తగ్గని వాన! డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే...

Published : Sep 02, 2023, 08:52 PM ISTUpdated : Sep 02, 2023, 08:58 PM IST
తగ్గని వాన! డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే...

సారాంశం

టీమిండియా ఇన్నింగ్స్ ముగియగానే భారీ వర్షం..  డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పాకిస్తాన్‌కి టార్గెట్ నిర్ణయించే అవకాశం..

ఆసియా కప్ 2023 టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ని వరుణుడు వదలడం లేదు. భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత జోరు వాన కురవడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ ఆలస్యంగా ఆరంభం కానుంది. ఇప్పటికే వర్షం కారణంగా విలువైన సమయం వృధా కావడంతో పాక్ ఇన్నింగ్స్ పూర్తిగా 50 ఓవర్ల పాటు సాగడం కష్టమే..

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకి ఆలౌట్ అయ్యింది. దీంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పాకిస్తాన్‌ 45 ఓవర్లు బ్యాటింగ్ చేస్తే, 254 పరుగులు చేయాల్సి ఉంటుంది. 40 ఓవర్లు బ్యాటింగ్ చేస్తే 239 పరుగులు, 30 ఓవర్లు బ్యాటింగ్ చేస్తే 203 పరుగులు చేయాల్సి ఉంటుంది. అదే 20 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం అయితే పాకిస్తాన్ 155 పరుగులు చేయాల్సి ఉంటుంది..

వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉండడం వల్లే టీమిండియా టాస్ గెలవగానే మరో ఆలోచన లేకుండా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలిసారి వర్షం అంతరాయం కలిగించడానికి ముందు 4.2 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 15 పరుగులు చేసింది టీమిండియా. రెయిన్ బ్రేక్ తర్వాత వెంటవెంటనే 2 వికెట్లు కోల్పోయింది..

మరోసారి బ్రేక్ తర్వాత శ్రేయాస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్ వికెట్లు కోల్పోయింది. 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు. ఈ దశలో ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా కలిసి టీమిండియాని ఆదుకున్నారు.  82 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై అత్యధిక స్కోరు బాదిన భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఇంతకుముందు 2008 ఆసియా కప్‌లో ధోనీ 76 పరుగులు చేయడమే ఆసియా కప్‌లో భారత వికెట్ కీపర్‌కి అత్యధిక స్కోరు.. 

62 బంతుల్లో 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ అందుకున్నాడు హార్ధిక్ పాండ్యా. వన్డేల్లో హార్ధిక్ పాండ్యాకి ఇది 11వ హాఫ్ సెంచరీ..  హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ కలిసి ఐదో వికెట్‌కి 138 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.  

81 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 82 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో బాబర్ ఆజమ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో 3 ఫోర్లు బాదిన హార్ధిక్ పాండ్యా, 12 పరుగులు రాబట్టాడు. 90 బంతుల్లో  7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 87 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో అఘా సల్మాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

హార్ధిక్ పాండ్యా అవుటైన ఓవర్‌లోనే రవీంద్ర జడేజాని పెవిలియన్ చేర్చాడు షాహీన్ ఆఫ్రిదీ. 22 బంతుల్లో ఓ ఫోర్‌తో 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు రవీంద్ర జడేజా. శార్దూల్ ఠాకూర్ 3 పరుగులు చేసి నసీం షా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.. 13 బంతుల్లో 4 పరుగులు చేసిన కుల్దీప్ యాదవ్, నసీం షా బౌలింగ్‌లో రిజ్వాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

 14 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసిన జస్ప్రిత్ బుమ్రా, నసీం షా బౌలింగ్‌లో సిక్సర్‌కి ప్రయత్నించి, బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. పాక్ బౌలర్లలో షాహీన్ షా ఆఫ్రిదీకి 4 వికెట్లు దక్కగా హారీస్ రౌఫ్ 3 వికెట్లు తీశాడు. నసీం షాకి 3 వికెట్లు దక్కాయి. 

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే