
ఐసీసీ వుమెన్స్ వరల్డ్ కప్ 2022 టోర్నీలో వెస్టిండీస్ జట్టు బోణీ కొట్టింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో ఆఖరి ఓవర్‌లో విజయాన్ని అందుకుంది వెస్టిండీస్. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మహిళా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది...
ఓపెనర్ డియాండ్ర డాటిన్ 7 బంతుల్లో 3 ఫోర్లతో 12 పరుగులు చేసి అవుట్ కాగా హేలీ మాథ్యూస్ 128 బంతుల్లో 16 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 119 పరుగులు చేసింది. వుమెన్స్ వరల్డ్ కప్ 2022 టోర్నీలో మొదటి సెంచరీ మాథ్యూస్‌దే... కేసియా నైట్ 5, కెప్టెన్ స్టాఫెనీ టేలర్ 47 బంతుల్లో 3 ఫోర్లతో 30 పరుగులు, వికెట్ కీపర్ క్యాంబెల్లీ 38 బంతుల్లో 2 ఫోర్లతో 20 పరుగులు, చేడెన్ నేషన్ 46 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేసి అవుట్ అయ్యారు...
260 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన న్యూజిలాండ్‌కి శుభారంభం దక్కలేదు. సూజీ బేట్స్ 3 పరుగులు చేసి అవుట్ కాగా అమేలా కేర్ 19 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసింది. అమీ సాథర్‌వైట్, లీయా టుహుహు 6, మ్యాడీ గ్రీన్ 9, బ్రూక్ హల్లీడే 3 పరుగులు చేసి అవుట్ అయ్యారు..
162 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది కివీస్. అయితే కెప్టెన్ సోఫియా డివైన్ మాత్రం మరోఎండ్‌లో పాతుకుపోయింది. 127 బంతుల్లో 10 ఫోర్లతో 108 పరుగులు చేసిన సోఫియా డివైన్, చిన్నెల్లే హెన్రీ బౌలింగ్‌లో ఆమెకే రివర్స్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. వికెట్ కీపర్ కేట్ మార్టిన్ 47 బంతుల్లో 4 ఫోర్లతో 44 పరుగులు, జెస్ కేర్ 21 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేయడంతో విజయంపై ఆశలు రేగాయి...
విజయానికి 12 బంతుల్లో 20 పరుగులు కావాల్సిన దశలో వరుసగా రెండు ఫోర్లు బాదింది కేట్ మార్టిన్. దీంతో ఆఖరి ఓవర్‌లో న్యూజిలాండ్ వుమెన్స్ విజయానికి 6 పరుగులు కావాల్సి వచ్చింది. అయితే మ్యాచ్‌లో తొలిసారి బౌలింగ్‌కి వచ్చిన డియాండ్రా డాటిన్, బంతితో మ్యాజిక్ చేసింది...
తొలి బంతికి సింగిల్ మాత్రమే రాగా, రెండో బంతికి మార్టిన్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసింది డాటిన్. మూడో బంతికి మరో సింగిల్ రాగా, నాలుగో బంతికి జెస్ కేర్ కూడా అవుట్ కావడంతో తీవ్ర ఉత్కంఠ రేగింది...
న్యూజిలాండ్ విజయానికి ఆఖరి 2 బంతుల్లో 4 పరుగులు కావాల్సి రాగా.. ఐదో బంతికి జోనస్ రనౌట్ కావడంతో 256 పరుగులకు ఆలౌట్ అయిన న్యూజిలాండ్, 3 పరుగుల తేడాతో ఓటమి పాలైంది...
వుమెన్స్ వరల్డ్ కప్ 2022 టోర్నీలో భాగంగా రేపు బంగ్లాదేశ్ వర్సెస్ సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచులు జరగనున్నాయి. ఆ తర్వాత ఆదివారం పాకిస్తాన్, భారత్ మధ్య మ్యాచ్ జరుగుతుంది.