
మరో మూడు వారాల్లో మొదలుకావాల్సి ఉన్న ఐపీఎల్ - 16 సీజన్ కు ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాకుల మీద షాకులు తాకుతున్నాయి. గతేడాది డిసెంబర్ లో ముగిసిన ఐపీఎల్ మినీ వేలంలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ ను భారీ ధరకు దక్కించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తాజాగా.. ఈ సీజన్ కు అతడి సేవలను కోల్పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బంగ్లాదేశ్ తో ఇంగ్లాండ్ ఆడుతున్న వన్డే సిరీస్ లో భాగంగా ఉన్న జాక్స్.. రెండో వన్డేలో గాయపడ్డాడు.
రెండో వన్డే సందర్భంగా జాక్స్ ఎడమ తొడ కండరాలు పట్టేడయంతో అతడు మూడో వన్డే నుంచి తప్పుకున్నాడు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతడిని హుటాహుటిన లండన్ కు రావాలని సూచించింది. త్వరలోనే కీలక ఐపీఎల్ సీజన్ ఉన్న నేపథ్యంలో విల్ జాక్స్ అప్పటివరకు కోలుకుంటాడా..? లేడా..? అన్నది ఈసీబీ తేల్చాల్సి ఉంది.
ఇప్పటికే ఆర్సీబీ.. సీజన్ లో కొన్ని మ్యాచ్ లకు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు జోష్ హెజిల్వుడ్ తో పాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్ సేవలను కోల్పోనుంది. ఈ ఇద్దరూ గాయాలతో ఇబ్బందులు పడుతున్నవారే. హెజిల్వుడ్ అయితే బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ కోసం ఇండియాకు వచ్చి కూడా ఢిల్లీ టెస్టు అయ్యాక తిరిగి సిడ్నీకి వెళ్లిపోయాడు. గాయం నుంచి పూర్తిస్థాయిలో కోలుకోకుంటే ఈ ఇద్దరికీ ఐపీఎల్ లో ఆడటానికి క్రికెట్ ఆస్ట్రేలియా క్లీయరెన్స్ ఇవ్వకపోవచ్చు. అదే జరిగితే ఆర్సీబీకి భారీ ఎదురుదెబ్బే. ఇక ఇప్పుడు జాక్స్ కూడా దూరమైతే ఆ జట్టు కు నిరాశ తప్పదు.
గతేడాది డిసెంబర్ లో ముగిసిన ఐపీఎల్ మినీ వేలంలో జాక్స్ ను ఆర్సీబీ రూ. 3.2 కోట్లకు దక్కించుకుంది. గతేడాది సెప్టెంబర్ లో పాకిస్తాన్ తో టీ20 లు ఆడుతూ ఎంట్రీ ఇచ్చిన జాక్స్.. అదే ఏడాది టెస్టులలో కూడా చోటు దక్కించుకున్నాడు. స్పిన్ తో పాటు మిడిలార్డర్ లో మెరుపులు మెరిపించడంలో జాక్స్ దిట్ట. రావల్పిండి టెస్టులో తొలి మ్యాచ్ లోనే జాక్స్ ఆరు వికెట్లు తీసి పాకిస్తాన్ పతనాన్ని శాసించాడు. ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా టీ20 లీగ్ (ఎస్ఎ టీ20) లో కూడా ప్రిటోరియా క్యాపిటల్స్ తరఫున ఆడిన జాక్స్ మెరుగైన ప్రదర్శనలు చేశాడు.