అక్కడ రాజకీయం.. ఇక్కడ ఆర్థికం.. రెండు సంక్షోభాల నడుమ పాక్-శ్రీలంక ల సిరీస్ సాగేనా..?

Published : Apr 13, 2022, 05:38 PM IST
అక్కడ రాజకీయం.. ఇక్కడ ఆర్థికం.. రెండు సంక్షోభాల నడుమ  పాక్-శ్రీలంక ల సిరీస్ సాగేనా..?

సారాంశం

Pakistan - Sri lanka Series: ఒక దేశంలో రాజకీయ సంక్షోభం.. మరో దేశంలో ఆర్థిక మాంద్యం.. కారణాలేవైనా  రెండు దేశాలలో ప్రజలు మాత్రం రోడ్డెక్కుతున్నారు. అయితే ఈ రెండు దేశాల మధ్య త్వరలో టెస్టులు, వన్డేలు జరగాల్సి ఉంది. 

పాకిస్తాన్  మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానంలో విశ్వాసం కోల్పోవడం  ఆ దేశంలో రాజకీయ సంక్షోభానికి దారి తీసింది. ఇక ద్రవ్యోల్బనం పెరిగి ఆర్థిక మాంద్యం కోరల్లో చిక్కుకుపోయిన శ్రీలంక.. ఆకలి బాధలతో కొట్టుమిట్టాడుతోంది. పాక్ లో రాజకీయ సంక్షోభం అని బయటకు చెప్తున్నా ఆ దేశం ఇమ్రాన్ ఖాన్  పాలనలో నిరుద్యోగం, పేదరికం పెరగడంతోనే జనాల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. రెండు దేశాల్లో ఒకటే రకమైన సంక్షోభం. మరి ఈ రెండు దేశాలు త్వరలోనే క్రికెట్ ఆడనున్నాయి.   ప్రజలకు మూడు పూటలా తిండి పెట్టలేని శ్రీలంక.. పాకిస్తాన్ తో  టెస్టు, వన్డే సిరీస్ నిర్వహిస్తానంటున్నది. జూలై లో పాక్.. శ్రీలంక పర్యటనకు రావాల్సి ఉంది. 

ఈ ఏడాది జులై లో పాకిస్తాన్.. రెండు టెస్టులు, రెండు వన్డేలు ఆడేందుకు లంకకు రానున్నది. ఈ సిరీస్ కు సంబంధించిన  పూర్తి షెడ్యూల్ ఇంకా ఖరారుకాకపోయినా  పర్యటన మాత్రం ఉంటుందని రెండు దేశాల బోర్డులు  ధీమా వ్యక్తం చేశాయి. 

అయితే ఆర్థిక సంక్షోభం కారణంగా   ఆగస్టు - సెప్టెంబర్ లలో లంక వేదికగా నిర్వహించాలనుకున్న టీ20 ఆసియాకప్ ను  దుబాయ్ కు తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు క్రికెటర్లు కూడా లంకలో నిరసనకారులకు మద్దతుగా రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న తరుణంలో శ్రీలంక  క్రికెట్ బోర్డు మాత్రం సిరీస్ జరుగుతుందని చెప్పడం గమనార్హం.  పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నది. 

‘శ్రీలంకలో క్రికెట్ వ్యవహారాలకు వచ్చిన నష్టమేమీ లేదు. పాక్ తో సిరీస్ యథావిధిగా జరుగుతుంది.  ప్రణాళిక ప్రకారమే దానిని నిర్వహిస్తాం. దీనిని వాయిదా వేయడం గానీ,  రద్దు చేయడం  వంటి విషయాలపై ఇరు దేశాలు ఏమీ మాట్లాడుకోలేదు..’ అని శ్రీలంక  క్రికెట్ బోర్డు ప్రతినిధి ఒకరు తెలిపారు. 

ఆసీస్ ఇచ్చిన జోష్ తో.. 

ఇక పాకిస్తాన్ కు రాక రాక వచ్చిన ఆస్ట్రేలియా పర్యటన ఇచ్చిన జోష్ తో వరుసగా  సిరీస్ లు నిర్వహించాలని  పీసీబీ భావిస్తున్నది. గతేడాది అర్థాంతరంగా నిలిచిపోయిన వెస్టిండీస్ సిరీస్ ను  ఈ జూన్ లో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇరు జట్లలో పలు కొవిడ్ కేసులు రావడంతో వెస్టిండీస్ తో మూడు  వన్డేల సిరీస్ ను వాయిదా వేసిన విషయం తెలిసిందే.  అప్పుడే నిర్వహించిన టీ 20 సిరీస్ ను పాక్ 3-0తో గెలిచింది. వెస్టిండీస్, శ్రీలంక తర్వాత పాకిస్తాన్.. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్నది. ఆ దేశంతో ఏడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు
IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు