అదరగొట్టిన అక్షర్ పటేల్! సూర్య, శివమ్ మావి మెరుపులు మెరిపించినా... పోరాడి ఓడిన టీమిండియా...

By Chinthakindhi RamuFirst Published Jan 5, 2023, 10:46 PM IST
Highlights

207 పరుగుల లక్ష్యఛేదనలో 190 పరుగులకి పరిమితమైన టీమిండియా... అక్షర్ పటేల్ రికార్డు హాఫ్ సెంచరీ! హాఫ్ సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ.. 

207 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 57 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా... అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ అద్భుత హాఫ్ సెంచరీలు, శివమ్ మావి మెరుపులతో ఆఖరి ఓవర్ వరకూ పోరాడి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 190 పరుగులే చేసిన టీమిండియా 16 పరుగుల తేడాతో ఓడింది... రెండో టీ20లో గెలిచిన శ్రీలంక, టీ20 సిరీస్‌ని 1-1  తేడాతో డ్రా చేయగలిగింది.. 
207 పరుగుల కొండంత లక్ష్యఛేదనలో 21 పరుగులకే 3  వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది టీమిండియా.  2  పరుగులు చేసిన ఇషాన్ కిషన్‌‌ని క్లీన్ బౌల్డ్ చేసిన రజిత, టీమిండియాకి తొలి షాక్ ఇచ్చాడు.

5 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ కూడా రజిత బౌలింగ్‌లోనే అవుట్ కాగా మొట్టమొదటి మ్యాచ్ ఆడుతున్న రాహుల్ త్రిపాఠి 5 పరుగులు చేసి దిల్షాన్ మధుశంక బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సమయానికి 27 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది భారత జట్టు.


ఆదుకుంటాడనుకున్న హార్ధిక్ పాండ్యా 12 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌ బాది 12 పరుగులు చేసి అవుట్ కాగా దీపక్ హుడా 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 57 పరుగులకే  5 వికెట్లు కోల్పోయింది భారత జట్టు...

ఈ దశలో సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ కలిసి అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. హసరంగ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది వన్ సైడెడ్‌గా సాగుతున్న మ్యాచ్‌ని మలుపు తిప్పాడు అక్షర్ పటేల్. సూర్యకుమార్ యాదవ్ కూడా బ్యాటు ఝులిపించడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది...

20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అక్షర్ పటేల్, 7వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన భారత బ్యాటర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకుముందు ఆస్ట్రేలియాపై 44 పరుగులు చేశాడు రవీంద్ర జడేజా. జడ్డూ రికార్డును తుడిచి పెట్టేసిన అక్షర్ పటేల్, ఆరో వికెట్‌కి సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి 91 పరుగులు జోడించి రికార్డు క్రియేట్ చేశాడు...

టీమిండియాకి టీ20ల్లో ఆరో వికెట్‌కి ఇదే అత్యధిక భాగస్వామ్యం. 36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, మధుశంక బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యే సమయానికి భారత జట్టు విజయానికి ఆఖరి 4 ఓవర్లలో 58 పరుగులు కావాలి...

17వ ఓవర్‌లో 8 పరుగులు మాత్రమే రాగా 18వ ఓవర్‌ ఆఖరి 3 బంతుల్లో 6, 4, 6 బాది 17 పరుగులు రాబట్టాడు శివమ్ మావి. దీంతో భారత జట్టు విజయానికి ఆఖరి 2 ఓవర్లలో 33 పరుగులు కావాల్సి వచ్చాయి..

19వ ఓవర్‌లో 12 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో చివరి ఓవర్‌లో భారత జట్టు విజయానికి 21 పరుగులు కావాల్సి వచ్చాయి. మొదటి రెండు బంతుల్లో 3 పరుగులు రాగా మూడో బంతికి అక్షర్ పటేల్ అవుట్ అయ్యాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 65 పరుగులు చేసిన అక్షర్ పటేల్, దసున్ శనక బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు.

అక్షర్ పటేల్ అవుటయ్యే సమయానికి టీమిండియా విజయానికి 3 బంతుల్లో 18 పరుగులు కావాలి. ఉమ్రాన్ మాలిక్ వస్తూనే సింగిల్ తీయగా 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసిన శివమ్ మావి ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు.. దీంతో టీమిండియా 16 పరుగుల తేడాతో ఓడింది..  

click me!