ఏషియన్ గేమ్స్ 2023: పాకిస్తాన్‌కి దక్కని కాంస్యం! ఇండియా- ఆఫ్ఘాన్ మ్యాచ్‌కి వరుణుడి అంతరాయం...

By Chinthakindhi Ramu  |  First Published Oct 7, 2023, 2:01 PM IST

Asian Games 2023: కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 6 వికెట్ల తేడాతో నెగ్గిన బంగ్లాదేశ్.. వర్షం కారణంగా నిలిచిన ఇండియా - ఆఫ్ఘనిస్తాన్ గోల్డ్ మెడల్ మ్యాచ్.. 


ఏషియన్ గేమ్స్‌ 2023 పోటీల్లో పాకిస్తాన్‌కి ఘోర పరాభవం ఎదురైంది. సెమీ ఫైనల్‌లో ఆఫ్ఘాన్ చేతుల్లో ఓడిన పాకిస్తాన్, కాంస్య పతక పోరులో బంగ్లాదేశ్ చేతుల్లో పరాజయం పాలైంది. 

వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, 5 ఓవర్లలో వికెట్ నష్టపోయి 48 పరుగులు చేసింది. కుష్‌దిల్ షా 10 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మిర్జా బైగ్ 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేయగా ఓమెర్ యూసఫ్ 2 బంతులాడి ఓ పరుగు చేశాడు..

Latest Videos

డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 5 ఓవర్లలో 65 పరుగులుగా నిర్ణయించారు.  జాకీర్ హసన్, సైఫ్ హసన్ డకౌట్ కావడంతో 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్. అయితే  అఫిఫ్ హుస్సేన్ 11 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేయగా యాసిర్ ఆలీ 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 34 పరుగులు చేశాడు. ఆఖరి బంతికి ఫోర్ బాదిన రకీబుల్ హసన్.. బంగ్లాదేశ్‌కి కాంస్య పతకాన్ని అందించాడు..

ఇండియా- ఆఫ్ఘాన్ మధ్య జరుగుతున్న గోల్డ్ మెడల్ మ్యాచ్‌కి వరుణుడు అంతరాయం కలిగించాడు. వర్షం కారణంగా 20 నిమిషాలు ఆలస్యంగా టాస్ జరిగింది. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత భారత బౌలర్లు అదరగొట్టడంతో 52 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది ఆఫ్ఘాన్..

జుబేద్ ఆక్బరీ 5, మహ్మద్ షాజాద్ 4, నూర్ ఆలీ జాద్రాన్ 1, ఆఫ్సర్ జజయ్ 15, కరీం జనత్ 1 పరుగు చేసి అవుట్ అయ్యారు. అయితే షాహీదుల్లా కమల్, కెప్టెన్ గుల్బాదీన్ నయిబ్ కలిసి ఆరో వికెట్‌కి 60 పరుగుల భాగస్వామ్యం జోడించారు.

వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసి ఆఫ్ఘనిస్తాన్.  షాహీదుల్లా కమల్ 43 బంతుల్లో  3 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 పరుగులు చేయగా గుల్బాద్దీన్ నయిబ్ 24 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. వర్షం తగ్గితే ఓవర్లను కుదించి, డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్‌ని నిర్వహిస్తారు. వర్షం ఎంతకీ తగ్గకపోతే మెరుగైన ర్యాంకులో ఉన్న భారత్, స్వర్ణం పతకం గెలుస్తుంది.. 

click me!