అసలే ఆర్సీబీ.. ఆపై గాయాలు.. గాయంతో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ ఔట్..! ఐపీఎల్‌లో కోహ్లీ టీమ్‌కూ మొదలవుతున్న కష్టాలు..

Published : Mar 15, 2023, 08:21 PM IST
అసలే ఆర్సీబీ.. ఆపై గాయాలు.. గాయంతో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ ఔట్..! ఐపీఎల్‌లో కోహ్లీ టీమ్‌కూ మొదలవుతున్న కష్టాలు..

సారాంశం

IPL 2023: ఐపీఎల్ లో మిగతా టీమ్ ల మాదిరిగానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కూడా గాయాల కష్టాలు మొదలయ్యాయి.   గాయంతో ఆ జట్టు  ఆల్ రౌండర్ సీజన్ లో ఆడేది అనుమానంగానే ఉంది. 

ఇండియన్  ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ ఆరంభానికి ముందే   ఆ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగలనుంది.  మిగతా జట్ల మాదిరే బెంగళూరు కూడా ఆటగాళ్లకు గాయాలతో సతమతమవుతోంది.   ఇప్పటికే  ఆర్సీబీకి ఆడుతున్న స్టార్ ఆల్ రౌండర్లు  గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ హెజిల్వుడ్.. ఈ సీజన్ ఆడతారా..? లేదా..? అనేది అనుమానంగానే ఉంది. తాజాగా  ఆ జట్టు మరో ఆల్ రౌండర్, ఇంగ్లాండ్ కు చెందిన విల్ జాక్స్  కూడా  దూరమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

ఇటీవలే బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుతో  జాక్స్ కూడా ఉన్నాడు. అయితే రెండో వన్డే సందర్భంగా జాక్స్ ఎడమ తొడ కండరాలు పట్టేడయంతో అతడు మూడో వన్డే నుంచి తప్పుకున్నాడు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతడిని హుటాహుటిన   లండన్ కు   రప్పించింది. 

తాజాగా ఇదే విషయమై  ఈసీబీ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ..  రాబోయే సీజన్ లో విల్ జాక్స్ ఆడటం కష్టమని తేల్చేశాడు.  ప్రస్తుతం అతడు వైద్యుల సంరక్షణలో చికిత్స పొందుతున్నాడని, కోలుకోవడానికి మరికొన్ని  వారాలు సమయం పట్టే అవకాశముందని  తేల్చేశాడు.  ఈ విషయాన్ని ఇదివరకే ఆర్సీబీకి  తేల్చి చెప్పినట్టు  వివరించాడు.  

ఈసీబీ వివరణ తర్వాత ఆర్సీబీ కూడా  మరో ఆల్ రౌండర్ వేటలో నిమగ్నమైంది.  ఈ ఏడాది  జనవరిలో భారత్ కు వచ్చిన న్యూజిలాండ్ పర్యటనలో కీలకంగా వ్యవహరించిన  ఆ జట్టు యువ ఆల్ రౌండర్ మైఖేల్ బ్రాస్‌వెల్ ను  తీసుకోనున్నట్టు తెలుస్తున్నది.  

 

కాగా గతేడాది డిసెంబర్ లో ముగిసిన ఐపీఎల్ మినీ వేలంలో  జాక్స్ ను  ఆర్సీబీ రూ. 3.2 కోట్లకు దక్కించుకుంది.   గతేడాది  సెప్టెంబర్ లో  పాకిస్తాన్ తో టీ20 లు ఆడుతూ ఎంట్రీ ఇచ్చిన  జాక్స్.. అదే ఏడాది టెస్టులలో కూడా చోటు దక్కించుకున్నాడు.  స్పిన్ తో పాటు మిడిలార్డర్ లో  మెరుపులు మెరిపించడంలో   జాక్స్ దిట్ట.  రావల్పిండి టెస్టులో తొలి మ్యాచ్ లోనే  జాక్స్ ఆరు వికెట్లు తీసి పాకిస్తాన్ పతనాన్ని శాసించాడు. ఇటీవల ముగిసిన  దక్షిణాఫ్రికా టీ20 లీగ్ (ఎస్ఎ టీ20)  లో కూడా  ప్రిటోరియా క్యాపిటల్స్ తరఫున ఆడిన  జాక్స్  మెరుగైన ప్రదర్శనలు చేశాడు.  ఇక ఐపీఎల్ లో ఇంతవరకూ ట్రోఫీ నెగ్గని జట్లలో ఒకటిగా ఉన్న ఆర్సీబీ  కీలక మ్యాచ్ లలో ఓడటం.. ఆ తర్వాత ఫ్యాన్స్ ఆగ్రహానికి గురికావడం తెలిసిందే.  స్టార్ ప్లేయర్లు ఉంటేనే ఇలా ఉంటే ఇక కీలక ఆటగాళ్లు దూరమైతే ఆర్సీబీ పరిస్థితి ఏంటో..? అని  ఆ జట్టు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !