
భారత క్రికెట్ తో పాటు ప్రపంచ క్రికెట్ ను తన కనుసన్నల్లో ఉంచుకున్న బీసీసీఐ.. మరోసారి ఐసీసీ చీఫ్ పదవిపై కన్నేసింది. వచ్చే ఏడాది భారత్ లో వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో.. బీసీసీఐకి చెందిన ఇద్దరు బాస్ లు టాప్ పోస్ట్ ను దక్కించుకునేందుుకు తమకు తోచినవిధంగా ప్రయత్నాలు మమ్మురం చేసినట్టు సమాచారం. వారిలో ఒకరు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కాగా మరొకరు బోర్డు కార్యదర్శి జై షా. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ గా ఉన్న గ్రెగ్ బార్క్లే పదవీ కాలం ఈ ఏడాది నవంబర్ తో ముగిసిపోనున్నది. ఈ పదవిని దక్కించుకునేందుకు భారత్ శతవిధాలా ప్రయత్నిస్తున్నది. అయితే ఈ రేసులో బీసీసీఐ ప్రెసిడెంట్, సెక్రెటరీలు ముందు వరుసలో ఉండటం గమనార్హం.
2020 నవంబర్ లో ఐసీసీ చైర్మన్ గా ఎంపికైన గ్రెగ్.. నవంబర్ లో తన పదవి నుంచి వైదొలగనున్నాడు. ఆయనకు పదవీ కాలం పెంచుకునే అవకాశామున్నా.. గ్రెగ్ మాత్రం దిగిపోవాలనే నిశ్చియించుకున్నాడు. దీంతో ఈ పోస్ట్ పై బీసీసీఐ బాస్ ల కన్ను పడింది.
సెంటిమెంట్ కలిసొచ్చేలా...
కోల్కతా నుంచి ప్రచురితమయ్యే ప్రముఖ పత్రిక టెలిగ్రాఫ్ కథనం మేరకు... సౌరవ్ గంగూలీ, జై షాలు ఈ టాప్ పోస్టును దక్కించుకోవడానికి యత్నిస్తున్నారు. 2023 లో వన్డే ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని భారత్.. ఐసీసీ చీఫ్ పదవి దక్కించుకోవాలని భావిస్తున్నది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న కాలం (2010-2012) లో భారత్ 2011 ప్రపంచకప్ నెగ్గింది. 2011 మాదిరిగానే ఈ ప్రపంచకప్ కూడా భారత్ లోనే జరగాల్సి ఉంది. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని బీసీసీఐ భావన.
ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం చైర్మన్ పదవికి ఎంపికైన వ్యక్తి.. రెండేండ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతాడు. అయితే దానిని ఆరేండ్ల వరకు పొడిగించుకునే అవకాశముంది. కానీ గ్రెగ్ బార్క్లే మాత్రం ఈ పదవి నుంచి వైదొలగనున్నాడు. ఆక్లాండ్ కు చెందిన గ్రెగ్.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లలో పలు సంస్థలకు న్యాయ సలహాదారుడిగా కూడా పనిచేశాడు. ఇప్పుడు అతడు తిరిగి తన పాత వృత్తిలోకే వెళ్లాలని భావిస్తున్న నేపథ్యంలో ఐసీసీకి కొత్త బాస్ అవసరం ఏర్పడనుంది. వచ్చే జూలైలో ఈ విషయమై ఐసీసీ పాలక మండలి కూడా చర్చించే అవకాశముంది.
ఇక గంగూలీ గనక ఐసీసీ చీఫ్ పదవికి పోటీ వస్తే అతడు ఈజీగా నెగ్గగలడని దాదా సన్నిహితంగా మెలిగే ఒక వ్యక్తి తెలిపాడు. ‘ఒకవేళ గంగూలీ ఈ పదవి పై ఆసక్తి కనబరిస్తే అతడికి అనువైన వాతావరణమే ఉంది. అన్ని దేశాల క్రికెట్ బోర్డులతో దాదాకు మంచి అనుబంధముంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు రమీజ్ రాజా కూడా గంగూలీ వైపునకే మొగ్గు చూపుతాడు. అయితే గంగూలీ ఐసీసీకి వెళ్తాడా..? లేదా..? అనేది ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది...’ అని చెప్పుకొచ్చాడు.
జై షా కూడా ఈ పదవికి కావాల్సినంత మద్దతు కూడగట్టేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టు సమాచారం. జై షా.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుమారుడు అన్న సంగతి తెలిసిందే.
గతంలో ఐసీసీకి అధ్యక్షులుగా పనిచేసిన భారతీయులు :
1. జగ్మోహన్ దాల్మియా (1997-2000)
2. శరద్ పవార్ (2010-2012)
3. ఎన్. శ్రీనివాసన్ (2014-2015)
4. శశాంక్ మనోహర్ (2015-2020)