
ఆసియా కప్ -2022 లో భాగంగా పాకిస్తాన్ ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశామన్న ఆనందం భారత్ ఎంతోసేపు నిలువలేదు. 148 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ కు తొలి ఓవర్లోనే భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ తర్వాత గాయపడి ఇటీవలే జట్టులోకి వచ్చిన కెఎల్ రాహుల్... గోల్డెన్ డకౌట్ అయ్యాడు. పాకిస్తాన్ అరంగేట్ర బౌలర్ నసీమ్ షా వేసిన తొలి ఓవర్లోనే రాహుల్ వికెట్ల మీదకు ఆడుకుని వికెట్ సమర్పించుకున్నాడు.
రాహుల్ ఔటైన విధానం చూస్తే గతేడాది టీ20 ప్రపంచకప్ లో షాహీన్ షా అఫ్రిది బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయిన సీన్ మరోసారి కనిపించింది. అప్పుడు కూడా రాహుల్.. 8 బంతులాడి 3 పరుగులే చేసి అఫ్రిది బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.
తాజా మ్యాచ్ లో కూడా రాహుల్.. ఓపెనర్ గా రోహిత్ శర్మతో బరిలోకి దిగాడు. ఎదుర్కున్న తొలి బంతినే వికెట్ల మీదకు ఆడుకుని వికెట్ సమర్పించుకున్నాడు.
ఇక అదే ఓవర్లో వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ కూడా ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కోహ్లీ ఎదుర్కున్న రెండో బంతి ఎడ్జ్ కు తాకి స్లిప్స్ కు వెళ్లింది. ఫకర్ జమాన్ క్యాచ్ అందుకునేందుకు ముందకు డైవ్ చేశాడుు. కానీ అతడు క్యాచ్ అందుకోలేకపోయాడు. దీంతో కోహ్లీకి లైఫ్ దొరికింది. 4 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా.. వికెట్ నష్టపోయి 23 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (19 నాటౌట్), రోహిత్ శర్మ (3 నాటౌట్) క్రీజులో ఉన్నారు. భారత విజయానికి 16 ఓవర్లలో 125 పరుగులు కావాలి.
టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన పాకిస్తాన్.. 19.5 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్.. 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. హార్ధిక్ పాండ్యా నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.అర్ష్‌దీప్ 2 వికెట్లు తీయగా అవేశ్ ఖాన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.