
ఆసియా కప్ 2022 టోర్నీలో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన భారత జట్టు సూపర్ 4 నుంచి నిష్కమించి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. టీమిండియా ఫైనల్ చేరలేదనే బాధకంటే దాయాది పాకిస్తాన్ ఫైనల్ చేరిందనే ఎక్కువగా ఫీల్ అయ్యారు చాలామంది...
సూపర్ 4 స్టేజీలో టీమిండియాపై ఘన విజయం అందుకున్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క వికెట్ తేడాతో విజయాన్ని అందుకుని ఫైనల్ చేరింది. అయితే ఆ తర్వాత శ్రీలంక చేతుల్లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడింది పాకిస్తాన్...
సూపర్ 4 రౌండ్‌లో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ని చిత్తు చేసిన శ్రీలంక,ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడిన తర్వాత కూడా మ్యాచ్ గెలిచి ఆరో ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది...
ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఆల్‌రౌండ్ విభాగాల్లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ చూపించగా పాకిస్తాన్ ఫీల్డింగ్‌లో చేసిన తప్పులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మహ్మద్ హస్నైన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఆఖరి బంతికి భనుక రాజపక్ష భారీ షాట్‌కి ప్రయత్నించాడు...
బౌండరీ లైన్ దగ్గ అసిఫ్ ఆలీ బంతిని చేతుల్లోకి అందుకున్నాడు. అయితే అతన్ని చూశాడు, చూడకుండా వచ్చాడో కానీ షాదబ్ ఖాన్, అసిఫ్ ఆలీని వేగంగా ఢీ కొట్టాడు. ఈ యాక్సిడెంట్ కారణంగా అసిఫ్ ఆలీ చేతుల్లో పడిన బంతి కాస్తా ఎగిరి బౌండరీ లైన్ బయటపడింది...
క్యాచ్ డ్రాప్ కావడమే కాకుండా బంతి నేరుగా బౌండరీ లైన్ అవతల పడడంతో రాజపక్షకు సిక్సర్ లభించింది. ఈ క్యాచ్ పట్టుకుని ఉంటే ఆఖరి ఓవర్ ముందు భనుక రాజపక్ష వికెట్ కోల్పోయి ఉండేది శ్రీలంక. అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రాజపక్ష, నదీం షా వేసిన ఆఖరి ఓవర్‌లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 15 పరుగులు రాబట్టాడు. దీంతో శ్రీలంక స్కోరు 170 పరుగులకు చేరింది...
ఇద్దరు ఫీల్డర్లు కలిసి క్యాచ్‌ని నేలపాలు చేయడం పాకిస్తాన్ క్రికెట్‌కి ఆనవాయితీగా వస్తోంది. టీమిండియాతో జరిగిన మ్యాచ్ సమయంలోనూ ఓ క్యాచ్ సమయంలో ఇద్దరు పాకిస్తాన్ ఫీల్డర్లు ఒకరినొకరు ఢీకొన్నారు. అయితే క్యాచ్ మాత్రం పట్టుకోగలిగారు..
ఈ వీడియోను వాడిన ఢిల్లీ పోలీస్ డిపార్ట్‌మెంట్... ‘అరె భాయ్... జరా దేక్ కే ఛలో’ అంటూ కాప్షన్ జోడించింది. దీనికి ‘రోడ్ సేఫ్టీ’ అనే హ్యాష్ ట్యాగ్‌ని జత చేయడమే కాకుండా రాజ్‌కుమార్ ‘మేరా నామ్ జోకర్’ మూవీలోని ‘అరె భాయ్ జరా దేక్ కే ఛలో’ పాటను వాడింది. రోడ్డు మీద కాస్త చూసుకుని వెళ్లాలనే ఉద్దేశంతో ఈ వీడియోను పోస్టు చేసినా, పాకిస్తాన్ టీమ్ ఫీల్డింగ్‌ని తీవ్రంగా ట్రోల్ చేసింది ఢిల్లీ పోలీస్ డిపార్ట్‌మెంట్...
171 పరుగుల లక్ష్యఛేదనలో బరిలో దిగిన పాకిస్తాన్, 20 ఓవర్లలో 147 పరుగులకి ఆలౌట్ అయ్యింది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 5 పరుగులకే అవుటై మరోసారి నిరాశపరచగా మహ్మద్ రిజ్వాన్ 49 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 55 పరుగులు చేశాడు...
ఫకార్ జమాన్ డకౌట్ కాగా ఇఫ్థికర్ అహ్మద్ 31 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేశాడు. మహ్మద్ నవాజ్ 6, ఖుష్‌దిల్ షా 2, షాదబ్ ఖాన్ 8, హరీస్ రౌఫ్ 13, నసీం షా 4 పరుగులు చేయగా అసిఫ్ ఆలీని వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గోల్డెన్ డకౌట్ చేశాడు వానిందు హసరంగ..
ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 23 పరుగుల విజయాన్ని అందుకున్న శ్రీలంక, టీమిండయా తర్వాత అత్యధిక సార్లు ఆసియా కప్ టైటిల్ గెలిచిన జట్టుగా నిలిచింది. భారత జట్టు ఇప్పటికే 7 సార్లు ఆసియా కప్ టైటిల్ గెలవగా, శ్రీలంకకి ఇది ఆరో ఆసియా కప్...