ఐపీఎల్ లో గాయాలు.. సఫారీ సిరీస్ కు ఆరుగురు కీలక ఆటగాళ్లు డౌటే.. కోహ్లికి రెస్ట్ ఖాయం..?

By Srinivas MFirst Published May 12, 2022, 4:53 PM IST
Highlights

India Squad For SA T20I Series: వచ్చే నెల భారత పర్యటనకు రానున్న దక్షిణాఫ్రికాతో టీమిండియా ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనున్నది. అయితే ఈ సిరీస్ కు ముందు భారత జట్టు గాయాల పాలవుతున్నది. 

ఐపీఎల్-15 ముగిసిన (మే29) వెంటనే భారత జట్టు వారం రోజుల తర్వాత ఆటగాళ్లు తిరిగి జాతీయ జట్టు బాధ్యతలు మోయనున్నారు. సౌతాఫ్రికాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కోసం ఇప్పటికే బీసీసీఐ సెలెక్షన్ కమిటీ.. చర్చోపచర్చలు సాగిస్తున్నది. మే 23న  ముంబైలో గల బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో  టీమిండియా సారథి రోహిత్ శర్మ తో పాటు  హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ లతో  చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ భేటీ కానున్నది. ఈ నేపథ్యంలో  సెలెక్టర్లకు ఐపీఎల్ గాయాలు పెద్ద తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి.  కొంతమంది ఫామ్ కోల్పోయి తంటాలు పడుతుండగా మరికొందరేమో గాయాల బారిన పడ్డారు. గాయాల పాలైన ఆటగాళ్లు సపారీలతో టీ20 సిరీస్ ఆడటం అనుమనాంగానే ఉంది. 

ఐపీఎల్ సీజన్ కు ముందే గాయపడి  బెంగళూరులోని రిహాబిటేషన్ సెంటర్ లో చికిత్స తీసుకుంటూ మళ్లీ రెండో సారి గాయపడ్డ దీపక్ చాహర్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడితో పాటు ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, సీఎస్కే ఆల్  రౌండర్ రవీంద్ర జడేజాలకు గాయమైంది.  ఇక ఆర్సీబీ  మాజీ సారథి విరాట్ కోహ్లి కి రెస్ట్ ఇవ్వడం దాదాపు ఖాయమైంది. 

ఐపీఎల్ లో గాయాలపాలైన క్రికెటర్లు : 

- దీపక్ చాహర్ : తొడ కండరాల గాయం (కోలుకుంటున్నాడు) 
- రవీంద్ర జడేజా  : పక్కటెముకల గాయం (ఇటీవలే ఐపీఎల్ నుంచి కూడా తప్పుకున్నాడు)
- సూర్యకుమార్ యాదవ్ - కండరాల గాయం 
- టి.నటరాజన్  
- వాషింగ్టన్ సుందర్ 

పనిభారం వల్ల రెస్ట్ కోరుకుంటున్న ఆటగాళ్లు :

- జస్ప్రీత్ బుమ్రా 
- భువనేశ్వర్ కుమార్ 
- మహ్మద్ షమీ
- రిషభ్ పంత్
- విరాట్ కోహ్లి 

గాయాలు,  ఆటగాళ్ల విశ్రాంతికి సంబంధించి బీసీసీఐ సెలెక్షన్ కమిటీకి చెందిన ఓ సభ్యుడు మాట్లాడుతూ.. ‘అవును.. భారత జట్టు తరఫున ఫస్ట్ చాయిస్ అనుకునే  పలువురు ఆటగాళ్లు గాయాల బారిన పడుతుండటమో లేక  తీరిక లేని క్రికెట్ వల్ల ఫామ్ కోల్పోవడమో వల్ల రెస్ట్ కావాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కీలక సిరీస్ ముందున్న వేళ పటిష్టమైన జట్టును ఎంపిక చేయడం కత్తిమీద సాము వంటిది. దీపక్ చాహర్ కోలుకుంటున్నా అతడి రాకపై ఇప్పుడే ఏం చెప్పలేం. జడేజా పరిస్థితి పై  నిర్ణయం తీసుకోవాల్సి ఉంది..’ అని తెలిపాడు. 

భారత జట్టు ఎంపిక అప్పుడే.. 

- మే 23న  సెలెక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి ముందే రోహిత్, ద్రావిడ్ తో భేటీ అవనుంది. 
- విరాట్ కోహ్లికి విశ్రాంతినివ్వడం పై చర్చ. 
- మే 25న జట్టు ప్రకటన 
- జూన్ 9 నుంచి జూన్ 19 వరకు దక్షిణాఫ్రికాతో ఐదు టీ20లు 

సీనియర్లకు గాయాలు, విశ్రాంతి నేపథ్యంలో 15 మందిని ఎంపిక చేయడం సెలెక్టర్లకు తలకు మించిన భారమే అయినా ఐపీఎల్ లో మెరుస్తున్న పలువురు ఆటగాళ్లకు టీమిండియా ద్వారాలు తెరిచే అవకాశముంది. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ను నడిపిస్తున్న హార్ధిక్ పాండ్యా, ఆర్సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, రాహుల్ తెవాటియా, ఉమ్రాన్ మాలిక్ వంటి ఆటగాళ్ల పేర్లను కూడా పరిశీలించే అవకాశముంది. ఇక ఐపీఎల్ లో దారుణంగా విఫలమవుతున్న వెంకటేశ్ అయ్యర్ కు తుది జట్టులో చోటు దక్కడం అనుమానమే. 

click me!