కరోనా ఎఫెక్ట్: బీసీసీఐ లో తొలి వికెట్ డౌన్...?

By Sreeharsha Gopagani  |  First Published Jun 29, 2020, 11:51 AM IST

బిగ్‌-3 బోర్డుల పెద్దన్న బీసీసీఐపై కరోనా ప్రభావం కనిపిస్తున్నా.. ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. కరోనా సంక్షోభం క్రికెటర్లపై పడకుండా చూస్తామని ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడు ప్రకటించాడు. క్రికెటర్లపై కాకుండా అడ్మినిస్ట్రేటివ్‌ విభాగంలో బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. 


కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ప్రపంచమే స్తంభించిపోయింది. క్రికెట్ ఆట పూర్తిగా నిలిచిపోవడంతో......  క్రికెట్ ప్రపంచం కూడా ఈ వైరస్ దెబ్బకు కుదేలయింది.   బిగ్‌-3 క్రికెట్‌ బోర్డులైన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ భారత్ లు సైతం ఈ వైరస్ దెబ్బకు ఒకింత నష్టపోయాయి. 

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లు వేతన కోతలపై ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాయి. ఆస్ట్రేలియా ఏకంగా ఆర్థిక సంక్షోభంలో పడిపోగా.. ఇంగ్లాండ్‌ వేతనాల్లో కోత వరకు సరిపెట్టుకుంది. ఆర్థిక సంక్షోభం తలెత్తకుండా స్వదేశీ సిరీస్‌ల నిర్వహణపై దృష్టి సారించింది. 

Latest Videos

undefined

బిగ్‌-3 బోర్డుల పెద్దన్న బీసీసీఐపై కరోనా ప్రభావం కనిపిస్తున్నా.. ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. కరోనా సంక్షోభం క్రికెటర్లపై పడకుండా చూస్తామని ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడు ప్రకటించాడు. క్రికెటర్లపై కాకుండా అడ్మినిస్ట్రేటివ్‌ విభాగంలో బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. 

కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత క్రికెట్‌ బోర్డులో తొలి వికెట్‌కు రంగం సిద్ధమైందని విశ్వసనీయ సమాచారం. జనరల్‌ మేనేజర్‌ (క్రికెట్‌ ఆపరేషన్స్‌) సబా కరీంపై వేటు వేసేందుకు బోర్డు పత్రాలు సిద్ధం చేస్తోంది. క్రికెట్‌ ఆస్ట్రేలియా ఇటీవల సీఈఓ కెవిన్‌ రాబర్ట్స్‌పై వేటు వేసిన సంగతి తెలిసిందే.

పనితీరు కారణమా...?

క్రికెట్‌ ఆపరేషన్స్‌ జనరల్‌ మేనేజర్‌ సబా కరీం పని తీరుపై బీసీసీఐ ఆఫీస్‌ బేరర్లు, అధికారుల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. గతంలో సుప్రీంకోర్టు నియమిత పాలకుల కమిటీ సైతం సబా కరీం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. క్రికెట్‌ ఆపరేషన్స్‌ జనరల్‌ మేనేజర్‌గా తన పరిధిలోని సమస్యలను సబా కరీం గాలికొదిలేసినట్టు బోర్డు పెద్దల దృష్టికి వచ్చింది. 

దేశవాళీ క్రికెట్‌ షెడ్యూల్‌పైనా సబా కరీం ముందుచూపుతో వ్యవహరించిన దాఖలాలు లేవు. ఆఖరు నిమిషంలో బీసీసీఐ ఉద్యోగులను ఉరుకులు పరుగులు పెట్టించి పనులు పూర్తి చేసేవాడని వినికిడి. 

జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) ఉన్నతాధికారి కెవిపి రావుతో సబా కరీం దురుసుగా వ్యవహరించారు. బిహార్‌కు చెందిన మాజీ క్రికెటర్‌ కెవిపి రావు విడ్కోలు అనంతరం బోర్డు అడ్మినిస్ట్రేషన్‌ పదవుల్లో ఉన్నారు. పలు రాష్ట్ర సంఘాలు సైతం సబా కరీం ప్రవర్తన, స్పందన పట్ల బీసీసీఐకి ఫిర్యాదులు చేసినట్టు సమాచారం.

సబా కరీం గతంలో సెలక్షన్‌ కమిటీలో పనిచేశారు. సెలక్టర్‌గా ఎంపిక ప్రక్రియపై అతడికి ప్రవేశం ఉంది. జనరల్‌ మేనేజర్‌గా దేశవాళీ క్రికెట్‌ క్యాలెండర్‌ సహా మహిళల క్రికెట్‌కు సబా కరీం బాధ్యుడు. దీంతో మహిళల క్రికెట్‌ జట్టు సెలక్షన్‌ కమిటీ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

మహిళల క్రికెట్‌తో పాటు నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో పలు నియామకాలపై సబా కరీం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అర్హతలు లేని వ్యక్తులను ఎన్‌సీఏలో నియమించినట్టు బోర్డుకు ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై బోర్డు విచారణ జరుపుతోంది. బీసీసీఐ సీఈవో సైతం పని విషయంలో నిక్కచ్చిగా ఉంటున్నారు, దీంతో సబా కరీం వైఫల్యం బయటపడుతోందని బోర్డు అధికారులు చెబుతున్నారు. 

కరోనా వేళ బీసీసీఐ వేతనాల కోత నిర్ణయం తీసుకోకపోయినా.. పని తీరు సరిగా లేని అధికారులపై వేటు వేసేందుకు సమాయత్తమవుతోంది. వేటుకు ముందే రాజీనామా చేయాలనే యోచనలో సబా కరీం ఉన్నట్టు తెలుస్తోంది

click me!