కీలక క్యాచ్ మిస్ చేసిన సిరాజ్.. చహార్, రోహిత్‌ల ఆగ్రహం.. వీడియో వైరల్

By Srinivas MFirst Published Oct 5, 2022, 11:25 AM IST
Highlights

IND vs SA T20I: ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య ముగిసిన మూడో మ్యాచ్ లో భారత జట్టు  అన్నిరంగాల్లో విఫలమైంది. ఈ మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ కీలక క్యాచ్  మిస్ చేసి విమర్శలపాలయ్యాడు. 

ఇండోర్ వేదికగా ముగిసిన మూడో టీ20లో భారత జట్టు అన్ని రంగాల్లో విఫలమైంది.  బౌలింగ్, బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్ లో కూడా విఫలమై తీవ్ర విమర్శల పాలవుతున్నది. మూడో టీ20లో  భారత ఫీల్డింగ్ అధ్వాన్నంగా ఉంది.  బౌండరీ లైన్ వద్ద మన ఫీల్డర్లు పలు క్యాచ్ లు మిస్ చేశారు. దీపక్ చహార్ వేసిన చివరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్ ను కూడా సిరాజ్ మిస్ చేశాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ తో పాటు  చహార్ కూడా సిరాజ్ చేసిన పనికి  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం ఫీల్డింగ్..? అన్నట్టు సిరాజ్ ను మందలించారు. 

అప్పటికే 200 పరుగులు దాటిన  దక్షిణాఫ్రికా స్కోరుకు చివరి ఓవర్లో  దీపక్ చహార్ కళ్ళెం వేశాడు.   ట్రిస్టన్ స్టబ్స్ ను ఔట్ చేసిన తర్వాత  చివరి నాలుగు బంతులు ఉండగా  మిల్లర్  క్రీజులోకి వచ్చాడు. తొలి బంతికే సిక్సర్ బాదాడు.

అయితే రెండో బంతి నేరుగా వెళ్లి  బౌండరీ లైన్ వద్ద ఉన్న సిరాజ్ చేతుల్లో పడింది. కానీ తన వెనకాల ఏముందో చూసుకోని సిరాజ్.. వెళ్లి బౌండరీ లైన్ వద్ద అడుగేశాడు. దీంతో  అంపైర్ దానిని నాటౌట్ గా ప్రకటిస్తూనే ఆరు పరుగులు కూడా ఇచ్చాడు. 5 బంతుల్లోనే మిల్లర్.. 3 సిక్సర్లతో  19 పరుగులు చేశాడు. మిల్లర్  క్యాచ్ ను సిరాజ్ పట్టి ఉంటే  టీమిండియా లక్ష్యం కనీసం 15 పరుగులైనా తగ్గేది. 

అయితే సిరాజ్ క్యాచ్ మిస్ చేయడంతో  బౌలర్ దీపక్ చహార్.. అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.  రోహిత్ శర్మ కూడా  అదే భావంతో సిరాజ్ ను చూశాడు. అయితే క్యాచ్ అందుకుని బౌండరీ లైన్ తాకిన సిరాజ్ మాత్రం.. కొద్ది క్షణాలకే తన తప్పును తెలుసుకుని  ముక్కుమీద వేలు వేసుకున్నాడు.  సిరాజ్ పై చహార్, రోహిత్ ఆగ్రహం చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

 

pic.twitter.com/ElkZ1E8zNV

— Guess Karo (@KuchNahiUkhada)

ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య ముగిసిన మూడో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు  నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేశారు.  రిలే రోసో (48 బంతుల్లో 100 నాటౌట్) సెంచరీతో మెరవగా క్వింటన్ డికాక్ (68), ట్రిస్టన్ స్టబ్స్ (23) రాణించారు.  అనంతరం భారీ లక్ష్య ఛేదనలో  భారత్.. 18.3 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌట్ అయింది.  భారత జట్టులో  దినేశ్ కార్తీక్ (46) టాప్ స్కోరర్ కాగా దీపక్ చహార్ (31)  మెరుపులు మెరిపించాడు.  మూడో టీ20  ఓడినా భారత్ తొలి రెండు మ్యాచ్ లు గెలిచి 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.   

 

Rohit to Siraj after dropping catch pic.twitter.com/6iFyKqAcSA

— Raj kumar (@brajukumar1)
click me!