
భారత్ మార్కెట్ లో ప్రతి రంగంలో కాలుమోపుతున్న ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ.. ఈనెల 12న బీసీసీఐ నిర్వహించతలపెట్టిన ఐపీఎల్ మీడియా హక్కులను సొంతం చేసుకోనున్నాడా..? ఆదివారం ముంబైలో జరుగబోయే వేలంలో అంబానీకి సంబంధించిన వయాకామ్18.. ఈ హక్కులను పొందడం ఇక లాంఛనమేనా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. తాజా పరిణామాలు కూడా అందుకు అనుకూలంగానే ఉన్నాయి. నిన్నా మొన్నటి వరకు అమెజాన్ తో తీవ్ర పోటీని ఎదుర్కున్న రిలయన్స్.. తాజాగా ఆ గండాన్ని దాటినట్టుగానే కనిపిస్తున్నది. మీడియా హక్కులను సొంతం చేసుకోవడానికి ఆది నుంచి ప్రయత్నిస్తున్న అమెజాన్.. ఈ డీల్ నుంచి పక్కకు తప్పుకున్నట్టు (?) తెలుస్తున్నది.
ఇన్సైడ్ స్పోర్ట్స్ లో వచ్చిన కథనం మేరకు.. రిటైల్ దిగ్గజం అమెజాన్ తో పాటు గూగుల్ ఈ ప్రక్రియ నుంచి తప్పుకున్నాయి. వేలం ప్రక్రియకు ముందు బిడ్స్ వేసిన సంస్థలు బీసీసీఐకి సమర్పించవలసిన టెక్నికల్ బిడ్స్ ను పై రెండు సంస్థలు అందజేయలేదు. దీంతో అమెజాన్, గూగుల్ లు ఈ భారీ డీల్ నుంచి తప్పుకున్నట్టేనని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
జూన్ 12న జరుగబోయే వేలానికి ముందుగా బీసీసీఐ.. నేడు టెక్నికల్ బిడ్స్ ను పరిశీలిస్తున్నది. ప్రస్తుతం బీసీసీఐ అధికారిక ప్రసారదారు అయిన డిస్నీ స్టార్ తో పాటు, రిలయన్స్ వయాకామ్ 18, సోనీ నెట్వర్క్, టైమ్స్ ఇంటర్నెట్, ఫన్ ఆసియా లు టెక్నికల్ బిడ్స్ ను సమర్పించాయి. వీటిని బీసీసీఐ ఫైనాన్స్ టీమ్ మూల్యాంకనం చేయనుంది. టెక్నికల్ బిడ్స్ లో ఏ సమస్య లేకుండా ఉన్నవాళ్లే ఆదివారం జరుగబోయే బిడ్డింగ్ రౌండ్ కు వెళ్తారు.
అమెజాన్ తప్పుకోవడం బీసీసీఐ కి భారీ షాక్ వంటిదే. ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా ఎంత కాదన్నా రూ. 50 వేల కోట్ల దాకా ఆర్జించాలని భావిస్తున్నబీసీసీఐకి ఇది మింగుడుపడని విషయమే. అమెజాన్, గూగుల్ తప్పుకోవడం (?) తో ఇక మిగిలింది డిస్నీ స్టార్, సోనీ, రిలయన్స్ ల మధ్యే పోటీ నెలకొని ఉంది. అంబానీని తట్టుకుని స్టార్, సోనీలు ఏమేరకు నిలబడగలవో మరి..?
అమెజాన్ ఎందుకు తప్పుకుంటున్నది..?
యూఎస్ ఈ కామర్స్ దిగ్గజమైన అమెజాన్ ఇప్పటికే భారత మార్కెట్ లో వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఐపీఎల్ లో మీడియా హక్కుల కోసం ఆ సంస్థ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. అయితే ఐపీఎల్ తో పాటు యూరోపియన్ సాకర్ రైట్స్ కోసం ఇంతకుమించిన పోటీని ఎదుర్కుంటున్నది. క్రికెట్ తో పోల్చితే సాకర్ కు క్రేజ్ ఎక్కువ. సాకర్ తో పాటు యూఎస్ లోని Thursday Night Football తో చేతులు కలిపింది. 2033 వరకు ఇందులో సుమారు వన్ బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఈ కారణంగానే ఐపీఎల్ మీద పెద్దగా దృష్టి సారించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజానిజాలు తేలాలంటే ఆదివారం దాకా వేచి చూడాల్సిందే. అమెజాన్ తో పాటు గూగుల్ కూడా ఎందుకు తప్పుకుందనేది తెలియరాలేదు.