డేవిడ్ వార్నర్‌కి నిరాశ... ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్సీ కూడా ప్యాట్ కమ్మిన్స్‌కే...

By Chinthakindhi Ramu  |  First Published Oct 18, 2022, 9:22 AM IST

ఆస్ట్రేలియా వన్డే సారథిగా ప్యాట్ కమ్మిన్స్... డేవిడ్ వార్నర్‌కి వన్డే కెప్టెన్సీ ఇవ్వబోతున్నారంటూ జోరుగా ప్రచారం, అంతలో నిరాశ...


డేవిడ్ వార్నర్‌కి మరోసారి నిరాశే ఎదురైంది. ఆరోన్ ఫించ్ తప్పుకోవడంతో ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌కి బాధ్యతలు దక్కవచ్చని ప్రచారం జరిగింది. సాండ్ పేపర్ వివాదం తర్వాత డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియా జట్టుకి ఏ ఫార్మాట్‌లో కెప్టెన్సీ చేయకుండా జీవితకాల నిషేధం విధించింది క్రికెట్ ఆస్ట్రేలియా. 

ఈ వివాదంలో కీలక పాత్ర పోషించిన అప్పటి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, గత యాషెస్ సిరీస్‌లో ఓ టెస్టు మ్యాచ్‌లో కెప్టెన్సీ కూడా చేశాడు. దీంతో డేవిడ్ వార్నర్‌పై నిషేధం ఎత్తివేసి, అతనికి వన్డే కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ వినిపించింది. ఆరోన్ ఫించ్ వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో ఆ బాధ్యతలు డేవిడ్ వార్నర్‌కే దక్కుతాయని అనుకున్నారంతా...

Latest Videos

డేవిడ్ వార్నర్ కూడా వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు దక్కితే అది తన సేవలకు దక్కిన గౌరవంగా భావిస్తానని కామెంట్ చేశాడు. అయితే అనుకోని రీతిలో ప్యాట్ కమ్మిన్స్‌ని వన్డే ఫార్మాట్‌కి కూడా కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది క్రికెట్ ఆస్ట్రేలియా. ఆసీస్ మాజీ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ సెక్స్‌ఛాట్ వివాదంలో ఇరుక్కోవడంతో గత ఏడాది చివర్లో టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు ప్యాట్ కమ్మిన్స్...

Pat Cummins has been named Australia's 27th ODI captain 🙌 pic.twitter.com/T0p02wwjiP

— Cricket Australia (@CricketAus)

ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా జట్టు, ఇంగ్లాండ్‌ను 4-0 తేడాతో ఓడించి యాషెస్ సిరీస్ కైవసం చేసుకుంది. టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌లో కొనసాగుతూ వస్తున్న ప్యాట్ కమ్మిన్స్, వన్డేల్లోనూ ఆస్ట్రేలియా జట్టును నడిపించబోతున్నాడు. 29 ఏళ్ల ప్యాట్ కమ్మిన్స్, ఆస్ట్రేలియాకి 27వ వన్డే సారథి...  

ఆస్ట్రేలియాకి టెస్టుల్లో, వన్డేల్లో ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్‌గా వ్యవహరించబోతుంటే టీ20ల్లో ఆరోన్ ఫించ్ కెప్టెన్‌గా ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ముగిసిన తర్వాత ఆరోన్ ఫించ్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటాడని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే టీ20 కెప్టెన్సీ పగ్గాలు కూడా ప్యాట్ కమ్మిన్స్‌కే దక్కుతాయా? లేక వేరే ప్లేయర్‌కి అప్పగిస్తారా? అనేది తేలాల్సి ఉంది...

క్రికెట్ ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్‌ని మెల్లిమెల్లిగా సైడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోందని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. అయితే డేవిడ్ వార్నర్ కొన్నాళ్లుగా గాయాలతో సతమతమవుతూ జట్టుకి అన్ని మ్యాచుల్లో అందుబాటులో ఉండలేకపోతున్నాడు. అదీకాకుండా 36 ఏళ్ల డేవిడ్ వార్నర్, ఇంకా ఎంత కాలం క్రికెట్‌లో కొనసాగుతాడో చెప్పడం కష్టం. అందుకే రిస్క్ చేయడం ఇష్టం లేక డేవిడ్ వార్నర్‌కి బదులుగా ప్యాట్ కమ్మిన్స్‌కే వన్డే కెప్టెన్సీ ఇచ్చినట్టు తెలుస్తోంది.  

ఆరోన్ ఫించ్ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడుతున్న క్రికెట్ ఆస్ట్రేలియా టీమ్, వచ్చే ఏడాది ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్సీలో పాల్గొనబోతోంది.

click me!