
Ajinkya Rahane : టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానే గురువారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దీంతో దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన అతని కెరీర్‌కు తెరపడింది. ఈ నిర్ణయాన్ని రహానే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ వీడియో ద్వారా ధృవీకరించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నట్లు చెప్పాడు.
"జీవితంలో ప్రతిదానికీ ఒక ఆరంభం, ఒక ముగింపు ఉంటాయి. సమయం వచ్చినప్పుడు దాన్ని గౌరవించి ముందుకు సాగాలి. నా బ్యాటింగ్‌లో నేను ఎప్పుడూ టైమింగ్‌పైనే ఆధారపడ్డాను. దాని ప్రాముఖ్యత నాకు బాగా తెలుసు" అని రహానే అన్నాడు.
"ఇప్పుడు నేను తప్పుకోవడానికి, అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది. చిన్నప్పుడు ప్రాక్టీస్ కోసం ప్రయాణాలు చేసిన రోజుల నుంచి, ఈ ఆటకు నా సర్వస్వం ఇచ్చాను. ప్రతిరోజూ, ప్రతి ఇన్నింగ్స్‌లో, బ్యాటింగ్ చేసే ప్రతి అవకాశంలోనూ, ఇండియా క్యాప్ ధరించాలనేదే నా కల" అని జోడించాడు.
తన కెరీర్‌లో ఎప్పుడూ దేశానికి, జట్టుకే మొదటి ప్రాధాన్యం ఇచ్చానని, నిజాయితీగా ఆడానని రహానే చెప్పాడు. "నేను ఒకే ఒక్క సింపుల్ రూల్ పాటించాను. ఎప్పుడూ నాకంటే ముందు నా దేశం, నా జట్టు గురించే ఆలోచించాను. నేను ఈ గేమ్‌ను పూర్తి నిజాయితీతో ఆడాను. మన ఉద్దేశం సరిగ్గా ఉంటే, ఆట మనల్ని ఎప్పుడూ కాపాడుతుందని నేను నమ్మాను" అని ఈ వెటరన్ క్రికెటర్ అన్నాడు.
తన కెరీర్‌ను గుర్తుచేసుకుంటూ, తాను ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసినప్పటి నుంచి భారత క్రికెట్ ఎంతో ఎదిగిందని, ఈ ప్రయాణంలో తాను భాగమైనందుకు గర్వంగా ఉందని రహానే చెప్పాడు. "ఒక భారత క్రికెటర్‌గా నా అధ్యాయం ముగిసినా, ఆటతో నా ప్రయాణం ఆగదు. రాబోయే తరానికి సహాయం చేయడానికి, ఈ క్రీడ నాకు నేర్పిన విలువలను పంచుకోవడానికి, నాకు సర్వస్వం ఇచ్చిన ఈ ఆటకు తిరిగి ఇవ్వడానికి ఎదురుచూస్తున్నాను," అని అన్నాడు.
తన కెరీర్ మొత్తం తనకు అండగా నిలిచిన బీసీసీఐ, ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA), సహచరులు, కోచ్‌లు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు, కుటుంబం, స్నేహితులు, అభిమానులకు రహానే ధన్యవాదాలు తెలిపాడు. "నా ప్రతీ గెలుపు ఓటమిలో నాకు సపోర్ట్ గా నిలిచిన క్రికెట్ అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అజింక్యా అంటే ఓటమి ఎరుగని వాడు, కానీ క్రికెట్ నాకు చాలాసార్లు ఓటమిని చూపించింది. క్రికెటర్లుగా మేం గెలిచేదానికంటే ఎక్కువసార్లు ఓడిపోతాం. నా జట్టు మ్యాచ్‌లు ఓడిపోయింది. నేను తప్పులు చేశాను, కానీ ఒక్క చోట మాత్రం నేను ఎప్పుడూ ఓడిపోలేదు. అది మీ గుండెల్లోనే. మీ ప్రేమకు, మీ నమ్మకానికి, మీ సపోర్ట్ కు ధన్యవాదాలు. క్యాప్ నంబర్ 278, సైనింగ్ ఆఫ్" అని రహానే ముగించాడు.
టెస్టుల్లో రహానే 85 మ్యాచ్‌లు, 144 ఇన్నింగ్స్‌లు ఆడి 5,077 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని సగటు 38.46, స్ట్రైక్ రేట్ 49.50. వన్డేల్లో, 90 మ్యాచ్‌లు, 87 ఇన్నింగ్స్‌లలో 2,962 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని సగటు 35.26, స్ట్రైక్ రేట్ 78.63. ఇక టీ20ల్లో, 20 మ్యాచ్‌లు, 20 ఇన్నింగ్స్‌లలో 375 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉంది. అతని సగటు 20.83, స్ట్రైక్ రేట్ 113.29.
టెస్ట్ కెప్టెన్‌గా రహానేకు అద్భుతమైన రికార్డు ఉంది. అతని కెప్టెన్సీలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. నాలుగు విజయాలు, రెండు డ్రాలు సాధించింది. కనీసం ఐదు మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసిన భారత కెప్టెన్లలో అత్యధిక విజయాల శాతం రహానేదే. 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మెల్‌బోర్న్‌లో చరిత్రాత్మక విజయం, గబ్బాలో ఆస్ట్రేలియా అజేయ రికార్డుకు బ్రేక్ వేసి సిరీస్‌ను 2-1తో గెలవడం అతని కెప్టెన్సీకే హైలైట్. అంతేకాకుండా 2017లో ధర్మశాలలో ఆస్ట్రేలియాపై, 2018లో ఆఫ్ఘనిస్తాన్‌పై కూడా జట్టును విజయపథంలో నడిపించాడు.