
టీమిండియా టెస్టు జట్టు మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానేకు దక్షిణాఫ్రికా పర్యటన చాలా కీలకం. శ్రేయస్ అయ్యర్, హనుమా విహారి వంటి బ్యాటర్ల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న రహానేకు ఈ పర్యటన చివరి అవకాశంగా క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో విఫలమైతే ఇక రహానే కెరీర్ ముగిసినట్టే అని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెంచూరియన్ టెస్టులో రాణించడం రహానేకు అత్యంత కీలకం. తొలి ఇన్నింగ్సులో భారత సారథి విరాట్ కోహ్లీ ఔటయ్యాక వచ్చిన అతడు.. క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదే క్రమంలో క్రీజులో ఎక్కువసేపు ఉండటానికి.. ‘బంతిని చూడు.. బంతిని చూడు..’ అని తనలో తానే అనుకుంటూ మెరుగైన ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు.
సెంచూరియన్ వేదికగా టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో రహానే ప్రస్తుతం 40 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. 81 బంతులాడిన రహానే.. 8 ఫోర్ల సాయంతో క్రీజులో నిలదొక్కుకున్నాడు. ఈ క్రమంలో గతంలో చేసిన తప్పులనే మళ్లీ చేయకుండా ఉండేందుకు.. తనకు తానే మోటివేట్ చేసుకుంటున్నాడు. ‘బంతిని చూసి ఆడు...’ తనలో అనుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది.
గత కొద్దికాలంగా రహానే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. చివరి 21 ఇన్నింగ్సులలో అతడి సగటు 19.57 గా ఉంది. అంతేగాక ఆఖరుసారి అతడు సెంచరీ చేసింది 2020లో. ఆస్ట్రేలియా లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో మూడంకెల స్కోరు చేసిన రహానే.. మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన చేయలేదు. ఇక ఇటీవలే ముగిసిన న్యూజిలాండ్ టూర్ లోనూ, అంతకంటే ముందు జరిగిన ఇంగ్లాండ్ పర్యటనలోనూ అతడి ప్రదర్శన అంతంతమాత్రమే.
దీంతో దక్షిణాఫ్రికా పర్యటనకు రహానేను ఎంపిక చేస్తారా..? లేదా..? ఒకవేళ జట్టులో పేరున్నా తుదిజట్టులో ఆడతాడా..? అనేది అనుమానంగా మారింది. కానీ కోహ్లీ, కోచ్ రాహుల్ ద్రావిడ్ మాత్రం రహానే అనుభవంపై నమ్మకం ఉంచారు. ఇటీవలే టెస్టు అరంగ్రేటం చేసి సెంచరీతో ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్, ఫామ్ లో ఉన్న హనుమా విహారిని కాదని మరీ రహానేకు అవకాశం దక్కింది. అందివచ్చిన అవకాశాన్ని రహానే సద్వినియోగం చేసుకున్నాడు. ఇప్పటికైతే ఫర్వాలేదనిపించినా.. మూడంకెల స్కోరు గనక చేయగలిగితే ఇక రహానేకు తిరుగులేనట్టే..
ఇక తొలి టెస్టులో భారత జట్టు ఫస్ట్ డే ఆధిక్యం ప్రదర్శించింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్ (122 నాటౌట్), మయాంక్ అగర్వాల్ (60) ల సెంచరీ భాగస్వామ్యంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతుంది. వన్ డౌన్ లో వచ్చిన ఛతేశ్వర్ ఫుజారా (0) మరోసారి నిరాశపరిచినా కెప్టెన్ విరాట్ కోహ్లీ (35) భారీ స్కోరు చేయడంలో విఫలమైనా ఉన్నంతసేపు సాధికారికంగానే బ్యాటింగ్ చేశాడు. రహానే (40 నాటౌట్) తో పాటు రాహుల్ క్రీజులో ఉన్నారు. నిన్నటి జోరు కొనసాగిస్తే భారత్ భారీ స్కోరు చేయడం పక్కా..