
నెలరోజులుగా ఉత్కంఠ మధ్య సాగుతున్న ఆసియా కప్-2022 నిర్వహణపై శ్రీలంక క్రికెట్ బోర్డు తేల్చేసింది. తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయి ఉన్న తాము ఈ టోర్నీని నిర్వహించలేమని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కి తెలిపినట్టు సమాచారం. టోర్నీ నిర్వహణకు తాము సుముఖంగా లేమని, ప్రస్తుతం తమ దేశంలో నెలకొన్న పరిస్థితులతో ఆసియా కప్ నిర్వహణ అనేది బోర్డుకు తలకుమించిన భారమే అవుతుందని ఏసీసీకి విన్నవించినట్టు తెలుస్తున్నది.
ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఆసియా కప్ ను నిర్వహించేందుకు ఏసీసీ ప్రతినిధులు షెడ్యూల్ కూడా ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే నిన్నామొన్నటి వరకు తమదేశంలోనే ఆసియా కప్‌ను నిర్వహించాలని ఏసీసీని కోరిన ఎస్ఎల్‌సీ తన నిర్ణయాన్ని మార్చుకుంది.
ఆస్ట్రేలియాతో మూడు ఫార్మాట్ల సిరీస్ లను విజయవంతంగా నిర్వహించినా.. ప్రస్తుతం పాకిస్తాన్ తో టెస్టు సిరీస్‌ను కూడా ఏ ఆటంకాలు లేకుండా నిర్వహిస్తున్న లంక.. ఆసియా కప్ నిర్వహణ మాత్రం తమ వల్ల కాదంటూ తేల్చేసింది. ఆరు దేశాలు పాల్గొనబోయే ఈ టోర్నీలో ఆటగాళ్లకు హోటల్ వసతులు, స్టేడియంలో సౌకర్యాల కల్పన, ఇతరత్రా ఖర్చు తడిసిమోపడవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లంక లో ఒక్క పూట తిండి దొరకడానికే నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ నిర్వహించి అపకీర్తి మూటగట్టుకోవడం కంటే తప్పుకోవడమే ఉత్తమమన్న నిర్ణయానికి ఎస్ఎల్సీ వచ్చినట్టు సమాచారం.
యూఏఈలో..?
శ్రీలంక కాకుంటే బంగ్లాదేశ్ లో అయినా ఈ సిరీస్ నిర్వహించేందుకు ఏసీసీ ప్రతినిధులు ప్రయత్నాలు చేసినట్టు గతంలో వార్తలు వచ్చాయి. గతంలో ఏసీసీ అధికారులు కూడా ‘శ్రీలంకలో సాధ్యం కాకుంటే మేము బంగ్లాదేశ్ ను స్టాండ్ బై గా పెట్టుకున్నాం..’ అని తెలిపిన విషయం విదితమే. కానీ ఇప్పుడు బంగ్లా కూడా రేసు నుంచి తప్పుకుంది. ఈ టోర్నీని నిర్వహించేందుకు యూఏఈ క్రికెట్ బోర్డును సంప్రదించినట్టు తెలుస్తున్నది. బీసీసీఐ, ఎస్ఎల్‌సీ తో పాటు ఏసీసీ ప్రతినిధులు కూడా యూఏఈ క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తున్నది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.