
భారత జట్టు పరిమిత వర్ల కెప్టెన్, విధ్వంసక బ్యాట్స్ మెన్, టీం ఇండియా సక్సెస్ ఫుల్ ఓపెనర్ రోహిత్ శర్మను ప్రతిష్టాత్మక రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు నామినేట్ చేసింది బీసీసీఐ. శనివారం బీసీసీఐ విడుదల చేసిన పత్రిక ప్రకటనలో రోహిత్ శర్మను ఖేల్ రత్నకు నామినేట్ చేయడంతోపాటుగా పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ, మరో ఓపెనర్ శిఖర్ ధావన్, మహిళా ఆల్ రౌండర్ దీప్తి శర్మల పేర్లను అర్జున అవార్డులకు ప్రతిపాదించింది.
రోహిత్ శర్మ ఆటతీరును అందరి క్రికెటర్లతో బేరీజు వేసినప్పుడు అతడి అంత ప్రభావవంతంగా పరిమిత వర్ల క్రికెట్లో వేరేవారు రాణించలేదని అన్నారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. 2019 ప్రపంచ కప్ లో 5 సెంచరీలు బాదిన రోహిత్ శర్మ నూతన చరిత్రను లిఖించాడు. వేరే ఏ క్రికెటర్ కూడా సాధించలేకపోయిన ఫీట్ ను సాధించినందుకు ఆ సంవత్సరం ప్లేయర్ అఫ్ ది ఇయర్ గా కూడా నిలిచాడు.
ఇంతవరకు క్రికెట్లో కేవలం ముగ్గురు మాత్రమే ఈ ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును అందుకున్నారు. 1998లో సచిన్ టెండూల్కర్, 2007లో ధోని, 2018లో విరాట్ కోహ్లీ లు మాత్రమే ఈ అవార్డును అందుకున్నారు. భారతదేశంలో క్రీడలకు సంబంధించిన పురస్కారాల్లో ఇది అత్యున్నతమైనది. గత సంవత్సరం ఈ అవార్డును రెజ్లర్ బజరంగ్ పూనియా దక్కించుకున్నాడు.
ఈ మూడేళ్లలో 217 సిక్సర్లు బాది అంతర్జాతీయ క్రికెట్‌లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. 2017లో 65, 2018లో 74, 2019లో 78 సిక్సర్లు కొట్టాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా అవతారం ఎత్తి దక్షిణాఫ్రికాపై విరవిహారం చేశాడు.
విశాఖ వేదికగా జరిగిన టెస్టుల్లో ఏకంగా 13 సిక్సర్లు బాదాడు. తద్వారా ఓ టెస్టులో అత్యధిక సిక్సర్లు కొట్టిన తొలి భారత ఓపెనర్‌గా రోహిత్ నిలిచాడు. అంతేకాకుండా ఆ సిరీస్‌లో అత్యధిక (20) సిక్సర్లు సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ తన పేరిట మరో ఖాతాను నెలకొల్పాడు.
కేవలం టెస్టుల్లోనే కాదు వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో కూడా అత్యధిక సిక్సర్లు సాధించిన రికార్డులు అతని ఖాతాలో ఉన్నాయి. ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 364 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 14,029 పరుగులు సాధించాడు. ఇందులో 39 సెంచరీలు ఉన్నాయి.
మొత్తం మీద 423 సిక్సర్లతో హిట్ మ్యాన్ టాప్ 3లో ఉన్నాడు. అందుకే రోహిత్ శర్మను హిట్ మ్యాన్‌గా, సెహ్వాగ్ స్క్వేర్, సిక్సర్ల కింగ్ అని పిలుస్తారు. ఇక అత్యధిక సిక్సర్లు కొట్టిన వారి జాబితాలో విండీస్ విధ్వంసక ఆటగాడు (534) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. షాహిద్ ఆఫ్రిది (476) ఆ తర్వాతి స్థానంలో నిలిచాడు.