అస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు సారధి మెగ్ లాన్నింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
మెల్‌బోర్న్: అస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మెగ్ లాన్నింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుండి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు.గురువారంనాడు ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. 13 ఏళ్ల పాటు అస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టుకు మెగ్ లానింగ్ నాయకత్వం వహించారు. అస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు ఐదు ప్రపంచకప్ లను సాధించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.మూడు రకాల ఫార్మెట్లలో 241 మ్యాచ్ లు ఆడి 8,352 పరుగులు సాధించారు. అంతర్జాతీయ క్రికెట్ నుండి వైదొలగాలనే నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమైందన్నారు. కానీ, రిటైర్మెంట్ కోసం ఇదే సరైన సమయమని భావిస్తున్నట్టుగా ఆమె ప్రకటించారు.
also read:భారత విజయాల్లో షమీ కీలకపాత్ర: షమీ మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు
13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ ను ఆస్వాదించినట్టుగా చెప్పారు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాను ఇష్టపడే ఆటను అత్యున్నత స్థాయిలో ఆడేందుకు తనను అనుమతించినందుకు తన కుటుంబం, తన సహచరులు, క్రికెట్ విక్టోరియా,క్రికెట్ అస్ట్రేలియా,అస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
తన కెరీర్ లో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు చెప్పారు.2010 న్యూజిలాండ్ తో జరిగిన టీ 20 మ్యాచ్ లో ఆమె క్రికెట్ లోకి అడుగుపెట్టారు.2014లో అస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించారు. అప్పుడు ఆమె వయస్సు 21 ఏళ్లు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఆమె క్రికెట్ ఆడారు.
31 ఏళ్ల లాన్నింగ్ ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం పలువురిని ఆశ్చర్యాన్ని గురి చేసింది.182 మ్యాచుల్లో అస్ట్రేలియా జట్టుకు లాన్నింగ్ కెప్టెన్ గా వ్యవహరించారు. మెగ్ లానింగ్ పుల్ బ్యాట్ ఉమెన్ తో పాటు పార్ట్ టైమ్ బౌలర్ గా కూడ రాణించారు.అస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు సాధించిన విజయాల్లో మెగ్ లాన్నింగ్ కీలకంగా వ్యవహరించారు. మెగ్ లాన్నింగ్ అపరిమితమైన ప్రభావాన్ని చూపారు.