Asia Cup: పగ తీర్చుకుంటారా..? మళ్లీ పడిపోతారా..? పాక్‌తో మ్యాచ్‌లో టాస్ నెగ్గిన టీమిండియా..

Published : Aug 28, 2022, 07:06 PM ISTUpdated : Aug 28, 2022, 07:09 PM IST
Asia Cup: పగ తీర్చుకుంటారా..? మళ్లీ పడిపోతారా..? పాక్‌తో మ్యాచ్‌లో టాస్  నెగ్గిన టీమిండియా..

సారాంశం

India vs Pakistan: ప్రపంచ క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అతిపెద్ద క్రికెట్ యుద్ధం ప్రారంభమైంది. ఆసియా కప్-2022లో భాగంగా ఇండియా-పాకిస్తాన్ లు దుబాయ్ లో హోరాహోరి పోరుకు సిద్ధమయ్యాయి. ఈ రసవత్తర పోరులో టీమిండియా టాస్ నెగ్గింది.

ఎవరి నోట విన్నా.. ఏ క్రికెట్ అభిమానిని కదిలించినా.. నలుగురు కూర్చుని చర్చించినా.. పండితులైనా.. పామరులైనా.. అందరిదీ ఒకటే మాట..! గడిచిన  నెల రోజులుగా క్రికెట్ వర్గాల్లో ఒకటే చర్చ..!! అదే భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్. ఆసియా కప్-2022లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్ కోసం ఇరుదేశాల అభిమానులే కాదు.. యావత్ క్రికెట్ ఫ్యాన్స్ అంతా వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా భారతీయ క్రికెట్ అభిమానుల్లో ఉన్న ఒకే ఒక కోరిక.. ‘గతేడాది టీ20  ప్రపంచకప్‌లో పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలైనందుకు బదులు తీర్చుకోవాలి.. లెక్క సరిచేయాలి..’ మరి రోహిత్ అండ్ కో పగ తీర్చుకోనుందా..? లేదా..? అనేది కొద్దిసేపట్లో తేలనుంది. 

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్-పాక్ మ్యాచ్ లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.  బాబర్  ఆజమ్ నేతృత్వంలోని పాకిస్తాన్  టాస్ ఓడి బ్యాటింగ్ కు రానుంది. భారత జట్టు వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆడటం లేదు. అతడి స్థానంలో దినేశ్ కార్తీక్ జట్టులోకి వచ్చాడు.పాకిస్తాన్ జట్టులో నసీమ్ షా అరంగేట్రం చేశాడు.

గతేడాది టీ20 ప్రపంచకప్ లో భారత్ ను పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన తర్వాత టీమిండియా గ్రూప్ స్టేజ్ నుంచే వెనుదిరగాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత విరాట్ కోహ్లీ తప్పుకుని రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టాక భారత జట్టు  అన్ని విభాగాలలో దుర్బేధ్యంగా మారింది.  బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో దూకుడు మంత్రాన్ని పాటిస్తున్నది. మరి ఈ దూకుడు పాకిస్తాన్ మీద చూపెడుతుందా..? లేదా..?  అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. 

అందరి చూపు కోహ్లీ పైనే.. 

వెయ్యి రోజులకు పైగా సెంచరీ లేక తంటాలు పడుతున్న విరాట్ కోహ్లీ.. నెల రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ గ్రౌండ్ లోకి దిగుతున్నాడు. ఈ మ్యాచ్ లో అతడు రాణించాలని టీమిండియా కోరుకుంటున్నది. కోహ్లీ కెరీర్ సజావుగా సాగాలంటే కూడా ఆసియా కప్ కీలకం కానుంది. పాకిస్తాన్ పై మంచి రికార్డు కలిగిన అతడు.. ఈ మ్యాచ్ లో రాణిస్తాడని అంతా ఆశిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కోహ్లీకి ఇది వందో టీ20 మ్యాచ్. తద్వారా కోహ్లీ మూడు ఫార్మాట్లలో వంద మ్యాచ్ లు ఆడిన తొలి భారతీయ క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. 

ముఖాముఖి : ఆసియా కప్ లో ఇప్పటివరకు ఇరు జట్లు 14 సార్లు తలపడ్డాయి. ఇందులో 8 మ్యాచుల్లో భారత్ గెలవగా ఐదింటిలో పాక్ నెగ్గింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. ఇక ఇదే టోర్నీలో 2016లో జరిగిన టీ20 మ్యాచ్ లో విజయం భారత్ నే వరించింది. మొత్తంగా టీ20లలో భారత్-పాక్ లు 9 మ్యాచ్ లు ఆడాయి. అందులో భారత్ 6 మ్యాచుల్లో గెలవగా పాక్ రెండింటిలో గెలిచింది. ఒక మ్యాచ్ టై అయింది.

మ్యాచ్ ను ఇలా చూడొచ్చు : భారత్ లో ‘స్టార్’ నెట్వర్క్ లోని స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 1, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 2 హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ తమిళ్ లో వీక్షించే సదుపాయం ఉంది.  స్టార్ తో పాటు దూరదర్శన్ (డీడీ) స్పోర్ట్స్ లో కూడా ఈ మ్యాచ్ ను చూడొచ్చు. స్టార్  నెట్వర్క్ తో పాటు ఫోన్లలో చూసేవాళ్లకోసం ‘డిస్నీ హాట్ స్టార్’ లో కూడా ఈ మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించొచ్చు. 

తుది జట్లు : 
భారత్ :  రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్ 

పాకిస్తాన్ : బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, ఫకర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్‌దిల్ షా, అసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హరీస్ రౌఫ్, నసీమ్ షా, షాన్వాజ్ దహని 

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది