ఐపీఎల్‌కు మరో దెబ్బ: 17 మంది ఆసీస్ ఆటగాళ్ల గుడ్‌బై...?

By Siva KodatiFirst Published Mar 17, 2020, 10:11 PM IST
Highlights

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐపీఎల్-2020 కూడా కరోనా ధాటికి వాయిదా పడింది. ఇదే సమయంలో ఐపీఎల్ కాంట్రాక్టులపై ఆస్ట్రేలియా క్రికెటర్లు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. 

కరోనా వైరస్ క్రీడారంగంపై పెను ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మెగా టోర్నీలు వాయిదా పడటమో, రద్దవ్వడమో జరిగింది. ఇక క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐపీఎల్-2020 కూడా కరోనా ధాటికి వాయిదా పడింది.

ఇదే సమయంలో ఐపీఎల్ కాంట్రాక్టులపై ఆస్ట్రేలియా క్రికెటర్లు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. కరోనా వైరస్ కోరలు చాస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ కాంగ్రాక్టులు వదులుకోవాలని ఆటగాళ్లు నిర్ణయించినట్లుగా ఆసీస్ మీడియా కథనాన్ని ప్రచురించింది.

Also Read:ఐపీఎల్ వాయిదా: ప్లాన్ ఇదీ... అనుకున్నది అనుకున్నట్టే

మరోవైపు భారత్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం విదేశీ వీసాలను వచ్చే నెల 15 వరకు నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్‌ను బీసీసీఐ ఏప్రిల్ 15 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్‌కు రాకూడదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందిస్తూ... ఐపీఎల్‌లో ఆడాలా..? వద్దా..? అనేది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయం. ఆటగాళ్లు ఐపీఎల్‌తో వ్యక్తిగతంగా ఒప్పందం కుదుర్చుకున్నారన్న విషయం తమకు తెలుసునని, అయితే ఈ విషయంలో తాము సలహా మాత్రమే ఇవ్వగలమన్నారు సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్.

ప్రస్తుత పరిస్ధితుల్లో ఆటగాళ్లు సరైన నిర్ణయమే తీసుకుంటారని తాము భావిస్తున్నామని ఆయన తెలిపారు. కాగా ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలా.. లేక ఇంగ్లాండ్‌లో జరగనున్న హండ్రడ్ సిరీస్‌కు పర్మిషన్ ఇవ్వాలా అన్న దానిపై క్రికెట్ ఆస్ట్రేలియా త్వరలో సమీక్షా సమావేశం నిర్వహించనుంది.

మరోవైపు ఐపీఎల్-2020 సీజన్ కోసం మొత్తం 17 మంది ఆసీస్ ఆటగాళ్లు వివిధ ఫ్రాంఛైజీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వీరిలో పాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ తదితర క్రికెటర్లు ఐపీఎల్‌తో ఒప్పందాన్ని వదులుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Also Read:కరోనా దెబ్బకు ధోని విలవిల.... జీవితాంతం క్రికెట్ కు దూరమే!

ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో పాట్ కమ్మిన్స్ రూ.15.2 కోట్లు పలికి పాట్ కమ్మిన్స్ అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇక మ్యాచ్‌వెల్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.10.75 కోట్లుకు కోనుగోలు చేసింది.

కరోనా వైరస్ వ్యాప్తి భారత్‌లో మరింతగా విరుచుకుపడుతూ ఈ ఏడాది ఐపీఎల్ జరగనట్లే. ఒకవేళ ఏప్రిల్ 15 నాటికి కాస్తం ఉపశమనం లభిస్తే మాత్రం బీసీసీఐ మినీ ఐపీఎల్‌ను నిర్వహించవచ్చు. అయినప్పటికీ ఐపీఎల్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు లేకపోతే ఆ మజా ఉండదని క్రికెట్ అభిమానుల మాట. 

click me!