BCCI Contracts: భావి సారథులకు ప్రమోషన్.. వెటరన్ ఆటగాళ్లకు డిమోషన్.. త్వరలో ప్రకటించనున్న బీసీసీఐ..?

By Srinivas MFirst Published Jan 26, 2022, 1:06 PM IST
Highlights

BCCI Central Contracts: భావి భారత కెప్లెన్లుగా భావిస్తున్న ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు రిషభ్ పంత్, కెఎల్ రాహుల్ లకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బంపరాఫర్ ఇవ్వనుంది. మరోవైపు ఇద్దరు సీనియర్ ఆటగాళ్లైన...
 

భవిష్యత్తులో టీమిండియాను నడిపిస్తారని భావిస్తున్న  కెఎల్ రాహుల్, రిషభ్ పంత్ లు బంపరాఫర్ కొట్టేశారు. ఈ ఏడాది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించనున్న సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఈ ఇద్దరు  యువ ఆటగాళ్లు ప్రమోషన్ పొందనున్నారు. ప్రస్తుతం గ్రేడ్ ‘ఏ’లో ఉన్న ఈ ఇద్దరినీ త్వరలోనే  గ్రేడ్ ‘ఏ ప్లస్’ కేటగిరీకి  ప్రమోట్ చేయనున్నట్టు సమాచారం.  గత కొన్నాళ్లుగా ఫార్మాట్ తో సంబంధం లేకుండా ఈ ఇద్దరూ నిలకడగా రాణిస్తున్నారు.  ఇదే సమయంలో భారత వెటరన్ ఆటగాళ్లు.. టెస్టు జట్టులోని సీనియర్లు అజింక్యా రహానే, ఛతేశ్వర్ పుజారాలకు మాత్రం షాకివ్వనుంది బీసీసీఐ.  సుమారు రెండేండ్లుగా ఫామ్  లేమితో తంటాలు పడుతున్న ఈ  ఇద్దరికీ డిమోషన్ రానున్నట్టు తెలుస్తున్నది. 

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో  పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మ,  మాజీ సారథి విరాట్ కోహ్లి,  పేసర్ జస్ప్రీత్ బుమ్రాల మాత్రమే  ‘గ్రేడ్-ఏ ప్లస్’ కేటగిరీలో ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో  కెఎల్ రాహుల్, రిషభ్ పంత్ లను కూడా చేర్చనున్నారు. 

బీసీసీఐ ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా వారికి చెల్లించే జీతాలను నాలుగు రకాలుగా విభజించింది. అవి 1. గ్రేడ్-ఏ ప్లస్ 2. గ్రేడ్- ఏ 3.  గ్రేడ్- బీ 4. గ్రేడ్- సీ.. 
- గ్రేడ్- ఏ ప్లస్ ఆటగాళ్లకు సాలీనా చెల్లించే వేతనం రూ. 7 కోట్లు. 
- గ్రేడ్- ఏ ఆటగాళ్లకు రూ. 5 కోట్లు.
- గ్రేడ్- బీ ఆటగాళ్లకు రూ. 3 కోట్లు.
- గ్రేడ్- సీ ఆటగాళ్లకు రూ. 1 కోటి.

రాహుల్, పంత్ లకు ప్రమోషన్ ఇవ్వబోతున్న  బీసీసీఐ.. రహానే,  పుజారాలకు మాత్రం డిమోషన్ ఇవ్వనున్నది. ఇప్పటివరకు  రహానే, పుజారాలు గ్రేడ్- ఏ  కేటగిరీలో ఉన్నారు. తాజాగా వీళ్లను గ్రేడ్-బీ కి డిమోట్ చేయనున్నట్టు సమాచారం.  ఈ మేరకు సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించేందుకు  బీసీసీఐకి చెందిన ముగ్గురు ఆఫీస్ బేరర్లు .. ఐదుగురు సెలెక్టర్లు.. జాతీయ స్థాయి కోచ్ లతో కమిటీ సిద్ధమైంది.  మొత్తం 28 మంది ఆటగాళ్లతో జాబితాను తయారు చేసింది. రాబోయే కొద్దిరోజుల్లో బీసీసీఐ దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నది. 

శార్ధూల్, సిరాజ్ పైకి.. ఇషాంత్, యాదవ్ కిందికి... 

రాహుల్, పంత్ తో పాటు టీమిండియా యువ బౌలర్లు మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ లకు కూడా ప్రమోషన్ ఖరారైనట్టు సమాచారం. ప్రస్తుతం సిరాజ్ గ్రేడ్-సీలో ఉన్నాడు. అతడికి గ్రేడ్-బీకి మార్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సిరాజ్ తో పాటే శార్దూల్ కూ ప్రమోషన్ రానుంది. ప్రస్తుతం అతడు గ్రేడ్-బీలో ఉన్నాడు.  ఇక వీళ్లతో పాటు వెంకటేశ్ అయ్యర్,  హర్షల్ పటేల్ లకు ఈ సీజన్ లో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ అందించే అవకాశముంది. 

ఇదిలాఉండగా..  టీమిండియా సీనియర్ పేసర్లు ఇషాంత్ శర్మ (గ్రేడ్-ఏ), ఉమేశ్ యాదవ్ (గ్రేడ్-బీ) లు డిమోట్ కానున్నట్టు తెలుస్తున్నది. డిమోట్ అయ్యే వాళ్ల జాబితాలో టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా ఉన్నట్టు సమాచారం. 

2021 సీజన్ లో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా : 

గ్రేడ్-ఏ ప్లస్ : విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా 
గ్రేడ్-ఏ : అశ్విన్, జడేజా, పుజారా, రహానే, ధావన్, కెఎల్ రాహుల్, షమీ, ఇషాంత్ శర్మ, రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యా 
గ్రేడ్-బీ : వృద్ధిమాన్ సాహ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్ 
గ్రేడ్-సీ : కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, దీపక్ చాహర్, శుభమన్ గిల్, హనుమా విహారి, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్
 

click me!