ఐదో టెస్టు జరిగి తీరుతుంది, కానీ ఇప్పుడు కాదు... బీసీసీఐ సెక్రటరీ అధికారిక ప్రకటన..

By Chinthakindhi RamuFirst Published Sep 10, 2021, 3:46 PM IST
Highlights

ఐదో టెస్టును రీషెడ్యూల్ చేసే బాధ్యతను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకే అప్పగించిన బీసీసీఐ... ఆటగాళ్ల సంక్షేమానికే మొదటి ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించిన జే షా...

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్టు ప్రారంభ సమయానికి కొన్ని గంటల ముందు సోషల్ మీడియాలో హై డ్రామా నడిచింది. కొందరు వాయిదా పడిదంటే, మరికొందరు రద్దు అయిందని... ఇంకొందరైతే టీమిండియా, ఇంగ్లాండ్‌కి మ్యాచ్‌ని ఇచ్చేసి తిరుగు పయనమైందని నానా రకాల వార్తలు వండేశారు...

ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా ఈ విధంగానే వెబ్‌సైట్‌లో ప్రకటన విడుదల చేసింది. అయితే సోషల్ మీడియాలో ఇంత జరుగుతున్నా, ఏమీ కానట్టు సైలెంట్‌గా ఉండిపోయిన బీసీసీఐ... హై డ్రామా అంతా ముగిశాక అధికారిక ప్రకటన విడుదల చేసింది...

‘బీసీసీఐ, ఈసీబీ (ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు) కలిసి సంయుక్తంగా మాంచెస్టర్‌‌లో జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. భారత బృందంలో కరోనా కేసులు వెలుగుచూడడం వల్ల మ్యాచ్‌ను ఎలాగైనా నిర్వహించాలని పలు దఫాలుగా చర్చలు నిర్వహించినా... దారి దొరక్కపోవడంతో రద్దు చేయాలని నిర్ణయానికి వచ్చాం...

ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, బీసీసీఐ మధ్య ఉన్న బలమైన అనుబంధం కారణంగా... భారత క్రికెట్ బోర్డు, ఇంగ్లాండ్ జట్టుకే ఈ టెస్టు మ్యాచ్‌ను రీ షెడ్యూల్ చేసే అవకాశాన్ని ఇచ్చింది. ఇరుజట్లకీ అనువైన సమయంలో ఐదో టెస్టును నిర్వహిస్తాం...

భారత క్రికెట్ బోర్డు ఎప్పుడూ ఆటగాళ్ల సంక్షేమం విషయంలో రాజీ పడదు. ఈ కష్టకాలంలో భారత క్రికెట్ బోర్డుకి అండగా నిలిచిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు... ఐదో టెస్టును నిర్వహించలేకపోతున్నందుకు క్రికెట్ అభిమానులకు క్షమాపణలు తెలియచేస్తున్నాం...’ అంటూ మీడియాకి తెలియచేశాడు బీసీసీఐ సెక్రటరీ జే షా.

click me!