జింబాబ్వేపై 3 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న బంగ్లాదేశ్... ఆఖరి బంతి వరకూ పోరాడి ఓడిన జింబాబ్వే...
టీ20 వరల్డ్ కప్‌లో మొట్టమొదటిసారి సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించిన జింబాబ్వే, టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తోంది. గత మ్యాచ్‌లో పాకిస్తాన్‌ని 1 పరుగు తేడాతో ఓడించిన జింబాబ్వే, బంగ్లాదేశ్‌కి కూడా చెమటలు పట్టించింది. ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి హై డ్రామా నడిచింది. ఆఖరి బంతికి వికెట్ కీపర్ చూపించిన అత్యుత్సాహం కారణంగా హై డ్రామా నడిచింది... ట్విస్టు మీద ట్వీస్టుతో సాగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై బంగ్లాదేశ్ అనుభవమే గెలిచింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. సౌమ్య సర్కార్ 2 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. 12 బంతుల్లో 3 ఫోర్లతో 14 పరుగులు చేసిన లిట్టన్ దాస్ కూడా తీవ్రంగా నిరాశపరచడంతో 32 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్...
ఈ దశలో షకీబ్ అల్ హసన్, షాంటో కలిసి మూడో వికెట్‌కి 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 20 బంతుల్లో ఓ ఫోర్‌తో 23 పరుగులు చేసిన షకీబ్ అల్ హసన్, సీన్ విలియమ్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 55 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 71 పరుగులు చేసిన బంగ్లా ఓపెనర్ షాంటో, సికందర్ రజా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
అఫిఫ్ హుస్సేన్ 19 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 29 పరుగులు చేయగా మోసడెన్ హుస్సేన్ 10 బంతుల్లో 7 పరుగులు చేశాడు...
undefined
నరుల్ హసన్ 1 పరుగుకే రనౌట్ అయ్యాడు. జింబాబ్వే బౌలర్లలో నరగవా, ముజరబానీ రెండేసి వికెట్లు తీయగా సికందర్ రజా, షాన్ విలియమ్స్ ఒక్కో వికెట్ తీశారు.
151 పరుగుల లక్ష్యఛేదనలో 35 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో పడింది జింబాబ్వే. వెస్లీ మెదెవెరే 4, కెప్టెన్ క్రెగ్ ఎర్వీన్ 8, మిల్టన్ శుంబ 8 పరుగులు చేయగా సికందర్ రజా డకౌట్ అయ్యాడు. 19 బంతుల్లో 15 పరుగులు చేసిన రెగిస్ చక్‌బవా, టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
అయితే షాన్ విలియమ్స్ క్రీజులో కుదురుకుపోవడంతో గెలుపు జింబాబ్వే ఆశలు వదులుకోలేదు. హసన్ మహ్ముద్ వేసిన 18వ ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన విలియమ్స్, షకీబ్ అల్ హసన్ వేసిన 19వ ఓవర్‌లో ఓ ఫోర్ బాదాడు...
అయితే జింబాబ్వే విజయానికి 9 బంతుల్లో 19 పరుగులు కావాల్సిన దశలో విలియమ్స్ రనౌట్ అయ్యాడు. 42 బంతుల్లో 8 ఫోర్లతో 64 పరుగులు షాన్ విలియమ్స్‌ని షకీబ్ అల్ హసన్ రనౌట్ చేయడంతో మ్యాచ్‌పై మళ్లీ పట్టు సాధించింది బంగ్లాదేశ్...
జింబాబ్వే విజయానికి ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు కావాల్సి వచ్చాయి. తొలి బంతికి సింగిల్ మాత్రమే రాగా రెండో బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించిన బ్రాడ్ ఎవెన్స్, బౌండరీ లైన్ దగ్గర అఫిఫ్ హుస్సేన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
క్రీజులోకి వచ్చిన రిచర్డ్ నరగవా బ్యాట్ ఎడ్జ్‌కి తగిలి 4 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత బంతికి ఫైన్ లెగ్ మీదుగా సూపర్ సిక్సర్ బాదాడు నరగవా... దీంతో జింబాబ్వే విజయానికి ఆఖరి 2 బంతుల్లో 5 పరుగులు కావాల్సి వచ్చాయి. ఐదో బంతికి ముందుకొచ్చి షాట్ ఆడబోయిన నరగవా... స్టంపౌట్ అయ్యాడు... దీంతో ఆఖరి బంతికి 5 పరుగులు కావాల్సి వచ్చాయి. ఆఖరి బంతికి బ్లెస్సింగ్ ముజరబానీ భారీ షాట్ ఆడబోయి స్టంపౌట్ అయ్యాడు...
ముజరబానీ స్టంపౌట్ అయ్యాడని విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది బంగ్లాదేశ్. అయితే టీవీ రిప్లైలో వికెట్ కీపర్, బంతిని వికెట్లను దాటకముందే కలెక్ట్ చేసుకున్నట్టు తేలింది...
దీంతో ఐసీసీ రూల్స్ ప్రకారం ముజరబానీని నాటౌట్‌గా ప్రకటించిన థర్డ్ అంపైర్, నో బాల్‌గా ప్రకటించాడు. అప్పటికే పెవిలియన్ చేరుకున్న ఇరు జట్ల ప్లేయర్లు, తిరిగి క్రీజులోకి వచ్చారు. ఆఖరి బంతికి 4 పరుగులు కావాల్సిన దశలో మరోసారి ముజరబానీ బంతిని మిస్ చేయడంతో 3 పరుగుల తేడాతో గెలిచింది బంగ్లాదేశ్...