అధ్యక్షుడిగా అజరుద్దీన్: హెచ్ సీఏ అపెక్స్ కౌన్సిల్ ఆగ్రహం, ప్రెస్ మీట్ కు అనుమతి నిరాకరణ

By telugu teamFirst Published Jul 5, 2021, 12:17 PM IST
Highlights

హెచ్ సిఐ అధ్యక్షుడిగా తిరిగి అజరుద్దీన్ ను నియమిస్తూ జస్టిస్ దీపక్ వర్మ నేతృత్వంలోని కమిటీ నిర్ణయం తీసుకోవడంపై అపెక్స్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రెస్ మీట్ పెట్టడానికి అపెక్స్ కౌన్సిల్ సభ్యులు సిద్ధమయ్యారు.

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సిఏ) అధ్యక్షుడిగా మొహమ్మద్ అజరుద్దీన్ ను తిరిగి నియమించడంపై అపెక్స్ కౌన్సిల్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తోంది. జస్టిస్ దీపక్ వర్మ నేతృత్వంలోని అంబుడ్స్ మన్ విచారణ తిరిగి అజరుద్దీన్ ను హెచ్ సిఏ అధ్యక్షుడిగా నియమించింది. ఐదుగురు అపెక్స్ కౌన్సిల్ సభ్యులపై తాత్కాలికంగా అనర్హత వేటు వేసింది.

దానిపై అపెక్స్ కౌన్సిల్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు ప్రెస్ మీట్ పెట్టడానికి సిద్ధపడ్డారు. అయితే, వారి ప్రెస్ మీట్ ను పోలీసులు అడ్డుకుంటున్నారు. ప్రెస్ మీట్ కు అనుమతి లేదని వారు చెబుతున్నారు. తాము ఎలాగైనా ప్రెస్ మీట్ పెడుతామని వారంటున్నారు. దీంతో జింఖానా మైదానం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.  జింఖానా మైదానంలో భారీగా పోలీసులు మోహరించారు.

అపెక్స్ కౌన్సిల్ సభ్యులు ఐదుగురు కాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. హెచ్ సిఏ అధ్యక్షుడిగా అజరుద్దీన్ ను తొలగిస్తూ అపెక్స్ కౌన్సిల్ జూన్ 17వ తేదీన నిర్ణయం తీసుకుంది. అజరుద్దీన్ కు పంపిన షోకాజ్ నోటీసులు గానీ, ఇతరత్రా ఆదేశాలు గానీ చెల్లబాటు కావని దీపక్ వర్మ నేతృత్వంలోని కమిటీ తెలిపింది. 

అజరుద్దీన్ ను సస్పెండ్ చేసిన తర్వాత జాన్ మనోజ్ ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తూ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. జాన్ మనోజ్ కూడా అపెక్స్ కౌన్సిల్ లో ఉన్నారు. అంబుడ్సమన్ నిర్ణయంతో కె. జాన్ మనోజ్, ఆర్. విజయానంద్, నరేశ్ శర్మ, సురేందర్ అగర్వాల్, అనురాధలపై అనర్హత వేటు పడింది. 

click me!