ఓపెనింగ్ మ్యాచ్‌కు ముందే గుజరాత్‌కు భారీ షాక్.. గాయంతో టోర్నీ నుంచి స్టార్ ఆల్‌రౌండర్ ఔట్..

Published : Mar 04, 2023, 05:15 PM IST
ఓపెనింగ్ మ్యాచ్‌కు ముందే  గుజరాత్‌కు భారీ షాక్.. గాయంతో టోర్నీ నుంచి స్టార్ ఆల్‌రౌండర్ ఔట్..

సారాంశం

WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో  నేడు తొలి మ్యాచ్ ఆడనున్న  గుజరాత్ జెయింట్స్ కు ఆదిలోనే  ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ గాయంతో  టోర్నీ నుంచి నిష్క్రమించింది. 

డబ్ల్యూపీఎల్ లో నేటి రాత్రి ముంబై ఇండియన్స్ తో తలపడనున్న గుజరాత్ జెయింట్స్ కు  ఓపెనింగ్ మ్యాచ్ కు ముందే ఊహించని షాక్ తాకింది. గత నెలలో ముగిసిన వేలంలో ఆ జట్టు రూ. 60 లక్షలు పెట్టి దక్కించుకున్న డియోండ్ర డాటిన్.. గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమైంది. ఈ మేరకు గుజరాత్ జెయింట్స్ తన ట్విటర్ ఖాతా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.  

డియోండ్ర డాటిన్ గాయంతో సీజన్ నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో ఆస్ట్రేలియా  ఆల్ రౌండర్ కిమ్ గార్త్ ను  రిప్లేస్ చేసుకుంది.   శుక్రవారమే ఆమె టీమ్ తో జాయిన్ అయినట్టు గుజరాత్  జెయింట్స్ తెలిపింది. 

కిమ్ గార్త్.. గత నెలలో  జరిగిన వేలంలో పాల్గొన్నా ఆమె కోసం  ఏ ఫ్రాంచైజీ కూడా బిడ్  వేయలేదు.  కానీ ఇప్పుడు డాటిన్ కు రిప్లేస్‌మెంట్ గా  గార్త్ ను ఎంపిక చేయడం విశేషం.  గార్త్ ఆస్ట్రేలియా తరఫున  ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ లో  సభ్యురాలిగా ఉంది.  ఆసీస్ ఆడిన రెండు  వార్మప్ మ్యాచ్ లలో ఆమె ఆడింది.   ప్రధాన  మ్యాచ్ లలో అవకాశం రాకున్నా ఆమెకు అనూహ్యంగా డబ్ల్యూపీఎల్ లో అవకాశం రావడం గమనార్హం. 

వాస్తవానికి గార్త్.. ఐర్లాండ్ దేశస్తురాలు.   గతంలో ఆమె ఐర్లాండ్ తరఫున ఆడింది. కానీ  ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ లో  మెల్‌బోర్న్ స్టార్స్ తో మూడేండ్ల ఒప్పందం కుదుర్చుకున్న  గార్త్.. ఆస్ట్రేలియా పౌరసత్వాన్ని పొందింది.   వరల్డ్ కప్ లో ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆమె ఐర్లాండ్ కు వ్యతిరేకంగా ఆడింది.  

 

మ్యాచ్  షెడ్యూల్ లో మార్పులు.. 

ఇదిలాఉండగా నేడు  ముంబై ఇండియన్స్ - గుజరాత్ మధ్య జరగాల్సిన మ్యాచ్  అరగంట ఆలస్యంగా ప్రారంభం కానున్నది.   బాలీవుడ్ నటీమణులు కియారా అద్వానీ, కృతి సనన్ తో పాటు  గాయకులు శంకర్ మహదేవన్, ఎపి దిల్లాన్ లు ప్రత్యేక ప్రదర్శన   నాలుగు గంటల నుంచే మొదలుకావాల్సి ఉండగా దానిని  కూడా సాయంత్రం 6.25 గంటలకు మార్చారు.  మ్యాచ్  కూడా 8 గంటల నుంచి మొదలుకానుంది.  7.30 గంటలకు ఇరు జట్ల సారథులు (హర్మన్‌ప్రీత్ కౌర్, బెత్ మూనీ) టాస్ కు రానున్నారు.   

డబ్ల్యూపీఎల్ లో ఐదు జట్లు - కెప్టెన్లు : 

- ముంబై ఇండియన్స్ : హర్మన్‌ప్రీత్ కౌర్ 
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : స్మృతి మంధాన 
- యూపీ వారియర్స్ : అలీస్సా హీలి 
- గుజరాత్ జెయింట్స్ : బెత్ మూనీ 
- ఢిల్లీ క్యాపిటల్స్ : మెగ్ లానింగ్ 

చూడటమిలా.. : 

డబ్ల్యూపీఎల్ మీడియా, డిజిటల్ హక్కులను  వయాకామ్ 18  (జియో) దక్కించుకున్న విషయం తెలిసిందే.   నేటి నుంచి జరుగబోయే మ్యాచ్ లన్నీ  టెలివిజన్ లో అయితే  స్పోర్ట్స్ 18 ఛానెల్ లో చూడవచ్చు. అదే యాప్ లో చూడాలనుకుంటే జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారాలుంటాయి.  ప్రస్తుతానికి జియో సినిమా యాప్ లో  రుసుములేమీ చెల్లించకుండానే  ఉచితంగానే మ్యాచ్ లను వీక్షించొచ్చు.  

PREV
click me!

Recommended Stories

5 Wickets in 1 Over : W, W, W, W, W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ కొత్త చరిత్ర
Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !