ప్రధానుల మధ్య యాషెస్ గొడవ... బెయిర్‌స్టో రనౌట్‌‌తో ఆసీస్ ప్రధాని, సాండ్ పేపర్ మరిచిపోయానంటూ బ్రిటన్ ప్రధాని...

Published : Jul 12, 2023, 05:38 PM ISTUpdated : Jul 12, 2023, 07:11 PM IST
ప్రధానుల మధ్య యాషెస్ గొడవ... బెయిర్‌స్టో రనౌట్‌‌తో ఆసీస్ ప్రధాని, సాండ్ పేపర్ మరిచిపోయానంటూ బ్రిటన్ ప్రధాని...

సారాంశం

అంతర్జాతీయ వేదికపై యాషెస్ సిరీస్‌ గొడవ... జానీ బెయిర్‌స్టో వివాదాస్పద రనౌట్‌తో ఆసీస్ ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్, మూడో టెస్టు విన్నింగ్ సెలబ్రేషన్స్‌తో రిషి సునక్.. 

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్ సిరీస్‌కి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌కి తగ్గట్టుగానే 2023 యాషెస్ సిరీస్‌లో మొదటి మూడు టెస్టుల్లో హైడ్రామా పతాక స్థాయికి చేరింది. మొదటి రెండు టెస్టుల్లో నెగ్గిన ఆస్ట్రేలియా, 2-0 తేడాతో ఆధిక్యంలో నిలిస్తే, మూడో టెస్టులో నెగ్గిన ఇంగ్లాండ్ బోణీ కొట్టి యాషెస్ సిరీస్‌పై మరింత ఆసక్తి పెరిగేలా చేసింది..

ఈ యాషెస్ సిరీస్ గొడవ క్రికెట్ టీమ్స్‌కి మాత్రమే పరిమితం కాలేదు, ఏకంగా ఇరుదేశాల ప్రధానుల వద్దకు చేరింది. NATO సమ్మిట్‌లో భాగంగా లిథువేనియా రాజధాని విల్నియస్‌లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ మధ్య స్నేహపూర్వక సమావేశం జరిగింది. 

ఈ సమావేశంలో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి సుదీర్ఘంగా చర్చించుకున్న ఆంటోనీ ఆల్బనీస్, రిషి సునక్... అంతర్జాతీయ వేదికపై యాషెస్ సిరీస్‌ని తీసుకురావడం విశేషం..  తొలుత ఆంటోనీ ఆల్బనీస్ తనతో తెచ్చుకున్న కొన్ని పేపర్లు బయటికి తీసి రిషి సునక్‌కి చూపించాడు..

అందులో మొదటికి యాషెస్ సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్నామని ఉంది. దీనికి సమాధానంగా రిషి సునక్, తనతో తెచ్చుకున్న మూడో టెస్టు విన్నింగ్ సెలబ్రేషన్స్‌ని చూపించాడు. దీంతో ఇద్దరితో పాటు అక్కడున్నవారంతా పగలబడి నవ్వారు. ఆంటోనీ ఆల్బనీస్ అంతటితో ఆగకుండా ‘జానీ బెయిర్‌స్టో’ వివాదాస్పద అవుట్‌ని కూడా ప్రదర్శించాడు.

దీనికి రిషి సునక్... ‘సారీ.. నేను సాండ్ పేపర్ తీసుకురాలేదు..’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఈ ఇద్దరు ప్రధానులు సరదాగా చేసిన ఈ పని, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రెండో టెస్టులో జానీ బెయిర్‌స్టో రనౌట్ గురించి చాలా పెద్ద చర్చే జరిగింది. 

రెండో టెస్టు మ్యాచ్‌లో స్టేడియంలో కూర్చొని వీక్షించిన యూకే ప్రధాని రిషి సునక్,‘ఇది కరెక్ట్ కాదు.. గెలవడానికి ఏమైనా చేస్తారా?’ అంటూ కామెంట్ చేస్తే, ‘సేమ్ ఓల్డ్ ఆసీస్... విజయమే పరమావధి’ అంటూ ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ట్వీట్ చేశాడు...

ఓ క్రికెట్ సిరీస్ గురించి ఇలా రెండు దేశాల ప్రధానులు మాట్లాడుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నా... క్రికెట్ ఫ్యాన్స్ దీన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. యాషెస్ సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్‌లో జూలై 19 నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ టెస్టు మ్యాచ్ గెలిచి సిరీస్‌ని 2-2 తేడాతో సమం చేయాలని ఇంగ్లాండ్ భావిస్తుంటే... మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌ని చిత్తు చేసి, సిరీస్ సొంతం చేసుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది.

2002 నుంచి ఇంగ్లాండ్‌లో యాషెస్ సిరీస్ గెలవలేకపోయింది ఆస్ట్రేలియా. మిగిలిన రెండు టెస్టుల్లో ఒక్కటి గెలిచినా, లేదా రెండు మ్యాచులను డ్రా చేసుకున్నా 21 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డ మీద యాషెస్ గెలిచిన ఆస్ట్రేలియా టీమ్‌గా నిలుస్తుంది ప్యాట్ కమ్మిన్స్ టీమ్...

ఇప్పటికే నాలుగో టెస్టుకి టీమ్‌ని ప్రకటించింది ఇంగ్లాండ్. మూడో టెస్టులో విజయం దక్కడంతో ఆ టీమ్‌లో ఎలాంటి మార్పులు చేయకుండా నాలుగో టెస్టులో బరిలో దిగబోతున్నట్టు బెన్ స్టోక్స్ స్పష్టం చేశాడు. 

PREV
click me!

Recommended Stories

IPL Brand Value: ఐపీఎల్ జట్లకు బిగ్ షాక్.. సన్‌రైజర్స్, ఆర్సీబీ బ్రాండ్ విలువ ఢమాల్ ! కష్టమేనా?
ICC Rankings : వన్డే కింగ్ ఎవరు? రోహిత్ శర్మకు ఎసరు పెట్టిన విరాట్ కోహ్లీ.. కేవలం 8 పాయింట్లు !