బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్ లో లేని భువీ.. కెరీర్ ముగిసినట్టేనా..?

By Srinivas MFirst Published Mar 27, 2023, 4:53 PM IST
Highlights

BCCI Central Contract List:  ఆదివారం రాత్రి  బీసీసీఐ   2022 -23 కు గాను  సెంట్రల్ కాంట్రాక్టు లిస్టును విడుదల చేసింది.  ఈ జాబితాలో  మిస్ అయినవారిలో వెటరన్ పేసర్  భువీ పేరు కూడా ఉంది. 

భారత క్రికెట్ నియంత్రణ మండలి   (బీసీసీఐ)  ఆదివారం రాత్రి  టీమిండియా క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టులను  ప్రకటించిన విషయం తెలిసిందే.   భారత స్టార్ ఆల్  రౌండర్ రవీంద్ర జడేజా  ‘ఎ’ నుంచి ‘ఎ ప్లస్’ కేటగిరీకి రాగా  కెఎల్ రాహుల్  ‘ఎ’ నుంచి ‘బీ’కి పడిపోయాడు.   పలువురు కొత్త క్రికెటర్లు ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్, కెఎస్ భరత్   లు  బీసీసీఐ కాంట్రాక్టు దక్కించుకోగా   అజింక్యా రహానే,   మయాంక్ అగర్వాల్,  వృద్ధిమాన్ సాహా,  ఇషాంత్ శర్మ, దీపక్ చహర్ వంటి క్రికెటర్లు  కాంట్రాక్టులు కోల్పోయారు.  ఈ ఏడాది కాంట్రాక్టులు కోల్పోయినవారిలో   ప్రముఖంగా వినిపిస్తున్న పేరు  భువనేశ్వర్ కుమార్.   

2012 నుంచి భారత జట్టులో ఆడుతున్న ఈ వెటరన్ పేసర్ ను బీసీసీఐ   సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి పక్కనబెట్టింది.  గతేడాది  (2021-22) లో గ్రేడ్ ‘సి’లో ఉన్న భువీ.. ఈసారి జాబితాలో కూడా లేకుండా పోయాడు. దీంతో ఈ  వెటరన్ పేసర్ కథ ముగిసినట్టేనని   వాదనలు వినిపిస్తున్నాయి.  

గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత  న్యూజిలాండ్ తో టీ20లలో  భాగంగా నేపియర్ వేదికగా జరిగిన చివరి మ్యాచ్ లో ఆడిన భువీ.. ఆ తర్వాత మళ్లీ భారత జట్టుకు ఆడలేదు. టీమ్ లో కొత్త రక్తాన్ని ఎక్కించేందుకు గాను సీనియర్లను పక్కనబెడుతున్న  సెలక్టర్లు.. భువీకి అవకాఆలు ఇవ్వడం లేదు.  ముఖ్యంగా టీ20లలో వరుసగా అవకాశాలు దక్కించుకున్న  భువీ ఇక మళ్లీ ఈ ఫార్మాట్ తో  పాటు భారత జట్టుకు ఆడేది  అనుమానంగానే ఉంది.  జట్టులో సిరాజ్  తో పాటు అర్ష్‌దీప్ సింగ్ లు నిలకడగా రాణిస్తుండటం..  కొత్త బౌలర్ల వేటలో పడ్డ  బీసీసీఐ భువీని పక్కనబెట్టేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలనే టీ20 జట్టు నుంచి   ‘విశ్రాంతి’ పేరిట  పక్కనబెట్టిన  సెలక్టర్లు.. భువీని పట్టించుకోవడమంటే సాహసమే.

టీ20 ప్రపంచకప్ లో  ఆరు మ్యాచ్ లు ఆడి నాలుగు వికెట్లు  మాత్రమే తీసిన భువీ.. టీమిండియాలో రీఎంట్రీ ఇవ్వకపోయినా  ఐపీఎల్ లో మాత్రం  సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆడేందుకు  సన్నద్ధమవుతున్నాడు. ఎస్ఆర్హెచ్ కు  ఇప్పటికీ ప్రధాన బౌలర్ భువీనే. మరి ఈ సీజన్ లో  మెరుగ్గా రాణించి  తర్వాత దేశవాళీలో కూడా ఆడితే భువీపైన  సెలక్టర్లు ఏదైనా కరుణ చూపిస్తారో  చూడాలి. లేదంటే భువీ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడ్డట్టేనని టీమిండియా ఫ్యాన్స్ భావిస్తున్నారు.  

సెంట్రల్ కాంట్రాక్ట్ (2022-23) పూర్తి లిస్టు:

Grade A+: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా

Grade A: హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, రిషబ్ పంత్, అక్షర్ పటేల్

Grade B: ఛతేశ్వర్ పూజారా, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుబ్‌మన్ గిల్

Grade c: ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కెఎస్ భరత్

click me!