
భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఇండోర్ వేదికగా ఇటీవలే ముగిసిన మూడో టెస్టుకు ఐసీసీ ‘పూర్ రేటింగ్’ ఇవ్వడంపై ప్రపంచ క్రికెట్ పెద్దన్నగా వ్యవహరిస్తున్న బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐసీసీ నిర్ణయం ఏకపక్షంగా ఉందంటూ.. దీనిపై సవాల్ చేసేందుకు సిద్ధమవుతున్నదని సమాచారం. ఐసీసీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్.. ఇండోర్ మ్యాచ్ ముగిసిన వెంటనే ఈ పిచ్ టెస్టులకు ఆమోదయోగ్యంగా లేదని పేలవంగా ఉందని పూర్ రేటింగ్ ఇచ్చాడు.
ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం బీసీసీఐకి కోపం తెప్పించింది. క్రిస్ బ్రాడ్ ఇండోర్ పిచ్ కు పూర్ రేటింగ్ ఇవ్వడంతో పాటు మూడు డీమెరిట్ పాయింట్లు కూడా ఇచ్చాడు. ఈ నిర్ణయంపై బీసీసీఐకి 14 రోజుల్లో సవాల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ.. ఐసీసీ నిర్ణయాన్ని సవాల్ చేయడానికి సిద్ధమవుతున్నదని సమాచారం.
కాగా స్వదేశంలో దిలీప్ వెంగ్‌సర్కార్, కృష్ణమచారి శ్రీకాంత్ వంటి మాజీలు బహిరంగంగానే ‘ఇండోర్ పిచ్ టెస్టులకు పనకిరాదు.. ఇలాంటి పిచ్ ల వల్ల టెస్ట్ క్రికెట్ ను నాశనం చేయరాదంటూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. కానీ టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం ఐసీసీ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇండోర్ కు మూడు డీమెరిట్ పాయింట్స్ ఇచ్చిన ఐసీసీ.. ఇదే ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య కొద్దిరోజుల క్రితం బ్రిస్బేన్ వేదికగా రెండు రోజుల్లోనే ముగిసిన టెస్టు మ్యాచ్ లో గబ్బా పిచ్ కు ఎన్ని డీ మెరిట్ పాయింట్లు అందజేశాడని ప్రశ్నించాడు.
ఐసీసీ నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు గాను తాము సిద్ధమవుతున్నామని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపినట్టు ఇన్‌సైడ్‌స్పోర్ట్స్ ఓ కథనంలో పేర్కొంది. గతేడాది రావల్పిండి వేదికగా ఇంగ్లాండ్ - పాకిస్తాన్ మధ్య ముగిసిన తొలి టెస్టులో 1,768 పరుగులు నమోదైన విషయం తెలిసిందే. జీవం లేని పిచ్ ను తయారుచేసినందుకు గాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ షాక్ ఇచ్చింది. రావాల్పిండి పిచ్ ను ‘బిలో యావరేజ్’ గా ప్రకటించింది. దీంతో పీసీబీ.. ఐసీసీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
పిచ్ రేటింగ్స్ గురించి..
ఐసీసీ పిచ్ రేటింగ్స్ విషయానికొస్తే.. ప్రతీ టెస్టు ముగిసిన తర్వాత మ్యాచ్ రిఫరీ ఆ పిచ్ ఎలా ఉందనే విషయాన్ని ఐసీసీకి నివేదించాలి. ఈ క్రమంలో రిఫరీ పిచ్, ఔట్ ఫీల్డ్ వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటాడు. ఈ రేటింగ్స్ వల్ల ఐసీసీ.. భవిష్యత్ లో ఆ పిచ్ ల మీద మ్యాచ్ లను నిర్వహించాలా..? వద్దా..? అని నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ మ్యాచ్ రిఫరీ ఐదు డీమెరిట్ పాయింట్లు గనక వస్తే సదరు వేదికపై 12 నెలల నిషేధం ఉంటుంది.
ఐసీసీ రేటింగ్స్ :
- వెరీ గుడ్
- గుడ్
- యావరేజ్
- బిలో యావరేజ్
- పూర్
- అన్‌ఫిట్