క్యాచ్ పట్టబోయి నాలుగు పళ్లు రాళగొట్టుకున్న కరుణరత్నే... లంక ప్రీమియర్ లీగ్‌లో సంఘటన...

By Chinthakindhi RamuFirst Published Dec 8, 2022, 4:12 PM IST
Highlights

లంక ప్రీమియర్ లీగ్‌లో క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నించి, గాయపడిన చమీక కరుణరత్నే...  నాలుగు పళ్లు రాలినట్టు తెలియచేసిన వైద్యులు.. 

క్రికెట్‌లో ప్లేయర్లకు గాయాలు కావడం సహజం. స్లిప్‌లో క్యాచ్ అందుకోబోయిన రోహిత్ శర్మ, చేతి బొటన వేలికి గాయం చేసుకుని, మూడో వన్డేతో పాటు టెస్టు సిరీస్‌కి కూడా దూరమయ్యాడు. ఇలా ఆడుతూ గాయపడిన ప్లేయర్ల సంఖ్య చాలానే ఉంటుంది. అయితే లంక ఆల్‌రౌండర్ చమీక కరుణరత్నే క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించి.. పళ్లు ఊడగొట్టుకున్నాడు...

అనేక కారణాల వల్ల వాయిదా పడుతున్న లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్ 2022) సీజన్ డిసెంబర్ 6న ప్రారంభమైంది. గాలే గ్లాడియేటర్స్, కెండీ ఫాల్కన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఓ హై క్యాచ్‌ని అందుకోబోయిన కరుణరత్నే ముఖానికి (మూతికి) బంతి బలంగా తగలడంతో అతని నాలుగు ముందు పళ్లు ఊడిపోయాయి...

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న గాలే గ్లాడియేటర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. తనుక దబరే డకౌట్ కాగా కెప్టెన్ కుశాల్ మెండిస్ 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆజం ఖాన్ 1 పరుగుకే పెవిలియన్ చేరాడు. 

కార్లెస్ బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో నువానిడు ఫెర్నాండో భారీ షాట్‌కి ప్రయత్నించాడు. గాల్లోకి చాలా ఎత్తుకి లేచిన బంతిని అందుకునేందుకు పాయింట్‌లో ఫీల్డ్‌ చేస్తున్న చమీక కరుణరత్నే పరుగెత్తుకుంటూ వచ్చాడు. వెనక్కి తిరిగి పరుగెత్తుకుంటూ వచ్చిన కరుణరత్నే, బంతిని ఎక్కడ పడుతున్నది అంచనా వేయలేకపోయాడు. దీంతో కుకుబురా బాల్, నేరుగా వచ్చి కరుణరత్నే మూతికి బలంగా తాకింది...

దీంతో ముందు పళ్లు ఊడి రక్తం కారింది. అయినా క్యాచ్ అందుకున్న కరుణరత్నే, చేతికి మూతిని మూసుకుని డగౌట్ చేరాడు. ఫిజియో సలహాతో కరుణరత్నేని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన కారణంగా కరుణరత్నే నాలుగు పళ్లు ఊడిపోయాయని, వెంటనే శస్త్ర చికిత్స నిర్వహించినట్టు అధికారులు తెలియచేశారు. 

Chamika hospitalized while attempting catch for Kandy Falcons pic.twitter.com/yrkT2bbhoG

— Ada Derana Sports (@AdaDeranaSports)

121 పరుగుల లక్ష్యాన్ని 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది కెండీ ఫాల్కన్స్ జట్టు. కెండీ ఫాల్కన్స్ జట్టుకి లంక యంగ్ ఆల్‌రౌండర్ వానిందు హసరంగ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 

ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఆడిన చమీక కరుణరత్నే, ఏడాది నిషేధానికి గురయ్యాడు. శ్రీలంక క్రికెట్ అసోసియేషన్ నిబంధనలను బేఖాతరు చేసినందుకు ఛమీక కరుణరత్నెను ఏడాది పాటు ఏ ఫార్మాట్ ఆడకుండా నిషేధించిన లంక బోర్డు,  ఐదు వేల యూఎస్ డాలర్ల  (భారత కరెన్సీలో  సుమారు రూ. 4 లక్షలు) జరిమానా కూడా విధించింది..

టీ20 ప్రపంచకప్ 2022 కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన ఛమీక కరుణరత్నే, బ్రిస్బేన్‌లోని ఓ క్యాసినోలో తప్పతాగి, అక్కడ కొంతమందితో గొడవపడ్డట్టు సమాచారం. ఇంగ్లాండ్ పర్యటనలో కరోనా నిబంధనలను ఉల్లంఘించి ముగ్గురు లంక క్రికెటర్లు, బయో బబుల్ దాటి స్వేచ్ఛగా విహరించడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. అప్పటి నుంచి లంక క్రికెటర్లపై కఠిన ఆంక్షలు విధిస్తోంది లంక బోర్డు.. 

click me!