
మహేంద్ర సింగ్ ధోని.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడేమో.. చెన్నై సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడేమో గానీ అతడు వ్యూహాలు మాత్రం ఇప్పటికీ ప్రత్యర్థుల ఊహకు కూడా అందవు. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచు లో ఇది మరోసారి నిరూపితమైంది. ఆర్సీబీ కీలక ఆటగాడు ఆ జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లిని తన ఉచ్చులో బంధించాడు ధోని. కోహ్లి గురించి క్షుణ్ణంగా తెలిసిన ధోని.. అతడి కోసం ప్రత్యేకంగా ఫీల్డింగ్ సెట్ చేశాడు. అదేంటి.. చెన్నై సారథి రవీంద్ర జడేజా కదా.. ధోని ఎందుకు ఫీల్డింగ్ సెట్ చేస్తాడు అంటే అదంతే.. కెప్టెన్ అన్న ట్యాగ్ మాత్రమే పోయిందే తప్ప ఇప్పటికీ చెన్నైకి అనధికార సారథి ధోనియే..
కాగా మంగళవారం నాటి మ్యాచులో డుప్లెసిస్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చాడు కోహ్లి. మూడు బంతుల్లో చేసింది ఒక్క పరుగే. కానీ కోహ్లి ఉంటే ఆటను మలుపు తిప్పగలడని ధోనికి తెలుసు. దీంతో అతడి కోసం ప్రత్యేకంగా ఫీల్డింగ్ సెట్ చేశాడు. ఫైన్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న శివమ్ దూబేను డీప్ స్క్వేర్ లెగ్ వద్దకు రప్పించాడు. బౌలర్ ముఖేష్ చౌదరికి కూడా ఫీల్డింగ్ కు అనుగుణంతానే బంతిని విసరాలని ఆదేశాలు అందాయి.
అంతే.. కోహ్లిని పెవిలియన్ పంపడానికి ప్రణాళిక సిద్ధం. ఆర్సీబీ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో తొలి బంతి.. చౌదరి వేసిన బంతిని షాట్ ఆడబోయాడు కోహ్లి. బంతి లేచి నేరుగా డీప్ స్క్కేర్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న దూబే చేతుల్లో పడింది. ఇది ఆర్సీబీని కోలుకోలేని దెబ్బతీసింది. అప్పటికే డుప్లెసిస్ ఔటైన స్థితిలో ఉన్న ఆర్సీబీ.. వరుసగా తర్వాత ఓవర్లో రెండో వికెట్ కోల్పోయింది.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ధోని వ్యూహాలు ఎవరికీ అందవని చెన్నై అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కెప్టెన్ అయినా కాకున్నా ధోని ధోనియేనని మాజీ సారథిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
కాగా మంగళవారం నాటి మ్యాచులో సీఎస్కే అద్భుత ఆటతీరుతో బెంగళూరుకు చుక్కలు చూపి సీజన్ లో తొలి విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలి 10 ఓవర్లలో 60 పరుగులే చేసిన సీఎస్కే.. ఆఖరు పది ఓవర్లలో ఏకంగా 156 రన్స్ రాబట్టింది. శివమ్ దూబే (95 నాటౌట్), రాబిన్ ఊతప్ప (88) లు శివాలెత్తారు. బదులుగా ఆర్సీబీ.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆర్సీబీలో షాబాజ్ అహ్మద్ (41), దినేశ్ కార్తీక్ (34), సుయస్ ప్రభుదేశాయ్ (34) మినహా మిగిలినవారంతా విఫలమయ్యారు. ఫలితంగా చెన్నై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుసగా 3 విజయాల తర్వాత బెంగళూరుకు ఇది తొలి ఓటమి. సీజన్ లో రెండో పరాజయం.