గంగూలీ మాటే నిజమైంది.. ఆసియా కప్ 2021కి వాయిదా: ఇప్పుడు పాక్ ఏం చెబుతుందో..!!

By Siva KodatiFirst Published Jul 9, 2020, 9:18 PM IST
Highlights

ఆసియా కప్ వాయిదా పడినట్లేనంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పిన మాట వాస్తవమైంది. కోవిడ్ 19 కారణంగా ఆసియా కప్ 2020ని వాయిదా వేస్తున్నామని ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) గురువారం అధికారికంగా ప్రకటించింది

ఆసియా కప్ వాయిదా పడినట్లేనంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పిన మాట వాస్తవమైంది. కోవిడ్ 19 కారణంగా ఆసియా కప్ 2020ని వాయిదా వేస్తున్నామని ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) గురువారం అధికారికంగా ప్రకటించింది.

2021లో ఈ టోర్నీకి శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుందని వెల్లడించింది. బాధ్యతాయుతమైన రీతిలో టోర్నిని నిర్వహించడానికే ఏసీసీ ప్రాధాన్యమిస్తుంది. 2021 జూన్‌లో ఈ మెగా టోర్నిని నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపింది.

ఏసీసీ ప్రకటనతో 2020 టోర్నీ హక్కుల్ని పాకిస్తాన్.. శ్రీలంకకు బదిలీ చేసింది. వాయిదాపడిన టోర్నీని శ్రీలంకే నిర్వహించాల్సి ఉంటుంది. 2022లో పాకిస్తాన్ ఆసియా కప్‌కు ఆతిథ్యమిస్తుందని ఏసీసీ వెల్లడించింది.

షెడ్యూల్ ప్రకారమే టోర్నీని నిర్వహించాలని అనుకున్నా ప్రయాణ ఆంక్షలు, నిబంధనలు, క్వారంటైన్, భౌతిక దూరం వంటి నియమాలు పాటించడం సవాల్‌తో కూడుకున్న పని.. అందరి క్షేమం కోసమే ఆసియా కప్‌ని వాయిదా వేస్తున్నామని ప్రకటించింది.

కాగా ఓ ప్రముఖ ఇంగ్లీష్ ఛానెల్‌తో జరిగిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో గంగూలీ ఆసియా కప్ 2020 రద్దయినట్లు పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల కారణంగా ఎప్పుడు మ్యాచ్‌లు జరుగుతాయో చెప్పలేమని గంగూలీ పేర్కొన్నారు.

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ముందుకు వెళతామని, తమకు ఆటగాళ్ల ఆరోగ్యమే ముఖ్యమని గంగూలీ స్పష్టం చేశారు. మరోవైపు ఆసియా కప్ రద్దయ్యిందంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మండిపడ్డింది.

ఆయన మాటలకు ఎలాంటి విలువ లేదని కొట్టిపారేశారు పీసీబీ మీడియా డైరెక్టర్ శామ్యూల్ హసన్ బర్నీ. అసలు ఆసియా కప్ రద్దు విషయాన్ని ధృవీకరించాల్సింది ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏససీ) అని ఆయన స్పష్టం చేశారు

click me!