన్నాడు...
జెమీమా రోడ్రిగ్స్ 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు చేసి అవుట్ కాగా అదే ఓవర్‌లో దీప్తి శర్మ 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరింది. 6 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన హర్లీన్ డియోల్, 19వ ఓవర్‌లో అవుట్ కాగా ఆ ఓవర్ చివరి బంతికి సిక్సర్ బాదింది హర్మన్‌ప్రీత్ కౌర్...
20వ ఓవర్ రెండో బంతికి ఫోర్ బాదిన హర్మన్‌ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. కామన్వెల్త్ గేమ్స్‌లో ఇదే మొట్టమొదటి మ్యాచ్ కావడంతో కామన్వెల్త్ క్రీడల్లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ చేసిన మహిళా క్రికెటర్‌గా చరిత్ర క్రియేట్ చేసింది హర్మన్‌ప్రీత్ కౌర్..
34 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 52 పరుగులు చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన మేఘన్ స్కాట్, ఆ తర్వాతి బంతికి మేఘనా సింగ్‌ని గోల్డెన్ డకౌట్ చేసింది. దీంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది భారత జట్టు..