సెంచరీతో రంజీ ఎంట్రీ ఇచ్చిన అర్జున్ టెండూల్కర్... 34 ఏళ్ల తర్వాత తండ్రి ఫీట్ రిపీట్ చేసిన సచిన్ తనయుడు...

By Chinthakindhi RamuFirst Published Dec 14, 2022, 3:04 PM IST
Highlights

ముంబై జట్టులో అవకాశాలు రాకపోవడంతో గోవా జట్టుకి మారిన అర్జున్ టెండూల్కర్... రాజస్థాన్‌తో మొదటి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగిన సచిన్ తనయుడు.. 

సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తల్లి అంజలి బాటలో నడిచి మెడిసిన్ విద్యను పూర్తి చేసింది. కొడుకు అర్జున్ టెండూల్కర్ మాత్రం తండ్రి బాటలో క్రికెటర్‌గా ఎదగాలని భావించాడు. అయితే ‘క్రికెట్ గాడ్’గా కీర్తించబడిన అర్జున్ టెండూల్కర్, దేశవాళీ టోర్నీల్లో ఆడడానికి కూడా అపసోపాలు పడాల్సి వచ్చింది...

ఏళ్లుగా ఎదురుచూస్తున్నా ముంబై టీమ్‌లో అవకాశం దొరకకపోవడంతో ఈ ఏడాది గోవా తరుపున ఆడుతున్నాడు అర్జున్ టెండూల్కర్. ముంబై తరుపున ఆరంగ్రేటం చేయలేకపోయిన అర్జున్‌కి రాజస్థాన్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఛాన్స్ ఇచ్చింది గోవా. రాక రాక వచ్చిన అవకాశాన్ని చక్కగా వాడుకున్నాడు అర్జున్ టెండూల్కర్...

రంజీ ఆరంగ్రేటం మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిపోయిన అర్జున్ టెండూల్కర్, 34 ఏళ్ల తర్వాత తండ్రి ఫీట్‌ని రిపీట్ చేశాడు. క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని రికార్డులెన్నో తన పేరిట లిఖించుకున్న ‘మాస్టర్’ సచిన్ టెండూల్కర్, 1988 డిసెంబర్ 11న రంజీ ట్రోఫీలో మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ చేయగా... 2022 డిసెంబర్ 14న అర్జున్ టెండూల్కర్ ఇదే ఫీట్ రిపీట్ చేశాడు...

మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో సెంచరీ చేసినప్పుడు సచిన్ టెండూల్కర్ వయసు 15 ఏళ్లు కాగా ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్, రంజీ ఆరంగ్రేటం చేసేందుకు 23 ఏళ్ల వరకూ ఎదురుచూడాల్సి వచ్చింది. రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 178 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీని అందుకున్న అర్జున్ టెండూల్కర్, సుయాష్ ప్రభుదేశాయ్‌తో కలసి ఆరో వికెట్‌కి డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు...

సుమిరన్ అమోంకర్ 9, అమోఘ్ సునీల్ దేశాయ్ 27 పరుగులు, స్నేహల్ సుహాస్ 59 , సిద్దేశ్ లాడ్ 17, ఎక్‌నాథ్ కేర్కర్ 3 పరుగులు చేసి అవుట్ కావడంతో 201 పరుగుల వద్ద 5 వికెట్లు కోల్పోయింది గోవా. ఈ దశలో వన్‌డౌన్‌లో వచ్చిన సుయాష్ ప్రభుదేశాయ్, అర్జున్ టెండూల్కర్‌తో కలిసి డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.  140 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ స్కోరు చేసింది గోవా...

ఐపీఎల్‌ 2021 వేలంలో ముంబై ఇండియన్స్, అర్జున్ టెండూల్కర్‌ని రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసింది. 2022 మెగా వేలంలోనూ అర్జున్ టెండూల్కర్ రూ.30 లక్షలు దక్కించుకుని, మళ్లీ ముంబై టీమ్‌లోకి తిరిగి వెళ్లాడు. అయితే రెండు సీజన్లుగా అర్జున్ టెండూల్కర్‌కి ఆరంగ్రేటం చేసే అవకాశం కూడా దక్కలేదు. 

2022 సీజన్‌లో 10 మ్యాచుల్లో చిత్తుగా ఓడి ఆఖరి పొజిషన్‌లో నిలిచింది ముంబై ఇండియన్స్. ఎప్పుడూ లేనంతగా ఈసారి నలుగురు కొత్త కుర్రాళ్లు ముంబై తరుపున ఆరంగ్రేటం చేశారు. అయితే సచిన్ వారసుడు మాత్రం ఈసారి కూడా రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు.

2023 రిటెన్షన్‌లో చోటు దక్కించుకున్న అర్జున్ టెండూల్కర్, వచ్చే ఐపీఎల్ సీజన్‌లో అయినా ఆరంగ్రేటం చేస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఆల్‌రౌండర్‌గా నిరూపించుకుని, టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేయాలని ఆశపడుతున్న అర్జున్... చెప్పుకోదగ్గ అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోతున్నాడు...
 

click me!