శ్రీలంకకు మరో షాక్! ఆర్థిక సంక్షోభం దెబ్బతో ఆసియా కప్ 2022 వేదిక మార్పు...

Published : Apr 10, 2022, 03:15 PM IST
శ్రీలంకకు మరో షాక్! ఆర్థిక సంక్షోభం దెబ్బతో ఆసియా కప్ 2022 వేదిక మార్పు...

సారాంశం

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం... విపరీతంగా పెరిగిపోయిన కనీస వసతుల ధరలు, ఆసియా కప్ 2022 టోర్నీ వేదికను యూఏఈకి తరలించే అవకాశం... 

పొరుగుదేశం శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో అష్టకష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణం కారణంగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని, అక్కడ జనాలు అతలాకుతలం అవుతున్నారు. ఒక్క కోడి గుడ్డు ధర రూ.60కి పైగా చేరగా, కిలో చికెన్ ధర రూ.1800లకు పైగా పలుకుతోంది...

శ్రీలంకతో ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో ఆసియా కప్ 2022 వేదిక మార్చే దిశగా ఆలోచనలు చేస్తోంది ఆసియా క్రికెట్ అసోసియేషన్. వాస్తవానికి 2020లో జరగాల్సిన ఆసియా కప్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత 2021 జూన్ నెలలోనే ఆసియా కప్ నిర్వహించాల్సి ఉంది. అయితే భారత జట్టు, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించడంతో అప్పుడు కూడా ఆసియా కప్ నిర్వహణ సాధ్యం కాలేదు...

మార్చి 19న యూఏఈలో సమావేశమైన ఆసియా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, శ్రీలంక వేదికగా ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రాబోయే ఐసీసీ టోర్నీ ఫార్మాట్‌ని బట్టి ఆసియా కప్ నిర్వహించే ఫార్మాట్‌ డిసైడ్ చేయబడుతుంది...

ఈ ఏడాది నవంబర్‌లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ జరగనుంది. దీంతో జూన్‌లో టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్ నిర్వహించబోతున్నారు. వచ్చే ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ జరగనుంది. దీంతో వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా వన్డే ఫార్మాట్‌లో ఆసియా కప్ జరగాల్సి ఉంది...

అయితే శ్రీలంకలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆసియా కప్ టోర్నీని నిర్వహించడం అంత తేలికయ్యే విషయం కాదు. భారత్‌తో పాటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు యూఏఈ, కువైట్, సింగ్‌పూర్, హంగ్ కాంగ్‌లలో ఓ జట్టు క్వాలిఫైయర్ రౌండ్‌లో గెలిచి ఆసియా కప్‌కి అర్హత సాధిస్తుంది...

ఆరు దేశాల క్రికెటర్లకు ఆతిథ్యం,ఇతరత్రా వసతులను ఏర్పాటు చేయడం అంత తేలికయ్యే విషయం కాదు. కాబట్టి ఆసియా కప్ 2022 టోర్నీని తటస్థ వేదికపై (యూఏఈ) నిర్వహించాలని ఆసియా క్రికెట్ అసోసియేషన్ భావిస్తున్నట్టు సమాచారం...

1984లో యూఏఈ వేదికగా ఆసియా కప్ టోర్నీ ప్రారంభమైంది. తొలుత వన్డే ఫార్మాట్‌లో ఈ టోర్నీ నిర్వహించగా, 2015లో వన్డే, టీ20 ఫార్మాట్లలో ఈ టోర్నీని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఆసియా క్రికెట్ కౌన్సిల్. రాబోయే ఐసీసీ ఈవెంట్‌ ఫార్మాట్‌ని బట్టి ఆసియా కప్ ఫార్మాట్‌ని నిర్ణయిస్తారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు జరుగుతున్న టోర్నీ కావడంతో ఈ సారి టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్ జరుగుతుంది...

1984, 1988, 1990, 1995, 2010, 2016, 2018 సీజన్లలో టీమిండియా ఆసియా కప్ టైటిల్‌ను గెలవగా 1986, 1997, 2004, 2008, 2014 సీజన్లలో శ్రీలంకకి టైటిల్ దక్కింది. 2000వ సంవత్సరంలో తొలిసారి ఆసియా కప్ గెలిచిన పాకిస్తాన్, 2012లో చివరిగా గెలిచింది.

ఆగస్టు 20 నుంచి క్వాలిఫైయర్స్ మ్యాచులు ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకూ ఆసియా కప్ టోర్నీ జరుగుతుంది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కంటే ముందుగానే ఆసియా కప్ టీ20 టోర్నీలో దాయాదుల పోరు చూసే అవకాశం దక్కనుంది...

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !