ఇదే మీ బెడ్‌రూమ్‌లో జరిగితే? కోహ్లీ హోటల్ రూమ్ లీక్ వీడియోపై అనుష్క ఆగ్రహం.. సారీ చెప్పిన ‘క్రౌన్ పెర్త్’

By Srinivas MFirst Published Oct 31, 2022, 3:40 PM IST
Highlights

Virat Kohli: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ హోటల్  రూమ్ లో వస్తువులను ఏకరువు పెడుతూ  సోషల్ మీడియాలో లీకైన వీడియోపై అతడి భార్య అనుష్క శర్మ ఆగ్రహంం వ్యక్తం చేసింది. అదే తమ బెడ్‌రూమ్ లో జరిగితే ఊరుకుంటారా..? అని ఫైర్ అయింది.

విరాట్ కోహ్లీ హోటల్ రూమ్ కు సంబంధించిన వీడియో లీక్ పై  సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  హోటల్ నిర్వాహకులు, ఐసీసీ పై కోహ్లీ ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ వర్గాలు మండిపడుతున్నాయి. ఇది ఏమాత్రం సమ్మతం కాదని.. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించొద్దంటూ   ఆగ్రహం వ్యక్తమువుతున్నది. ఇదే విషయమై కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా తన ఇన్స్టా స్టోరీస్ లో  స్పందిస్తూ.. ఇదే మీ బెడ్ రూమ్ లో జరిగితే ఊరుకుంటారా..?అని  ఫైర్  అయింది. 

పెర్త్ లో కోహ్లీ ఉన్న క్రౌన్ పెర్త్ హోటల్ లో అతడు ఉంటున్న రూమ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో లీకైంది. ఈ వీడియోలో కోహ్లీ వాడే గ్లాసులు, క్యాప్,  ఫోన్, షూస్, టీమిండియా జెర్సీతో పాటు తన బట్టలు, కోహ్లీ వాడే న్యూట్రీషన్  పౌడర్ బాక్స్, తదితర వస్తువులన్నీ వీడియో లో రికార్డు చేసిన  ఓ ఆగంతకుడు దానిని సోషల్ మీడియాలో  పోస్ట్ చేశారు. 

అనుష్క స్పందన.. 

అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా  అనుష్క  స్పందిస్తూ.. ‘గతంలో కూడా పలువురు అభిమానులు  చేసిన దారుణమైన ఘటనలను ఎదుర్కున్నాను కానీ ఇది చెత్తగా ఉంది. ఇది సంపూర్ణ అవమానపరిచే చర్య.  సెలబ్రిటీలు అయితే ఇలాంటివి ఎదుర్కోవాలని కొంతమంది అంటున్నారు. వాళ్లందరికీ నేను ఒక ప్రశ్న అడుగుదామనుకుంటున్నా. ఒకవేళ ఇలాంటివే  మీ బెడ్ రూమ్ లో జరిగితే అప్పుడు ఏం చేస్తారు..? ఇవి  ఏ మాత్రం సహించలేనివి..’ అని తన ఆగ్రహం వ్యక్తం చేసింది. 

క్షమాపణ చెప్పిన క్రౌన్ పెర్త్.. 

ఈ ఘటన జరిగిన  క్రౌన్ పెర్త్ హోటల్ కోహ్లీకి  బహిరంగ క్షమాపణలు చెప్పింది. ఈ ఘటనకు కారణమైన  వ్యక్తిని వదిలిపెట్టమని తెలిపింది. అంతేగాక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను  కూడా ఆ ఫ్లాట్ ఫారమ్ ల నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చింది.  

ఐసీసీ స్పందన.. 

కోహ్లీ హోటల్ గది వీడియో లీక్ పై  ఐసీసీ  విచారం వ్యక్తం చేసింది. ఇది ఒక ఆటగాడి గోప్యతకు సంబంధించిన విషయమని..  కోహ్లీ విషయంలో ఇలా జరిగినందుకు తాము చింతిస్తున్నామని తెలిపింది. ఈవెంట్ హోటల్స్ తో కలిసి తాము పనిచేస్తున్నామని.. ఆటగాళ్ల ప్రైవసీ విషయంలో మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

కోహ్లీ ఆగ్రహం.. 

ఈ ఘటనపై కోహ్లీ  స్పందించాడు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ‘అభిమానులు తమ అభిమాన ఆటగాడిని గురించిన వ్యక్తిగత విషయాలను తెలుసుకునేందుకు, వారికి కలిసేందుకు  చాలా  ఉత్సాహంగా ఉంటారు. ఆ విషయంలో నేను వారిని అభినందిస్తాను కూడా. కానీ ఇక్కడ కనబడుతున్న వీడియో  భయంకరగంగా ఉంది. ఇది నా గోప్యత (ప్రైవసీ) కు సంబంధించిన విషయం. నేను   ఉండే హోటల్ రూమ్ లో కూడా గోప్యతను కలిగిలేకపోతే ఇంకెక్కడ  పొందుతాను..? ఈ రకమైన అభిమానాన్ని  నేను ఏ మాత్రం ఎంకరేజ్ చేయను. దయచేసి వ్యక్తుల  ప్రైవసీని గౌరవించండి. వారిని ఒక వినోద వస్తువుగా పరిగణించవద్దు..’అని రాసుకొచ్చాడు. 
 

click me!