
తెలుగు సినిమాల్లో తనను అవమానించిన విలన్‌లపై పగ తీర్చుకునేందుకు కొన్నేళ్ల పాటు వెయిట్ చేస్తాడు హీరో. బయట అలా ఓ చిన్న విషయాన్ని కొన్ని ఏళ్ల పాటు గుర్తుంచుకుంటారా? అది కూడా జెంటిల్మెన్ గేమ్ క్రికెట్‌లో ఇలాంటివి ఉంటాయా? కచ్ఛితంగా ఉంటాయని నిరూపిస్తున్నారు పాక్ బౌలర్ సోహైల్ తన్వీర్, ఆస్ట్రేలియా క్రికెటర్ బెన్ కట్టింగ్...
2018 కరేబియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో బెన్ కట్టింగ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు పాక్ బౌలర్ సోహైల్ తన్వీర్. అవుటై పెవిలియన్ చేరుకున్న బెన్ కట్టింగ్‌కి రెండు చేతులతో మిడిల్ ఫింగర్స్ చూపిస్తూ సెడ్జ్ చేశాడు... ఇలా అసభ్యంగా ప్రవర్తించినందుకు సోహైల్ తన్వీర్ మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత కూడా విధించింది ఐసీసీ...
అయితే ఈ సంఘటనను అలా బుర్రలో దాచి పెట్టుకున్న బెన్ కట్టింగ్, నాలుగేళ్ల తర్వాత దాన్ని తిరిగి ఇచ్చేశాడు. పాక్ సూపర్ లీగ్ 2022 సీజన్‌లో పెషావర్ జల్మీ, క్వెట్టా గ్లాడియేటర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సోహైల్ తన్వీర్ బౌలింగ్‌లో నాలుగు సిక్సర్లు బాదిన బెన్ కట్టింగ్... రెండు చేతుల మిడిల్ ఫింగర్స్ చూపిస్తూ పగ తీర్చుకున్నాడు...
అయితే ఆ తర్వాతి ఓవర్‌లో నసీం షా బౌలింగ్‌లో బెన్ కట్టింగ్ భారీ షాట్ కొట్టబోయి, సోహైల్ తన్వీర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కట్టింగ్ క్యాచ్ పట్టిన సోహైల్ తన్వీర్, మరోసారి రెండు చేతుల మిడిల్ ఫింగర్స్‌ని అతని వైపు చూపిస్తూ ఎద్దేవా చేశాడు...
తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. బెన్ కట్టింగ్ 14 బంతుల్లో 36 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనలో 8 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. పెషావర్ జల్మీకి 27 పరుగుల తేడాతో విజయం దక్కింది.
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ బెన్ కట్టింగ్, ఐపీఎఎల్ 2022 సీజన్ మెగా వేలంలో అమ్ముడుపోలేదు. పాక్ సూపర్ లీగ్‌లో ఇలాంటి సంఘటనలు, చిన్న పిల్లలు, కుటుంబంతో సహా క్రికెట్ ఫ్యాన్స్‌ను ఇబ్బంది పెడుతున్నాయి. ఐపీఎల్ కంటే మాది మాహా పెద్ద లీగ్ అని బడాయి పోయే పాక్ క్రికెటర్లు, ముందు పబ్లిక్‌గా ఇలాంటి చిల్లర వేషాలు వేయడం మానుకుంటే మంచిదని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
పాక్ సూపర్ లీగ్‌లో పబ్లిక్‌గా అసభ్యంగా ప్రవర్తించిన సోహైల్ తన్వీర్, బెన్ కట్టింగ్ ఇద్దరిపై ఐసీసీ సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. దాదాపు ఐదేళ్ల క్రితం పాకిస్తాన్ జట్టు తరుపున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన పేసర్ సోహైల్ తన్వీర్, 2017 తర్వాత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు...
37 ఏళ్ల వయసులో ఫ్రాంఛైజీ క్రికెట్ మ్యాచులు ఆడుతున్న సోహైల్ తన్వీర్‌తో పాటు ముందుగా మిడిల్ ఫింగర్ చూపించి అతన్ని రెచ్చగొట్టినందుకు బెన్ కట్టింగ్‌పై కూడా భారీగా మ్యాచ్ ఫీజు కోత విధించడంతో పాటు ఓ మ్యాచ్ ఆడకుండా బ్యాన్ విధించే అవకాశం ఉంది.