ఆసియా కప్ 2023 టోర్నీకి ముందు శ్రీలంకకి ఊహించని షాక్... ఇద్దరికి కరోనా పాజిటివ్, మరో ఇద్దరికి గాయాలు..

Published : Aug 26, 2023, 12:45 PM IST
ఆసియా కప్ 2023 టోర్నీకి ముందు శ్రీలంకకి ఊహించని షాక్... ఇద్దరికి కరోనా పాజిటివ్, మరో ఇద్దరికి గాయాలు..

సారాంశం

లంక ఫాస్ట్ బౌలర్ దుస్మంత ఛమీరా, ఆల్‌రౌండర్ వానిందు హసరంగకు గాయాలు... కరోనా పాజిటివ్‌గా తేలిన సీనియర్ బ్యాటర్లు  కుశాల్ పెరేరా, ఆవిష్క ఫెర్నాండో...

ఆసియా కప్ 2023 టోర్నీ ఆరంభానికి 3 రోజుల ముందు శ్రీలంక జట్టుకి ఊహించని షాక్ తగిలింది.  ఇద్దరు కీ ప్లేయర్లు, కరోనా పాజిటివ్‌గా తేలగా మరో ఇద్దరు గాయాలతో టీమ్‌కి దూరం కాబోతున్నారు. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దుస్మంత ఛమీరా.. లంక ప్రీమియర్ లీగ్‌లో గాయపడ్డాడు. అతని భుజానికి గాయం కావడంతో ఆసియా కప్ 2023 టోర్నీ మొత్తానికి దుస్మంత ఛమీరా దూరమైనట్టు సమాచారం..

అలాగే లంక ప్రీమియర్ లీగ్‌లో ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టిన వానిందు హసరంగ కూడా గాయంతో బాధపడుతున్నాడు. లంక ప్రీమియర్ లీగ్ ఫైనల్ సమయంలో హసరంగ తొడకు గాయమైంది. ఈ గాయం నుంచి కోలుకోవడానికి రెండు వారాల సమయం పడుతుందని వైద్యులు సూచించారు..

దీంతో గ్రూప్ స్టేజీలో శ్రీలంక ఆడే రెండు మ్యాచుల్లోనూ వానిందు హసరంగ ఆడడం లేదు. లంక ప్రీమియర్ లీగ్‌లో 10 మ్యాచుల్లో 189.8 స్ట్రైయిక్ రేటుతో 279 పరుగులు చేసిన వానిందు హసరంగ, బౌలింగ్‌లో 19 వికెట్లు తీసి... అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఆసియా కప్‌ 2023 టోర్నీలో వానిందు హసరంగ అందుబాటులో ఉండడం, శ్రీలంక జట్టుకి చాలా అవసరం. 

అలాగే శ్రీలంక సీనియర్ బ్యాటర్లు కుశాల్ పెరేరా, ఆవిష్క ఫెర్నాండో కరోనా పాజిటివ్‌గా తేలారు. ఈ ఇద్దరూ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. కరోనా సోకిన ప్లేయర్లను దూరంగా పెట్టాలనే నిబంధనను ఐసీసీ, ఏడాది కిందటే తొలగించింది.

అయితే ఈ ఇద్దరినీ ఆసియా కప్ 2023 ఆడించాలా? లేదా? అనే విషయం, లంక క్రికెట్ బోర్డు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. మిగిలిన ప్లేయర్ల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ ఇద్దరికీ నెగిటివ్ రిజల్ట్ వచ్చిన తర్వాతే టీమ్‌తో ఆడించాలని లంక బోర్డు భావిస్తోందట..

గత ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా ఆసియా కప్ 2022 టోర్నీ ఆడింది శ్రీలంక. అయితే సూపర్ 4 రౌండ్‌లో వరుస విజయాలు అందుకుని ఫైనల్‌కి దూసుకెళ్లింది. పాకిస్తాన్‌తో సూపర్ 4 మ్యాచ్ ఓడిన టీమిండియా, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ ఓడి... ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది..

ఆసియా కప్ 2022 టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో అంతా పాకిస్తాన్‌ని ఫెవరెట్‌గా భావించారు. అయితే అంచనాలకు మించి రాణించిన శ్రీలంక, ఆసియా కప్ 2022 టోర్నీ టైటిల్ గెలిచింది. ఇప్పటికే 6 సార్లు ఆసియా కప్ టైటిల్ గెలిచిన శ్రీలంక, టీమిండియా (ఏడు సార్లు) తర్వాతి స్థానంలో ఉంది. పాకిస్తాన్ రెండు సార్లు మాత్రమే ఆసియా కప్ గెలవగలిగింది..

ఆసియా కప్ 2023 టోర్నీలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ Bలో తలబడుతున్నాయి. ఈ మూడు జట్ల మధ్య సూపర్ 4 బెర్త్ కోసం హోరాహోరీ ఫైట్ జరిగే అవకాశం ఉంది. అయితే హైబ్రీడ్ మోడల్‌లో జరుగుతున్న ఆసియా కప్ 2023 టోర్నీలో 9 మ్యాచులు శ్రీలంకలోనే జరగబోతుండడం, లంక టీమ్‌కి కలిసి వచ్చే విషయం.. 

 

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !