ఫలితాన్ని మార్చిన ‘‘నోబాల్’’: కళ్లు మూసుకున్నారా, అంపైర్లపై కోహ్లీ ఫైర్

By Siva KodatiFirst Published Mar 29, 2019, 11:18 AM IST
Highlights

అంపైర్ పొరపాటు కారణంగా మ్యాచ్ బెంగళూరు చేజారడంతో విరాట్ కోహ్లీ అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. 

ఐపీఎల్ 2019లో బోణీ కొడదామనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరోసారి నిరాశే ఎదురైంది. చిన్నస్వామి స్టేడియంలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఓడిపోయింది.

అయితే ఈ మ్యాచ్‌లో అంపైర్ పొరపాటు కారణంగా మ్యాచ్ బెంగళూరు చేజారడంతో విరాట్ కోహ్లీ అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. గురువారం నాటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూకు డివిలియర్స్ దూకుడుతో విజయం ఖరారైనట్లేనని అనిపించింది. అయితే చివర్లో ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బెంగళూరుకు పరుగులు చేయడం కష్టంగా మారింది.

చివరి ఓవర్లో 6 బంతుల్లో 17 పరుగులు అవసరం కాగా.. ఆఖరి ఓవర్ మలింగ వేశాడు. తొలి బంతినే శివమ్ దూబే సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత సింగిల్ తీయడంతో డివిలియర్స్ స్ట్రైకింగ్‌లోకి వచ్చాడు.

అయితే మలింగ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు, నాలుగు, ఐదు బంతులకు ఒక్కో పరుగు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఆఖరి బంతికి 7 పరుగులు అవసరం కాగా, మలింగ లోఫుల్‌టాస్ బంతిని వేశాడు.

దీనిని లాంగాన్ దిశగా దూబే భారీ షాట్ కొట్టాడు. అయితే దానిని బౌండరీ లైన్ వద్ద పొలార్డ్, రోహిత్ శర్మ అడ్డుకున్నారు. 6 పరుగుల తేడాతో గెలిచినందుకు ముంబై సంబరాలు చేసుకుంటుండగా.. మలింగ ఆఖరి బంతిని నోబాల్‌గా విసిరినట్లు రీప్లైలో తేలింది.

ఇది స్టేడియంలోని పెద్ద తెరలపై కనిపించడంతో ఒక్కసారిగా నిశ్శబ్ధ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో అంపైర్ తప్పిదం కారణంగానే ముంబై గెలిచిందంటూ ఛాలెంజర్స్ అభిమానులు మండిపడ్డారు.

దీనిని డ్రెస్సింగ్ రూమ్ నుంచి గమనించిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అంపైర్లపై భగ్గుమన్నాడు. అంపైర్లు కొంచెం కళ్లు తెరచుకుని అంపైరింగ్ చేయాలని .. మేం ఐపీఎల్ ఆడుతున్నామని, క్లబ్ స్థాయి క్రికెట్ కాదు.. ఆఖరి బంతిని నోబాల్‌గా ప్రకటించకపోవడం దుర్మార్గం మంటూ మండిపడ్డాడు. ఇలాంటి చిన్న విషయాలే ఫలితంపై ప్రభావం చూపిస్తాయని కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు. 

click me!