ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ వాయిదా వేయమన్న బీసీసీఐ, ఎందుకంటే...

By Sree sFirst Published Apr 25, 2020, 10:43 AM IST
Highlights

2021 ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ను వాయిదా వేయాలని ఐసీసీని బీసీసీఐ కోరింది. ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ గురువారం టెలి కాన్ఫరెన్స్‌లో సమావేశమైంది. ఈ సమావేశానికి బీసీసీఐ ప్రతినిధిగా కార్యదర్శి జై షా హాజరయ్యారు. 

కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచమే వణికి పోతుంది. అన్ని క్రీడా సంరంభాలు వరుసగా వాయిదాపడుతున్నాయి. ఐపీఎల్ వాయిదా పడింది. ప్రపంచ టి20 సమరం కూడా దాదాపుగా వాయిదా పడేలానే కనబడుతుంది. అతి పెద్ద క్రీడా వేడుక, నాలుగు సంవత్సరాలకోసారి జరిగే ఒలింపిక్స్ కూడా వాయిదా పడ్డాయి. 

ఇదే వరుసలో 2021 జులైలో లార్డ్స్‌ వేదికగా జరగాల్సిన తొట్ట తొలి ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ కూడా వాయిదా పడనుంది. కరోనా వైరస్‌ మహమ్మారితో ప్రపంచ క్రికెట్‌ ఇప్పటికే సుమారు 90 రోజుల షెడ్యూల్‌ నష్టపోయింది. 

మ్యాచ్‌ల నిర్వహణతోనే ప్రధానంగా ఆదాయం ఆర్జిస్తున్న క్రికెట్‌ బోర్డులకు ఇది ప్రాణ సంకటంగా మారింది. కరోనా వైరస్‌ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత క్రికెట్‌ బోర్డులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఊతం అందించే వన్డే, టీ20 ఫార్మాట్లపైనే దృష్టి సారించటం మేలని భారత క్రికెట్‌ పెద్దలు భావిస్తున్నారు. 

అందుకే 2021 ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ను వాయిదా వేయాలని ఐసీసీని బీసీసీఐ కోరింది. ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ గురువారం టెలి కాన్ఫరెన్స్‌లో సమావేశమైంది. ఈ సమావేశానికి బీసీసీఐ ప్రతినిధిగా కార్యదర్శి జై షా హాజరయ్యారు. 

ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్‌ 360 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. కీలక టెస్టు సిరీస్‌లు ఈ సమయంలోనే జరగాల్సి ఉండగా.. కోవిడ్‌-19తో సాధ్యపడలేదు. దీంతో టెస్టు చాంపియన్‌షిప్‌ను షెడ్యూల్‌ను వాయిదా వేయాలని సీఈసీ సమావేశంలో జై షా అభిప్రాయపడ్డారు. 

ఈ ఏడాది అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ (ఆస్ట్రేలియా), 2021 ఫిబ్రవరిలో జరగాల్సిన మహిళల వన్డే వరల్డ్‌కప్‌ (న్యూజిలాండ్‌) షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించేందుకు ఐసీసీ సమావేశంలో నిశ్చయించారు. కోవిడ్‌-19 పరిస్థితుల ఆధారంగా మెన్స్‌ టీ20 వరల్డ్‌కప్‌పై ఐసీసీ ప్రతి నెలా నివేదిక ఇవ్వనుంది. 

జూన్‌/జులైలో టీ20 వరల్డ్‌కప్‌ నిర్వహణపై స్పష్టమైన ప్రకటన వెలువడే ఆస్కారముంది. క్రికెట్ బోర్డులన్నీ ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. విండీస్ బోర్డు క్రీడాకారులకు జీతాలు చెల్లించలేదు. 

ప్రపంచ క్రికెట్లోనే బిగ్ 3ల్లో ఒకటైన క్రికెట్ ఆస్ట్రేలియా కేవలం 1500 కోట్ల రూపాయల కోసం బ్యాంకుల దగ్గర చేయి చాచే పరిస్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలో అన్ని దేశాల బోర్డులకు కూడా ఆదాయ మార్గాలు అత్యవసరం. 

టెస్టు మ్యాచుల వల్ల పెద్దగా ఆదాయం చేకూరదు. మ్యాచులకు ప్రేక్షకుల హాజరు నామమాత్రంగా ఉంటుంది. స్పాన్సర్లు కూడా ఉండరు. స్పాన్సర్లు వచ్చి, ప్రసార హక్కులు అధిక ధరలకు అమ్ముడవ్వలంటే... ఏకైక మార్గం వినోదాన్ని అత్యధికంగా పంచె టి20, వన్డేలే శరణ్యం అని బీసీసీఐ ప్రతిపాదించింది. 

click me!