నిరూపించుకున్నాడు: ధోనీ రికార్డును బద్దలు కొట్టిన రిషబ్ పంత్

By telugu teamFirst Published Jan 19, 2021, 3:01 PM IST
Highlights

యువ వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ తన సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టు మ్యాచులో దూకుడుగా ఆడి భారత్ కు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు.

బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచు సిరీస్ లో భారత యువ వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ తానేమిటో నిరూపించుకున్నాడు. వికెట్ కీపర్ గా, బ్యాట్స్ మన్ గా ఎంఎస్ ధోనీకి ఏ మాత్రం సాటి రాడని భావించిన రిషబ్ పంత్ తాను నిలబడగలనని ప్రకటించుకున్నాడు. ఈ క్రమంలో ధోనీ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. 

టెస్టుల్లో భారత వికెట్ కీపర్ గా అతి తక్కువ ఇన్నింగ్సుల్లో వేయి పరుగులు సాధించిన ఆటగాడిగా పంత్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్సులో కెప్టెన్ అజింక్యా రహానే (24) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ (89) కమిన్స్ వేసిన 58వ ఓవరు మూడో బంతికి రెండు పరుగులు తీసి టెస్టు ఫార్మాట్ లో వేయి పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. 

పంత్ కి ఇది 27వ ఇన్నింగ్సు. అంతకు ముందు ధోనీ 32 ఇన్నింగ్సుల్లో వేయి పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. పంత్ దాన్ని అధిగమించాడు. తర్వాత స్థానాల్లో ఫరూక్ ఇంజినీర్ (36), వృద్దిమాన్ సాహా (37), నయన్ మోంగియా (39) ఉన్నారు. 

టీమిండియా తరఫున 2018లో పంత్ టెస్టుల్లో ఆరంగేట్రం చేశాడు. అదే సీజన్ లో ఇంగ్లాండు (114), ఆస్ట్రేలియా (159 నాటౌట్) పర్యటనల్లో సెంచరీలు చేశాడు. దాంతోనే అతను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో పంత్ 97 పరుగులు చేశాడు. 

ఇప్పటి వరకు 16 మ్యాచులు ఆడిన పంత్ 27 ఇన్నింగ్సుల్లో రెండు సెంచరీలు, నాలుగు అర్థ ెసంచరీలు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు మ్యాచులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచుగా ఎంపికయ్యాడు.

click me!