
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో రెండ్రరోజుల క్రితం దుబాయ్ వేదికగా ముగిసిన పోరు భారత్ తో పాటు క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించింది. చివరి ఓవర్ వరకూ ఫలితం తేలకపోవడంతో అందరూ ఈ మ్యాచ్ ను ఆసక్తిగా వీక్షించారు. టీ20 ప్రపంచకప్ కు కొద్దిరోజులు ముందు జరిగిన ఈ సమరం క్రికెట్ ఫ్యాన్స్ కు కావాల్సిన మజాను పంచింది. అయితే చాలాకాలంగా ఐసీసీ టోర్నీలలో మినహా ద్వైపాక్షిక సిరీస్ లు లేకపోవడంతో ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ దాహం ఇప్పట్లో తీరేది కాదు. భారత్-పాక్ జట్ల మధ్య రానున్న రెండు ఆదివారాల్లో మరో రెండు భారీ మ్యాచ్ లు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఆరు జట్లు తలపడుతున్న ఆసియా కప్-2022లో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, హాంకాంగ్ ఉన్నాయి. గ్రూప్-బీలో బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్తాన్ ఉన్నాయి.
టోర్నీ నిబంధనల ప్రకారం.. గ్రూప్ దశలో ఒక్కో జట్టు గ్రూప్ లోని మిగిలిన రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. టాప్-2లో ఉన్న జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి. ఇక సూపర్-4లో తమ గ్రూప్ లోని జట్టుతో పాటు మరో గ్రూప్ లోని రెండు జట్లతో రెండు మ్యాచులు ఆడతాయి. ఈ లెక్కన గ్రూప్ స్టేజ్ లో ఇప్పటికే భారత్.. పాకిస్తాన్ ను ఓడించింది. తర్వాత మ్యాచ్ లో భారత్.. ఆగస్టు 31న హాంకాంగ్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ లో ఏదైనా అనూహ్యం జరిగితే తప్ప భారత్ ఓడటం కష్టం. ఇక సెప్టెంబర్ 2న హాంకాంగ్.. పాకిస్తాన్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లోనూ పాక్ ఓడటం అతిశయోక్తే.
దీని ప్రకారం సూపర్-4లో భారత్ గ్రూప్ ఏ నుంచి తొలి జట్టుగా వెళ్లడం లాంఛనమే. పాకిస్తాన్ రెండో జట్టుగా వెళ్లే అవకాశముంది. దీంతో సెప్టెంబర్ 4న ఈ రెండు జట్లు మళ్లీ పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ ముగిశాక మిగిలిన గ్రూప్ లోని టాప్-2 (బీ1, బీ2)లతో కూడా భారత్, పాక్ లు మ్యాచ్ లు ఆడతాయి. ప్రస్తుత ఫామ్, సమీకరణాలను బట్టి చూస్తే ఒక్క అఫ్గాన్ తప్ప మిగిలిన జట్లేవీ భారత్, పాక్ కు పోటీనిచ్చే స్థితిలో లేవు. ఈ లెక్కన సెప్టెంబర్ 11న (ఆదివారం) భారత్-పాక్ మధ్య ఆసియా కప్ ఫైనల్ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఈ ఏడాది అక్టోబర్ లో మెల్బోర్న్ వేదికగా టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈ రెండు జట్లు ఢీకొనబోతున్నాయి. అంతకుముందే కేవలం 15 రోజుల వ్యవధిలో భారత్-పాక్ లు మధ్య ఈ మ్యాచ్ లు అభిమానులకు కావాల్సిన మజాను పంచుతాయనడంలో సందేహమే లేదు.
ఇక ఆదివారం నాటి భారత్-పాకిస్తాన్ మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో మహ్మద్ రిజ్వాన్ (43), ఇఫ్తికర్ అహ్మద్ (28) రాణించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4, హార్ధిక్ పాండ్యా 3, అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీయగా అవేశ్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు. స్వల్పలక్ష్య ఛేదనలో భారత్.. ఆదిలో తడబడింది. తొలి ఓవర్లోనే కెఎల్ రాహుల్ ను నసీం షా డకౌట్ చేశాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ ను కోహ్లీ (35) నిలబెట్టాడు. మిడిల్ లో వచ్చిన రవీంద్ర జడేజా (35)తో కలిసి హార్ధిక్ పాండ్యా (33 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ విజయంతో ఆసియా కప్ లో భారత్ బోణీ కొట్టింది.