మహ్మద్ షమీకి కరోనా పాజిటివ్... ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కి ఉమేశ్ యాదవ్...

By Chinthakindhi RamuFirst Published Sep 18, 2022, 9:15 AM IST
Highlights

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కి ముందు కరోనా బారిన మహ్మద్ షమీ... మూడేళ్ల తర్వాత టీ20ల్లోకి ఉమేశ్ యాదవ్... 

భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ కరోనా బారిన పడ్డాడు. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీ20 ఫార్మాట్‌కి దూరంగా ఉన్న మహ్మద్ షమీని దాదాపు ఏడాది తర్వాత ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కి ఎంపిక చేసింది బీసీసీఐ. మహ్మద్ షమీని వన్డే, టెస్టుల్లో కొనసాగించాలని భావించిన టీమిండియా మేనేజ్‌మెంట్, టీ20 ఫార్మాట్‌కి అతన్ని దూరంగా పెట్టింది. నవంబర్ 2021 తర్వాత ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడని మహ్మద్ షమీని టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేశారు సెలక్టర్లు...

ఏడాది తర్వాత నేరుగా టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఎంపిక చేస్తే విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో జరిగే టీ20 సిరీస్‌కి మహ్మద్ షమీని ఎంపిక చేశారు సెలక్టర్లు. అయితే ఆసీస్‌తో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో మహ్మద్ షమీకి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. మహ్మద్ షమీ కరోనా నుంచి కోలుకుంటే ఆసీస్ టీ20 సిరీస్ తర్వాత జరిగే సౌతాఫ్రికా సిరీస్‌లో ఆడతాడు.

దీంతో అతన్ని టీ20 సిరీస్ నుంచి తప్పించిన మేనేజ్‌మెంట్, ఉమేశ్ యాదవ్‌కి చోటు కల్పించింది. ఐపీఎల్‌ 2022లో కేకేఆర్ తరుపున మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన ఉమేశ్ యాదవ్, 12 మ్యాచుల్లో 16 వికెట్లు తీశాడు. ఎక్కువగా మొదటి ఓవర్‌లో వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్, బ్యాటుతోనూ రాణించాడు...

ఐపీఎల్ 2022 తర్వాత  రాయల్ లండన్ వన్డే క్రికెట్ టోర్నీలో  7 మ్యాచులు ఆడిన ఉమేశ్ యాదవ్ 16 వికెట్లు పడగొట్టి, మిడిల్‌సెక్స్ క్లబ్ తరుపున టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. ఈ పర్ఫామెన్స్ కారణంగా ఉమేశ్ యాదవ్‌ని ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కి ఎంపిక చేశారు సెలక్టర్లు.

నిజానికి గాయం నుంచి కోలుకున్న ఉమేశ్ యాదవ్,  సెప్టెంబర్ 17న తిరిగి జట్టుతో మిడిల్‌సెక్స్ టీమ్‌తో కలిసి కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆఖరి రెండు మ్యాచుల్లో ఆడాల్సింది. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఉమేశ్ యాదవ్, చివరి రెండు మ్యాచుల్లో ఆడడం లేదని ప్రకటించింది మిడిల్‌సెక్స్.

ఇది జరిగిన 24 గంటలకే ఉమేశ్ యాదవ్‌ని ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కి ఎంపిక చేస్తున్నట్టు వార్తలు రావడం విశేషం. ఉమేశ్ యాదవ్‌ ఫిట్‌నెస్ పరీక్షల్లో పాస్ అయ్యాడని, అందుకే అతన్ని మహ్మద్ షమీకి రిప్లేస్‌మెంట్‌గా తీసుకున్నారని సమాచారం.

కొన్నాళ్లుగా టెస్టుల్లో కొనసాగుతూ వస్తున్న ఉమేశ్ యాదవ్, చివరిగా 2019 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాపై ఆఖరి టీ20 మ్యాచ్ ఆడాడు. మూడేళ్ల తర్వాత టీమిండియా తరుపున టీ20ల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఉమేశ్ యాదవ్, ఐపీఎల్ 2022 మెగా వేలంలో తొలుత అమ్ముడుపోలేదు. రెండో రౌండ్‌లో ఉమేశ్ యాదవ్‌ని బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది కేకేఆర్...

ఐపీఎల్ 2022 సీజన్‌లో మొట్టమొదటి ఓవర్ వేసిన ఉమేశ్ యాదవ్, తొలి ఓవర్‌లోనే వికెట్ తీసి కేకేఆర్‌కి ప్రధాన బౌలర్‌గా మారిపోయాడు. టీమిండియా తరుపున 7 టీ20 మ్యాచులు ఆడిన ఉమేశ్ యాదవ్, 9 వికెట్లు తీశాడు. 

click me!